
చెన్నైలో అమిత్ షా బీజీ బీజీ..
పార్టీ నాయకులతో భేటీ - 2026 ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం - రేపు కొత్త చీఫ్ పేరును ప్రకటించే అవకాశం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) చెన్నై(Chennai) టూర్ బీజీబీజీగా సాగుతోంది. బీజేపీ(BJP) జాతీయ నేత డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్ర నాయకులు గురువారం విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.
టార్గెట్ ఎలక్షన్స్..
పార్టీ నాయకులు, సీనియర్ కార్యకర్తలతో షా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పనితీరు గురించి తెలుసుకోనున్నారు. పొత్తు అవకాశాల గురించి వారితో చర్చించనున్నట్లు సమాచారం. 2026 జరిగే ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు.
‘షా పర్యటన మాకు ఉత్తేజానిస్తుంది..’
"మేం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. సాధారణంగా ఎన్నికలకు ఏడాది ముందుగానే పనులు మొదలుపెడతాం. షా పర్యటన మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది" అని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడొకరు పీటీఐతో అన్నారు.
‘ఆ నిర్ణయం అధిష్టానానిదే’
ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), బీజేపీపై అధికార డీఎంకే(DMK) చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని షా తిప్పికొట్టే అవకాశం ఉందని పార్టీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, కోయంబత్తూర్ సౌత్ శాసనసభ్యురాలు వానతి శ్రీనివాసన్(Vanathi Srinivasan) పేర్కొన్నారు. షా పర్యటన రాష్ట్రంలో కూటమిని బలోపేతం చేస్తుందా? అని అడిగినప్పుడు..ఆ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని విలేకరులకు చెప్పారు.
"ఆయన పర్యటన కార్యకర్తలకు ఉత్తేజానిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తమిళనాడు అభివృద్ధి కోసం పనిచేయాలనే మా సంకల్పం మరింత బలపడుతుంది," అని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.
రేపటితో వీడనున్న ఉత్కంఠ..
ఈ రోజు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడేవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. రేపు పార్టీ చీఫ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత చీఫ్ కె. అన్నామలై కొనసాగుతారా? లేక ఆయన స్థానంలో ఎవరు వస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.