బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లాకు వాన గండం పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సోమవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. మరో 48 గంటల్లో మరింతగా బలపడే సూచనలు ఉన్నాయి. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ దీనిపై స్పందించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 0861–2331261, 7995576699, 1077 నెంబర్ల ద్వారా కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని తెలిపారు.
నెల్లూరు జిల్లాలోని అన్ని డివిజన్లు, అన్ని మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. భారీ వర్షాలతో కురిసే వచ్చే అవకాశం ఉండటంతో పెన్నా నది గట్లను పరిశీలించాలని జిల్లా రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. తీరప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా తిరోగమిస్తున్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, ఒడిశా, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్రతో సహా ఉత్త బంగాళాఖాతం నుంచి రుతుపవనాలు క్రమంగా వైదొలుగుతున్నాయని తెలిపింది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు వీచే ప్రభావం కనిపిస్తోందని, వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య బంగాళాఖాతంలో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
Next Story