క్షమాపణ చెప్పిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..
x

క్షమాపణ చెప్పిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..

శాసనసభలో ఆర్‌ఎస్‌ఎస్ గీతం పాడడంపై సొంత పార్టీ నేతలు ఎలా స్పందించారు?


Click the Play button to hear this message in audio format

ఎట్టకేలకు కర్ణాటక(Karnataka) డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) క్షమాపణ చెప్పారు. ఇటీవల ముగిసిన శాసనసభ వర్షాకాల సమావేశంలో ఆయన ఆర్‌ఎస్‌ఎస్(RSS) గీతంలోని కొన్ని పదాలను ఉచ్చరించారు. దాంతో ఆయనపై సొంత పార్టీ సీనియర్ నేతల నుంచి, అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.


‘ఆమోదయోగ్యం కాదు’..

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు బీకే హరిప్రసాద్ విలేఖరులతో మాట్లాడుతూ.. "బీజేపీ సహజంగానే ఇలాంటి వాటిని స్వాగతిస్తుంది. మహాత్మా గాంధీ హత్యకు కారణమైన ఆర్‌ఎస్‌ఎస్‌ను దేశంలో మూడుసార్లు నిషేధించారు. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా పాడితే మాకు అభ్యంతరం లేదు, కానీ కేపీసీపీ అధ్యక్షుడిగా పాడితే ఆమోదయోగ్యం కాదు. పార్టీ కార్యకర్తలకు డీకే క్షమాపణ చెప్పాలి." అని అన్నారు.

ఇటీవల హైకమాండ్ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి మంత్రి పదవి కోల్పోయిన కె.ఎన్. రాజన్న, సీనియర్ నాయకుడు సతీష్ జారకిహోళి తదితరులు కూడా శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం పాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


క్షమాపణ చెప్పిన డీకే..

చివరకు డీకే శివకుమార్ క్షమాపణ చెప్పి వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. "నా వ్యాఖ్యలు పార్టీ నాయకులు, కార్యకర్తలను బాధపెట్టి ఉంటే చింతిస్తున్నాను. క్షమాపణ కోరుతున్నా. నా వ్యక్తిగత వైఖరి కంటే పార్టీ నాకు ముఖ్యం. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటాను" అని డీకే పేర్కొన్నారు.


ఇంతకు అసెంబ్లీలో ఏం జరిగింది?

కర్ణాటక అసెంబ్లీలో శుక్రవారం (ఆగస్టు 22న) చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాట(Stampede) ఘటనపై చర్చ జరిగింది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తొక్కిసలాటకు డీకే శివకుమారే కారణమని బీజేపీ ఎమ్మెల్యే శివకుమార్ ఆరోపించారు. ‘‘బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీంను ఆయనే రిసీవ్ చేసుకున్నారు. చిన్నస్వామి స్టేడియం వరకు కొనసాగే విక్టరీ పరేడ్‌కు ఆయనే జెండా ఊపారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని డిమాండ్ చేశారు.

డీకే ప్రతిస్పందిస్తూ... "నమస్తే సదా వత్సలే మాతృభూమి" అంటూ ఆర్ఎస్ఎస్ గీతంలోని కొన్ని పదాలను ఉచ్చరిస్తూ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. వెంటనే ప్రతిపక్ష బీజేపీ శాసనసభ్యుల నుంచి చప్పట్లు వినిపించాయి. ఇటు కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేలను నిశ్శబ్దం ఆవరించింది. "తొక్కిసలాట ఘటన తర్వాత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని మీరు గుర్తించాలి. పోలీసు అధికారులు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చర్య తీసుకున్నందుకు మీరు గర్వపడాలి" అని అన్నారు డీకే.

ఇంకా ఇలా మాట్లాడారు. "ప్రమాదం జరిగింది. ఇలాంటివి ఇతర రాష్ట్రాలలో కూడా జరిగాయి. కావాలంటే ఆ ఘటనల జాబితాను చదివి వినిపిస్తా. నేను కూడా మీ గురించి చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను" అని పేర్కొన్నారు.

Read More
Next Story