రైళ్లకు పేర్లు పెట్టే తీరికే లేదా ?
విశాఖ నుంచి బయల్దేరే 17 రైళ్లకు పేర్లు లేవు. రెండున్నరేళ్ల క్రితమే వాల్తేరు డీఆర్ఎం ప్రతిపాదనలు. ఇప్పటికీ రైల్వే ఉన్నతాధికారులు మీనమేషాలు.
మనుషులు మాదిరిగానే రైళ్లకూ పేర్లుంటాయి. రైళ్లూ పేర్లతోనే తిరుగుతుంటాయి. కొన్ని రైళ్ల పేర్లు ప్రజల మదిలో బాగా గుర్తుండిపోతాయి. ఇలా రైలు బండ్లకు పేర్లు పెట్టడం ఎప్పట్నుంచో వస్తున్నదే. తాత్కాలికంగా నడిపే స్పెషల్ రైళ్లకు మాత్రమే పేర్లు పెట్టరు. వీటిని స్పెషల్ నంబర్లతోనే నడుపుతారు. రెగ్యులర్గా తిరిగే వాటికి మాత్రం కచ్చితంగా పేర్లు పెడతారు. కానీ విశాఖ నుంచి వెళ్లే, విశాఖకు వచ్చే పలు రెగ్యులర్ రైళ్లు ఇప్పటికీ పేర్లకు నోచుకోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా విశాఖ నుంచి బయల్దేరి వెళ్లి, వచ్చే 17 ఎక్స్ప్రెస్ ట్రెయిన్లు కేవలం వాటికున్న నంబర్లతోనే ఏళ్ల తరబడి రాకపోకలు సాగిస్తున్నాయి. వాటి తఏళ్ల నుంచి ఈ రైళ్లు పేర్లు లేకుండానే ఆటూ, ఇటూ తిరుగుతున్నా ఏ అధికారీ పట్టించుకున్న పాపాన పోలేదు.
ఈ సంగతిని తెలుసుకుని రెండున్నరేళ్ల క్రితం అప్పటి వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) అనూప్కుమార్ శతపతి 2022 జులై రెండో తేదీన ఈ 17 ఎక్స్ప్రెస్ ట్రెయిన్ల పేర్లను సూచిస్తూ రైల్వే శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఆ రైళ్లకు పెట్టిన పేర్లు కూడా ఆ ప్రాంతానికున్న అనుబంధాన్ని, ఆ ప్రాంత ప్రాధాన్యతను తెలియజెప్పేలా, సామాన్య జనానికి తేలిగ్గా అర్థమయ్యేలా, ఈ ప్రాంత సెంటిమెంట్లకు అనుగుణంగా ఉండేలా సూచించారు. వీటిలో వాల్తేరు ఎక్స్ప్రెస్, రుషికొండ ఎక్స్ప్రెస్, సింహాచలం ఎక్స్ప్రెస్, వంశధార ఎక్స్ప్రెస్, గోస్తనీ ఎక్స్ప్రెస్, కురుసుర, ఉక్కునగర్, సాగర్ నగర్ వంటి పేర్లున్నాయి. ఈ ప్రతిపాదనలు పంపి రెండున్నరేళ్లవుతున్నా అతీగతీ లేదు. వాటి గురించి రిమైండర్లు పంపినా అటు నుంచి స్పందన లేదు.
పేర్లు తెలియక జనం సతమతం..
గోదావరి, తిరుమల, గరీబ్ రథ్, జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి, ఉదయ్, విశాఖ.. ఇలా రైళ్ల పేర్లు జనంలో బాగా పాపులర్ అయ్యాయి. తాను ఫలనా ట్రైన్కు వెళ్తున్నాననో, వస్తున్నాననో చెబుతుంటారు. లేదా ఆ ట్రెన్కి టిక్కెట్లు కావాలనో, రిజర్వేషన్ కావాలనో తేలిగ్గా అడుతుంటారు. కానీ ఈ రైళ్ల నంబర్లు గుర్తు పెట్టుకోవడం చాలా మందికి కష్టతరం అవుతోంది. ఇలా తాము ప్రయాణించే రైళ్ల నంబర్లు తెలియక పోవడంతో బుకింగ్ కౌంటర్ల వద్ద సిబ్బందికి, ప్రయాణికులకు తరచూ ఇబ్బంది తలెత్తుతోంది.
పైసా పెట్టుబడి అవసరం లేకున్నా..
వాస్తవానికి రైళ్లకు పేర్లు పెట్టడానికి రైల్వే శాఖకు ఒక్క పైసా కూడా పెట్టుబడి అక్కర్లేదు. ఒకవేళ పెట్టుబడితో కూడుకున్నదైతే నిధుల కొరత వంకతో ఆలస్యం చేస్తున్నారనో, లేక అవసరం లేదనో వాయిదా వేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నిధులతో పని లేని పేర్ల ప్రక్రియపై ఏళ్ల తరబడి నాన్చుడి ధోరణిని అవలంబిస్తుండడం రైల్వే శాఖ నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. అన్నిటికీ మించి ఉత్తరాంధ్ర ఎంపీలకు చిత్తశుద్ధి కొరవడింది. ఫలితంగా ఈ ప్రతిపాదనల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. రెండున్నరేళ్ల క్రితం డివిజన్ నుంచి పంపిన పేర్ల ప్రతిపాదనపై రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేయాల్సి ఉంటుంది.
అనుమతి లభించాక రైళ్లకు పేర్లు ఖరారవుతాయి. అనంతరం రైల్వే టైమ్ టేబుల్లో వీటి పేర్లను, సమయాన్ని చేరుస్తారు. అది జరగాలంటే ఈ ప్రాంత ఎంపీల ఒత్తిడి అవసరం. కానీ ఎంపీలెవరూ ఆ పని తమది కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 'రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న అనకాపల్లి లోకసభ సభ్యుడు సీఎం రమేష్ చొరవ తీసుకుని ఈ 17 రైళ్లకు సత్వరమే పేర్లు ఖరారు చేసేలా కృషి చేయాలి. ఉత్తరాంధ్ర ఎంపీలు కూడా ఇందుకోసం ఒత్తిడి తీసుకురావాలి' అని తూర్పు కోస్తా రైల్వే జెడ్ఆర్యూసీసీ సభ్యుడు కంచుమూర్తి ఈశ్వర్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.
వాల్తేరు డివిజన్ నుంచి ప్రతిపాదించిన 17 రైళ్ల పేర్లు ఇలా..