ఆ కేసులు ప్రత్యేకమైనవి. విచారణ లోతుగా చేపట్టాలి. ఆ ఉద్దేశంతోనే సీఐడీకీ అప్పగించాం.


ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధానమైన కేసులు ఉన్నాయి. ఈ కేసులను విచారించేందుకు సీఐడీనే కరెక్ట్‌ అనుకుని ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించాం. అందులో ఒకటి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు. రెండోది సినీ నటి కాదంబరీ జెత్వానీ కేసు. ఈ రెండు కేసులు లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఈ కేసుల్లో చాలా ముఖ్యమైన వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. అందుకే ఈ ప్రత్యేక దర్యాప్తునకు ఐపీఎస్‌ అధికారిని ప్రత్యేకంగా నియమించామని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ఇప్పటికే జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు సస్పెండయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇద్దరు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు, ఒక మాజీ ఎంపీ, మాజీ ప్రభుత్వ సలహాదారు, విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌ఛార్జి వంటి ప్రముఖ నేతలు నిందితులుగా ఉన్నారు. అందుకే ఈ కేసులను సీఐడీకీ అప్పగించాల్సి వచ్చిందని డీజీపీ వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి విక్రయాలు విచ్చల విడిగా సాగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. అందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం. 450 మంది పోలీసు సిబ్బంది ఈ బృందాల్లో ఉంటారు. యాంటీ నార్కోటిక్‌ టీమ్‌లుగా వీరిని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. ఈ టీమ్‌లపై ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తారన్నారు. ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలు జరుగుతాయని, ఈ సంస్మరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ తెలిపారు.
Next Story