విద్వేషాలు లేని ఆంధ్ర మా లక్ష్యం
x
తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

విద్వేషాలు లేని ఆంధ్ర మా లక్ష్యం

రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం.. వైసీపీకి హెచ్చరిక జారీ చేసిన మంత్రి కొలుసు పార్థసారధి


రాష్ట్రంలో విద్వేషాలు సమసిపోవాలి. అలా వ్యవహరించే వారి ఆలోచనలు మారాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అభిప్రాయపడ్డారు. ఆ తరహా ధోరణులతో వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని మంత్రి పార్థసారథి హెచ్చరించారు. భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

తిరుమల శ్రీవారిని మంత్రి పార్థసారథి కుటుంబ సమేతంగా సోమవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

"జిల్లాలో వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్లన్నీనీటితో కళకళలాడుతున్నాయి" అని మంత్రి కొలుసు పార్థసారథి గుర్తు చేశారు. రైతులు కూడా వ్యవసాయం, పాడిపంటలతో బాగుండాలని భగవంతుడిని ప్రార్థించానని అన్నారు.

సీఎం ఎన్. చంద్రబాబు ఆలోచనలు ప్రతిఫలించి, విజన్ 2047, స్వర్ణాంధ్ర లక్ష్యం నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో యువత అభివృద్ధి చెందాలనే దిశగా సీఎం చంద్రబాబు తపిస్తున్న లక్ష్యం సాకారం అవుతుందన్నారు. తద్వారా యువత ఉద్యోగాల కోసం పొరుగు దేశాలకు వెళ్లకుండా అవకాశాలు కల్పిస్తామన్నారు.
ఆసక్తికర వ్యాఖ్యలు
"టీడీపీ కూటమి వచ్చిన తరువాత మా వేధింపులు, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు" అని వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ సహా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే,
"కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతికార్యక్రమానికి వైసీపీ అడ్డుపడుతోంది. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు" అని జగన్ పర్యటనలపై ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యవహరిస్తే సహించేది లేదని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తిరుమలలో హెచ్చరించారు. ఆ తరహా కార్యక్రమాలపై ఉపేక్షించేది కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.
" రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్వేషాలు ప్రబల కూడదు. ఎవరైనా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నాలను భగవంతుడు అణగదొక్కే ప్రయత్నం చేయాలి. ప్రజలందరి కుటుంబాల్లో శాంతియుత జీవనం గడపాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకున్నా" అని మంత్రి పార్ధసారధి చెప్పడాన్ని పరిశీలిస్తే, దేవుడిపై భారం వేసినా, ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది.


Read More
Next Story