డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిన ఆ 86 మందిలో నటి హేమ!
x

డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిన ఆ 86 మందిలో నటి హేమ!

బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో ఓ తెలుగు నటికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉన్న కారును పోలీసులు గుర్తించడం తెలుగురాష్ట్రాలలో కలకలం రేపింది


బెంగళూరు రేవ్ పార్టీలో ఓ తెలుగు నటికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఇదే సమయంలో రేవ్ పార్టీ జరిగిన చోట ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ప్రస్తుత ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉన్న ఒక కారును పోలీసులు గుర్తించడం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది. రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో 15కు పైగా లగ్జరీ కార్లు పార్క్ చేసి ఉన్నాయి. వాటిలో ఒక కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది.

సోమవారం (మే 20) నగరంలోని ఒక ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. ఈ విషయం తెలిసి బెంగళూరు పోలీసులు దాడులు చేశారు. 104 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో కనీసం 86 మందికి డ్రగ్స్‌ తీసుకున్నట్టు ఆనవాళ్లు కనిపించాయి. పాజిటివ్ వచ్చినట్టు తేలింది.

పార్టీకి హాజరైన వారిలో ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక కు చెందిన అనేక మంది ఉన్నతస్థాయి వ్యక్తులలో తెలుగు నటులు హేమ, ఆషి రాయ్ (ఈమె లాక్ డౌన్, మిస్టరీ ఆఫ్ సారిక సినిమాలలో నటించారు) ఉన్నారు. వారు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షల్లో తేలింది. పార్టీలో 25 మంది యువతులు, డీజేలు, మోడల్స్, నటులు, టెక్కీలు ఉన్నారు.

మొత్తం 86 మందికి నోటీసులు..

ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. పోలీసులు దాడి చేసినప్పుడు సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ రేవ్ పార్టీలో 73 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలింది. వారందరికీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) నోటీసులు పంపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని సింగెన అగ్రహార పరిసరాల్లోని జిఎం ఫామ్‌హౌస్‌లో హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఫామ్‌హౌస్ గోపాల రెడ్డికి చెందినదని, ఆయనకి కాన్ కార్డ్ కూడా ఉందని పోలీసులు చెప్పారు.

డ్రగ్స్ స్వాధీనం...

పోలీసులు ఈ దాడిలో 17 మిథైలెనెడియోక్సిమెథాంఫేటమిన్ (ఎండీఎంఏ) పిల్స్, కొకైన్‌తో సహా భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మే 18 సాయంత్రం 5 గంటల నుంచి మే 19 ఉదయం 6 గంటల మధ్య జరిగిన ఈ ఈవెంట్‌ను “పుట్టినరోజు పార్టీ” అని చెప్పారు. పార్టీకి రోజుకు రూ. 50 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు పిటిఐ వార్తాసంస్థ కథనం.

ఎఫ్ఐఆర్ ప్రకారం, 14.4 గ్రాముల ఎండీఎంఏ మాత్రలు, 1.16 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్స్, 6 గ్రాముల హైడ్రో గంజాయి, 5 గ్రాముల కొకైన్, 500- కొకైన్ కోటింగ్ ఉన్న పిల్స్, ఐదు మొబైల్ ఫోన్లు, రెండు కార్లు (వోక్స్‌వ్యాగన్, మరో ల్యాండ్ రోవర్) స్వాధీనం చేసుకున్నారు. సౌండ్ అండ్ లైటింగ్‌తో ఉన్న డీజే పరికరాలు కూడా పోలీసులు పట్టుకున్నారని ఎన్డీడీవీ నివేదించింది.

ఎమ్మెల్యే పాస్ దొరికింది..

వేదిక వద్ద పార్క్ చేసిన కారులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యేకు చెందిన పాస్ దొరికిందని, అది నెల్లూరుజిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకి చెందిన స్టిక్కరని పిటిఐ తెలిపింది. అక్కడ మొత్తం 15 కార్లు పార్క్ చేసి ఉంటే వాటిలో ఒక కారుకి ఈ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది.

ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలో ఈ ఫామ్ హౌస్ ఉన్నందున తొలుత ఈ కేసును హెబ్బగోడి పోలీసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ)కి బదిలీ చేశారు.

Read More
Next Story