మా అబ్బాయిని ఎన్నికల్లో ఓడించండంటున్న  ఒక మాజీ సిఎం
x
ఎకె ఆంటోని , సీనియర్ కాంగ్రెస్ నేత

మా అబ్బాయిని ఎన్నికల్లో ఓడించండంటున్న ఒక మాజీ సిఎం

ఆయనో మాజీ ముఖ్యమంత్రి. కొడుకులకు కూతుళ్లకు ఆర్జించిపెట్టడం మీద దృష్టి లేదు. ఆయనకు దేశం ముఖ్యం. దేశం కోసం ఇపుడు ఆయన కొడుకును ఓడించాలని అడుగుతున్నారు. ఏమిటా కథ?


మన పిల్లలు పదో తరగతి పరీక్షలు రాస్తుంటేనే.. దేవుడా దేవుడా.. ఎట్టోకట్టా మా పిల్లాడ్ని పాస్‌ చేయించు స్వామీ అని వంద మొక్కులు మొక్కుతాం, కనీసం ఓ అరడజను ముందు పాస్‌ అయిన తర్వాత ఓ వంద కొబ్బరి కాయలు కొడతామని ఆ దేవుడికి హామీ ఇస్తాం. అదే ఎన్నికలైతే ఇక చెప్పాల్సిన పనే లేదు.. ఏమో కాలం కలిసివచ్చి.. బుగ్గకార్లో తిరిగే చాన్స్‌ వచ్చే ఎమ్మెల్యేనో, ఎంపీగిరీనో వస్తే ఆ కుటుంబానికి కనీసం రెండు మూడు తరాలు తిరిగి చూసుకోవాల్సిన పనే లేదన్నది నేటి రాజకీయ సత్యం. రాజకీయాలకు అర్థం మారిపోయి స్వార్ధమే పరమార్థమైన నేటి రోజుల్లో ఇక్కడో తండ్రి దేవుడా నా కొడుకును గెలిపించకుండా ఉండు స్వామీ అంటున్నారు. టికెట్‌ కోసమే నానా హైరానా పడి, రాకపోతే గుండెపోటుతోనో, వంటికి అగ్గిపెట్టుకోనో తనువు చాలిస్తున్న రోజుల్లో ఈ తండ్రి కోర్కె చాలా విచిత్రంగా ఉంది కదూ.. ఇంతకీ ఆ తండ్రి ఎవరో తెలుసా.. ఏకే ఆంటోనీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి. రాజకీయాల్లో ఓటమెరుగుని ధీరుడు. అత్యంత ప్రతిభాశాలి, చాలామందితో పోలిస్తే చాలా నీతిపరుడు కూడా. కాంగ్రెస్‌ పార్టీకున్న పది మంది పెద్దల జాబితాలో ఈయన ఒకరు. ఆయన కుమారుడు అనిల్‌ కే ఆంటోనీ ఇటీవల కాంగ్రెస్‌కు బద్దశత్రువైన భారతీయ జనతా పార్టీలో చేరారు.

కేరళలో కాంగ్రెస్‌ నుంచి ఏ ప్రముఖుడు వచ్చినా టికెట్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న బీజేపీ ఈ అనిల్‌కి కేరళలోని పతనంతిట్ట లోక్‌సభ సీటును కేటాయించింది. ఇది ఏమాత్రం ఇష్టం లేని తండ్రి ఏకే ఆంటోనీ తన కుమారుడు గెలవకుండా ఉంటే చాలంటున్నారు. ఇది సిద్ధాంత వైరమే గాని కుటుంబ వైరం కాదని తేల్చిచెప్పారు. ఆయన ఆ మాట ఎందుకన్నారంటే...



అనిల్ కె ఆంటోనీ



అనిల్‌ బీజేపీలో చేరేటప్పుడే తండ్రి ఆంటోనీ వద్దని వారించారు. తప్పు చేస్తున్నావని హెచ్చరించారు. అయినా ఆయన మాట వినలేదు. దీంతో ఏమీ చేసేది లేక చాలాకాలంగా మౌనంగా ఉండి పోయారు. ఇప్పుడు అనిల్‌ నామినేషన్‌ వేశారు. ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆంటో ఆంటోనీ పూర్తి మెజారిటీ గెలవాలని ఆకాంక్షించారు. ఏకే ఆంటోనీ ఏమి చెబుతారా? అని ఎదురు చూసిన చాలామందికి తన కుమారుడు ఓడిపోవాలని అని చెప్పినప్పుడు ఇది కదా విలువలకు కట్టుబడి ఉండడం అంటే అన్పించిందట.
83 ఏళ్ల కేరళ మాజీ ముఖ్యమంత్రి ఆంటోనీ తన ఆరోగ్య సమస్యల్ని పక్కనబెట్టి చావో రేవో తేల్చుకోవాల్సిన యుద్ధంలో మావాడు ఓడిపోవాలన్నారు. ఇది భారతదేశ ఆలోచనను, దాన్ని కాపాడటానికి ఉద్దేశించిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలివి. అందుకే నేను బయటకు వచ్చి తన వైఖరిని స్పష్టం చేయాలని భావించా. ‘ఇది డూ–ఆర్‌–డై యుద్ధం‘ అంటున్నారు భారతదేశ రక్షణ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఎకె ఆంటోనీ. ఆంటోనీ చాలా కాలంగా తిరువనంతపురంలోని ఇంటికే పరిమితమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రచారానికి కూడా వెళ్లడం లేదు. పతనంతిట్టలో ప్రచారానికి వెళ్లకపోయినా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆంటో ఆంటోనీ పూర్తి మెజారిటీతో గెలుస్తారని చెప్పారు ఏకే ఆంటోనీ.
‘నాకు నా కుటుంబం, రాజకీయాలు విభిన్నమైనవి. ఈ వైఖరి కొత్తది కాదు, నేను కేరళ స్టూడెంట్స్‌ యూనియన్‌లో ఉన్న రోజుల నుంచి దానిని కొనసాగిస్తున్నాను‘ అన్నారు ఆంటోనీ. కేరళ స్టూడెంట్స్‌ యూనియన్‌ అనేది కేరళ కాంగ్రెస్‌ విద్యార్థి సంస్థ. అటువంటి మీరు మీ కుమారుడు బీజేపీలో చేరడాన్ని ఎలా చూస్తారని మీడియాపదే పదే అడిగినప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానం ‘కాంగ్రెస్‌ నా మతం‘ అనే.
తన తండ్రి వ్యాఖ్యలపై కుమారుడు అనిల్‌ కూడా ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్‌ నాయకుడైన తన తండ్రి పాత తరం నాయకుడు. అటువంటి వాళ్ల పట్ల తనకు సానుభూతి మాత్రమే ఉంది. పుల్వామా తీవ్రవాద దాడికి సంబంధించి ఇటీవల వివాదాస్పద ప్రకటనలు చేసిన ప్రస్తుత ఎంపీ, కాంగ్రెస్‌ సభ్యుడు ఆంటో ఆంటోనీకి మద్దతు ఇచ్చినందుకు మాజీ రక్షణ మంత్రి అయిన తన తండ్రికి నేను నా సానుభూతి మాత్రమే తెలుపగలను అన్నారు అనిల్‌ ఆంటోనీ. పతనంతిట్టలో తానే గెలుస్తానన్నారు.
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలైన ఏకే ఆంటోనీ, కె.కరుణాకరన్‌ పిల్లలు ఇటీవల బీజేపీలో చేరారు. ఆంటోనీ కుమారుడు అనిల్, కరుణాకరన్‌ కుమార్తె పద్మజ వేణుగోపాల్‌ బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఏకే ఆంటోనీ చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద వరమనే చెప్పాలి. ఏకే ఆంటోనీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్‌ ఆశిస్సులతోనే అనిల్‌ పార్టీ మారారన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఏకే ఆంటోనీ చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్‌ పార్టీకి ఈ దేశం పట్ల, రాజ్యాంగం పట్ల ఉన్న విధేయతకు అద్దం పట్టాయని పలువురు సీనియర్‌ నేతలు ప్రశంసించారు.
సుమారు మూడేళ్ల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. కేరళలో ఓపక్క వామపక్ష ఫ్రంట్‌ను మరోపక్క బీజేపీని ఎదుర్కొంటూనే కాంగ్రెస్‌ ఎలా ముందుకు సాగిందో వివరించారు. భారతదేశ పునరుద్ధరణ, భారత రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించడానికి ప్రజలు కాంగ్రెస్‌ వెనుక నిలవాలని పిలుపిచ్చారు. ‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భారత దేశ భావనను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రమాదాన్ని ఎలా ఆపాలనేది ముఖ్యమైన ప్రశ్న‘ అన్నారు ఆంటోనీ. కేరళలో బీజేపీకి మంచిరోజులు పోయాయని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మూడో స్థానంలో నిలుస్తుందని అంచనా వేశారు ఆంటోనీ. ‘దయచేసి దీన్ని రాసి పెట్టుకోండి. కేరళలోని అన్ని నియోజకవర్గాల్లో వారు 3వ స్థానంలో ఉంటారు‘ అని శపథం చేశారు ఆంటోని. శబరిమల మహిళల ప్రవేశ వివాదం కారణంగా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బిజెపికి స్వర్ణయుగం ఏర్పడిందని, వారు కొన్ని అదనపు ఓట్లను సంపాదించగలరని, ఇప్పుడా పరిస్థితి లేదన్నది ఆంటోని వాదన.
ఇప్పుడున్న సీపీఎం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పైనా ఆంటోనీ విరుచుకుపడ్డారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో విజయన్‌కి లేదా ఆయన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. దాన్ని సృష్టించిన ఘనత భారత జాతీయ కాంగ్రెస్, డాక్టర్‌ అంబేద్కర్‌కు దక్కుతుంది. ‘భారతదేశానికి లభించిన స్వాతంత్య్రం స్వాతంత్య్రం కాదని సీపీఎం పేర్కొంది. కలకత్తా థీసిస్‌ ద్వారా నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చింది‘ అని గుర్తుచేశారు ఆంటోనీ. ‘కలకత్తా థీసిస్‌‘ అనేది 1948లో కలకత్తాలో జరిగిన రెండవ కాంగ్రెస్‌ సందర్భంగా కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) రూపొందించిన పత్రం. ఈ థీసిస్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ విప్లవానికి పిలుపిచ్చింది.
బిఆర్‌ అంబేద్కర్‌ సహాయంతో రాజ్యాంగాన్ని రూపొందించింది ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌సి)కి చెందిన మెజారిటీ సభ్యులున్న రాజ్యాంగ కమిటీ అని, అటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపిచ్చే హక్కు కాంగ్రెస్‌కు తప్ప మరేపార్టీకి లేదన్నారు. నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఆంటోనీ.‘బీజేపీ అధికారంలోకి వస్తే, భారత రాజ్యాంగం విధ్వంసం అవుతుంది, అది ప్రజాస్వామ్యానికి అంతం అవుతుంది. మనం ఆ ప్రమాదాన్ని దూరం చేయాలి‘ అన్నారు ఆంటోనీ. అందులో భాగంగానే తన కుమారుడైనా ఓడిపోవాలని కోరుకున్నారు ఆంటోని. దీనిపై దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ సాగుతోంది. రాజకీయాలంటే స్వార్థమే కాదు దేశ ప్రయోజనమూ అనే వాళ్లు ఇంకా మిగిలే ఉన్నారా అని ఆంటోనీ ప్రకటన చూశాక అనిపించిందన్నారు ప్రముఖ గాంధేయవాది ఎస్‌.సుబ్రమణ్యేశ్వరరావు.
Read More
Next Story