ప్రధాని మోదీ హిందీ ప్రసంగాన్ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలుగులోకి అనువదించారు.


సహజంగా రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న నాయకులు వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ స్థానిక భాషలో కొన్ని పదాలతో అయినా ప్రస్తావిస్తూ ప్రసంగించడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా అలానే ఓ ప్రయోగం చేశారు. అమరావతి నిర్మాణాల పనులు పునఃప్రారంభం సభకు వచ్చిన ప్రధాని మోదీ అలాగే కొన్ని తెలుగు పదాలతో ప్రసంగించే ప్రయోగం చేశారు. అమరావతి స్వప్నం సాకారమవుతోందని..అమరావతి అనేది ఒక నగరం కాదని, ఒక శక్తి అని.. ఒక కొత్త అమరావతి.. కొత్త ఆంధ్రప్రదేశ్‌ రూపుదాల్చుతోంది.. దుర్గాభవానీ కొలువైన ఈ అమరావతిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది.. బౌద్ద వారసత్వం..ప్రగతి కలగలపిన ప్రాంతం అమరావతి..ఇప్పుడు నేను దుర్గాభవానీ కొలువై ఉన్న పుణ్యభూమిపై నిలబడి మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది," అని తెలుగులో మాట్లాడి సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో పాటు సభకు హాజరైన ప్రజలందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ఇంకా, అమరావతిని అభివృద్ధి చేసేది మనం.. మనమే అమరావతిని అభివృద్ధి చేస్తామని మరో సారి తెలుగులో ప్రధాని మోదీ నొక్కి వక్కాణించారు.

"అమరావతి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది." అంటూ ప్రధాని తనకు వచ్చిన, తెలిసిన తెలుగులో మాట్లాడి ప్రజల ఆశ్చర్యానికి గురి చేశారు.

అంతకుముందు," తల్లీ దుర్గా భవానీ!" అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. దానిని కొనసాగిస్తూ.. మీ అందరిని కలవడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాజు సయ్యద్ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి, నా మిత్రుడు చంద్రబాబు నాయుడు, తర్వాత నా స్నేహితుడు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, కేంద్ర మంత్రులకి, అధికారులకి, రాష్ట్ర ప్రజలకి, ప్రియమైన నా సోదరీ సోదరీ మణులారా అందరికీ నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడారు. తర్వాత హిందీలో ప్రసంగించారు. దీనిని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలుగులోకి అనువదిస్తూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని తెలుగులో రాష్ట్ర ప్రజలకు వినిపించారు.
Next Story