విశాఖ బీచ్ లు.. ఆహ్లాదానికి అడ్డాలు! రా రమ్మంటున్న అందాల తీరాలు..!
సండే స్పెషల్: విశాఖలోని బీచ్లు ప్రకృతి అందం, పర్యాటకుల ఆహ్లాదాల సమాహారం. ఒకవైపు సాగరం నుంచి, మరోవైపు కొండల నుంచి గిలిగింతులు పెట్టే గాలులు వీటి సొంతం.
(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)
విశాఖలోని బీచ్లు ఆకాశ నీలం సముద్రపు నీరు, పర్వతాలు, చెట్లు కలగలిసిన పచ్చదనం, మృదువైన ఇసుక తిన్నెల సమాహారం. ఒకవైపు సాగరం నుంచి, మరోవైపు కొండల నుంచి వీచే గాలులు భిన్నమైన ఆహ్లాదాన్ని పంచుతాయి. కనిపించీ కనిపించని మంచు తెరల్లాంటి సముద్రపు నీటి తుంపరలు వినూత్న అనుభూతిని కలిగిస్తాయి. ప్రకృతి రమణీయత తమకే సొంతమనిపించే వైజాగ్లోని అలాంటి బీచ్లను సందర్శిస్తే మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి. చింతలను దూరం చేస్తాయి. ఇసుక తిన్నెలపై కూర్చుని పాల నురుగుల సముద్ర కెరటాలను చూస్తూ ఆస్వాదిస్తుంటే మనసులోని కల్లోలం కొట్టుకుపోతుంది. సరికొత్త జీవితానికి పునరుజ్జీవం పోసినట్టవుతుంది. అందుకే వందలు, వేల కిలోమీటర్ల దూరం నుంచి, ఖండాంతరాల నుంచి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు పోటెత్తుతుంటారు. వైజాగ్ సహజ సిద్ధ బీచ్లను చూసి మైమరచి పోతుంటారు. అలాంటి బీచ్లను మీరూ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీలాంటి వారి కోసమే.. వైజాగ్ మీరు చూడాలనుకుంటున్న బీచ్లపై ఓ లుక్కేయండిలా..
పర్యాటక ప్రియుల మదిని దోచుకునే బీచ్లు విశాఖలో పది వరకు ఉన్నాయి. వాటిలో ఏడు బీచ్ లు అత్యంత రమణీయంగా కనిపిస్తాయి. వేటికవే ప్రత్యేకతతో పర్యాటకులను రా రామ్మంటూ ఆహ్వానిస్తాయి. అలాంటి వాటిలో రామకృష్ణా (ఆర్కే) బీచ్, రుషికొండ బీచ్, లాసన్స్ బే బీచ్, సాగర్ నగర్ బీచ్, యారాడ బీచ్, భీమిలి బీచ్, గంగవరం బీచ్లున్నాయి. మామూలు రోజుల్లోనే ఈ బీచ్లు సందర్శకులతో దర్శనమిస్తాయి. ఇక వీకెండ్లో అయితే కిటకిటలాడుతుంటాయి.
ఆహ్లాదాన్ని పంచే ఆర్కే బీచ్
విశాఖలో అత్యంత ప్రజాదరణ పొందిన బీచ్ రిలాక్స్ కావడానికి, హాయిగా గడపడానికి, సన్బత్లతో ఆస్వాదించడానికి అనువుగా ఉంటుంది. ఈ బీచ్లో కూర్చున్న వారి వైపు కెరటాలు దూకుడుగా దూసుకొచ్చేస్తున్నట్టు, అంతలోనే మనసు మార్చుకుని వెనక్కి పోతున్నట్టు కనిపిస్తాయి. అలా ఇక్కడ ఎన్ని గంటలు కూర్చున్నా అలసటే అనిపించదు.. తనివి తీరదు. ఈ బీచ్ లో బోటింగ్, క్రూయిజ్ బోట్లు, గుర్రాలు, ఒంటెలపై షికారు, బీచ్ సైడ్ మార్కెట్ వంటివి ఉంటాయి. బీచ్ లో కూర్చుంటే దూరం నుంచి పోర్టులోకి రాకపోకలు సాగించే నౌకలను కనిపిస్తాయి. ఇక్కడ దొరికే మూరీ మిక్సర్, బొగ్గులపై కాల్చే మొక్కజొన్న పొత్తులను పర్యాటకులు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే లోతు, సముద్రపు అంచున రాళ్ల సముదాయం, అధిక ఆటుపోట్లతో ఇక్కడ ఈత కొట్టడం అత్యంత ప్రమాదకరమని నిషేధం విధించారు.
నిర్మలమైన లాసన్స్ బే బీచ్..
రామకృష్ణా బీచ్ కు కొనసాగింపుగా ఈ లాసన్స్ బే బీచ్ ఉంటుంది. ఇక్కడ పచ్చదనంతో పాటు ఇసుక విభిన్నమైన తెల్లని రంగులో కనిపిస్తుంది. ఈ బీచ్ కూర్చుంటే సముద్రం నిర్మలంగా, ప్రశాంతంగా నిస్సారమైన, స్పటికలాంటి స్వచ్ఛత కలిగిన నీరు అగుపిస్తుంది. అలల ఉధృతి కూడా తక్కువగా ఉండడం వల్ల ఈతకు అనువుగా ఉంటుంది. సూర్య స్నానానికి, సర్ఫింగ్కు కూడా అనువైనదే.
ప్రశాంత బీచ్ భీమిలి..
విశాఖ నగరానికి 25 కి.మీల దూరంలో ఉంది భీమిలి బీచ్. పొడవైన, అందమైన ఒంపులు తిరిగి ప్రశాంతమైన అలలతో ఉండే సహజ బీచ్ ఇది. బంగాళాఖాతంలో గోస్తనీ నది సంగమం ఇక్కడే జరుగుతుంది. ఆహ్లాదకర వాతావరణంతో పాటు చుట్టూ పచ్చని చెట్లు, తాటి తోటలతో అలరారుతోంది. ఈ బీచ్లో 17వ శతాబ్దపు కోట, నాటి స్మశాన వాటిక అవశేషాలు ఉన్నాయి. డచ్ కాలం నాటి చరిత్ర ఇక్కడ కనిపిస్తుంది. ఈ బీచ్ బోటింగ్కు, పిక్నిక్ స్పాట్కు అనుకూలం. అలల ఉధృతి, లోతు తక్కువగా ఉండడం వల్ల ఈత ప్రియులకు సరైన విహార యాత్రగా ఉంటోంది.
సాహస క్రీడల సాగర్ నగర్ బీచ్..
విశాఖకు పది కిలోమీటర్ల దూరంలో సాగర్ నగర్ బీచ్ ఉంది. పర్యాటకుల ఆదరణ అధికంగా ఉండే బీచ్ ల్లో ఇదొకటి. కాలుష్యం అంతగా లేకపోవడంతో ఇక్కడి సముద్రపు నీరు పచ్చ మణి జలాలను పోలి ఉంటుంది. ఈ బీచ్ లో ఇసుక బంగారు వర్ణంతో మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తుంది. పారా గ్లైడింగ్ వంటి సాహస క్రీడలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ బీచ్ నుంచి సూర్యోదయాన్ని వీక్షిస్తే ఆకాశం నారింజ, ఊదా రంగులతో అలరిస్తూ ప్రత్యేకానుభూతిని కలిగిస్తుంది.
రమణీయ బీచ్ రుషికొండ..
విశాఖలో అద్భుత బీచ్ రుషికొండ బీచ్ ఒకటి. ప్రకృతి రమణీయతతో అలరారుతూ కనిపిస్తుంది. ఈ బీచ్ చెక్కు చెదరని అందం, బంగారు వర్ణపు ఇసుకతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. తక్కువ ఎత్తులో కెరటాలు, నీలి సముద్రం పాలరంగు నురుగతో ఒకపక్క, చెట్లు, పర్వతాల పచ్చదనం మరోపక్క వాటి మధ్య రుషికొండ కలగలిసి మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్, సర్ఫింగ్, స్పీడ్ బోటింగ్, జెట్ స్కైయింగ్, నిపుణుల పర్యవేక్షణలో ఈత, స్కూబా డైవింగ్ వంటి సదుపాయాలున్నాయి. ఈ బీచ్ దేశీయ పర్యాటకులతో పాటు విదేశీయులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది.
నిశ్శబ్ధ బీచ్.. యారాడ..
విశాఖకు 25 కి.మీల దూరంలో ఉంది యారాడ బీచ్. అక్కడకు వెళ్లాలంటే యారాడ కొండ ఎక్కి, దిగాల్సి ఉంటుంది. యారాడ బీచ్ కు మూడు వైపులా పచ్చని కొండలు, నాలుగో వైపు సముద్రంతో ప్రత్యేకమైన అందాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. బీచ్ కు ఆనుకుని కొబ్బరి, అరటి తోటలు కూడా ఉంటాయి. ఈ బీచ్ నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం పర్యాటకులకు ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. అందాల అలల అలజడి తప్ప మరే శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉండే ఈ బీచ్ రోజంతా సేద తీరడానికి అనువుగా ఉంటుంది. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాలు, ప్రపంచ నలుమూలల నుంచి అనేకమంది పర్యాటక ప్రియులు ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ రుచికరమైన స్థానిక వంటకాలు సందర్శకులకు నోరూరిస్తాయి.
పచ్చదనాల గంగవరం బీచ్..
విశాఖకు 27 కి.మీల దూరంలో ఈ బీచ్ ఉంది. ఇక్కడ చిన్న ద్వీపాన్ని పోలి ఉండే నిరాడంబరమైన రాతి లాంటి నిర్మాణం కనిపిస్తుంది. ఈ బీచ్ లో పచ్చని తాటిచెట్లు, మృదువైన ఇసుక, చల్లని గాలితో ఎప్పుడూ ఎకాంత వాతావరణాన్ని అందిస్తుంది. సినిమా, సీరియళ్లకు ఈ బీచ్ ఎంతో అనువుగా ఉండడం వల్ల తరచూ షూటింగ్లతో ఆ ప్రాంతం సందడిగా కనిపిస్తుంది. పర్యాటకులను తన సోయగాలతో ఆకర్షిస్తుంది.
బీచ్ సందర్శనకు ఇలా వెళ్లొచ్చు..
సెలవులొస్తే సందడి సందడిగా ఉండే ఈ బీచ్ లకు ఎలా వెళ్లాలనేగా మీ సందేహం. దూరబారాల నుంచైతే విశాఖపట్నానికి అనేక రవాణా మార్గాలున్నాయి. విమానాల్లో వచ్చే వారికి ఎయిర్ పోర్టు నుంచే టూర్ ప్యాకేజీ మాట్లాడుకుని చూసి రావొచ్చు. రైళ్ల సదుపాయం అపారం. రైల్వే స్టేషన్ లోనే అన్ని రకాల వివరాలు దొరుకుతాయి. టూరిజం విభాగం వారు ఏకంగా ఓ స్టాలు పెట్టి సమాచారాన్ని అందజేస్తున్నారు. బస్టాండ్ లో కూడా ఇదే మాదిరి సమాచారాన్ని విచారణ కేంద్రంలో కనుక్కోవచ్చు. వీటితో పాటు ఆటోలు, టాక్సీలు సరేసరి. మన ఆర్ధిక స్థోమతను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా మునిమాపు వేళకు రామకృష్ణ బీచ్ కి చేరి సముద్ర సోయగాలను ఆస్వాదించడం మాత్రం మరిచిపోకండి.