రాజధాని అమరావతికి మరో 16 వేల ఎకరాల భూ సమీకరణ
x

రాజధాని అమరావతికి మరో 16 వేల ఎకరాల భూ సమీకరణ

34 వేల ఎకరాల తర్వాత అమరావతిలో మరో భారీ భూసేకరణ


అమరావతి రాజధాని అభివృద్ధి మరో దశకు వెళ్లింది. రెండో విడత భూసమీకరణకు ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 7 గ్రామాల్లో 16,666.57 ఎకరాల పట్టా, అసైన్డ్ భూముల సమీకరణ బాధ్యతను సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగించింది. ఇందులో 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది.

తాజా ఉత్తర్వుల ప్రకారం పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలోని గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టనున్నారు. రెండో విడతలో సమీకరించబోయే భూముల్లో 16,562.52 ఎకరాల పట్టా భూములు , 104.01 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి.
ఏయే గ్రామాల్లో ఎంతెంత భూమి?
పల్నాడు జిల్లా – అమరావతి మండలం
వైకుంఠపురం: 1,965 ఎకరాలు
పెద్దమద్దూరు: 1,018 ఎకరాలు
యండ్రాయి: 1,879 ఎకరాల పట్టా, 46 ఎకరాల అసైన్డ్
కర్లపూడి, లేమల్లె: 2,603 ఎకరాల పట్టా, 51 ఎకరాల అసైన్డ్
గుంటూరు జిల్లా – తుళ్లూరు మండలం
హరిశ్చంద్రపురం: 1,448.09 ఎకరాల పట్టా, 2.29 ఎకరాల అసైన్డ్
పెదపరిమి: 5,886.18 ఎకరాలు
పట్టా భూములు: 16,562.52 ఎకరాలు
అసైన్డ్ భూములు: 104.01 ఎకరాలు
మొత్తం: 16,666.57 ఎకరాలు
34 వేల ఎకరాలను మొదటి విడతలో సమీకరించారు. ఇప్పుడు రెండో విడత ప్రారంభమైంది.
2015లో అమలైన మొదటి విడత భూసమీకరణలో ప్రభుత్వం ఇప్పటికే సుమారు 34,000 ఎకరాలు తీసుకుంది. ఈసారి రెండో విడత (LPS 2.0) చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కేబినెట్‌కు తెలియజేసిందేమంటే:
2015లో భూములు ఇచ్చిన రైతుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది. కొన్ని సమస్యలు ఇప్పటికే పరిష్కారం అయ్యాయి. మిగిలినవి త్వరలో పరిష్కారమవుతాయని నాయుడు వివరించారు. ఇందుకు రైతులు సమ్మతించినట్టు సీఆర్డీఏ అధికారికంగా ప్రకటించింది.
గ్రామాల వారీగా సీఆర్డీఏ అధికారుల సమావేశాల తర్వాత 7 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా 16,666 ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు అంటే గురువారం జరిగిన రైతుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఇలా చెప్పారు.. “అమరావతిని ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దాలంటే రైతుల సహకారం కీలకం. రెండో విడత భూ సమీకరణకు ముందుకు రావాలి”
LPS 2.0 ప్రతిపాదనను ప్రభుత్వం మొదట 5 నెలల క్రితమే కేబినెట్‌కు పంపినప్పటికీ, సాంకేతిక కారణాలతో, సభ్యుల అభిప్రాయాల నేపథ్యంలో అది వాయిదా పడింది. ఈసారి సీఆర్డీఏ, మునిసిపల్ శాఖలు రైతుల సమస్యలపై నవీకరించిన నివేదికలు సమర్పించడంతో కేబినెట్ ఆమోదించింది.
సంక్రాంతి కల్లా అమలులోకి LPS 2.0
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం LPS 2.0 ను సంక్రాంతి నాటికి లేదా అంతకంటే ముందే ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అదనంగా తీసుకునే భూమితో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ వంటి ప్రాజెక్టులను చేపడతారు.
అమరావతి అభివృద్ధికి కీలక దశ
రాజధాని నిర్మాణానికి కొత్త ఊపు రావాలంటే భూసమీకరణ దశ అత్యంత ప్రాధాన్యత కలిగిందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొదటి విడతలోలానే రెండో విడతలో కూడా అభివృద్ధి ప్రయోజనాలు, రిజిడ్యుయల్ ప్లాట్లు, పరిహారం వంటి అంశాలు ఉంటాయి.
Read More
Next Story