తండ్రి అలా.. కొడుకు ఇలా.. జోగి మాటలే వారిని చిక్కుల్లో పడేస్తున్నాయా..
x

తండ్రి అలా.. కొడుకు ఇలా.. జోగి మాటలే వారిని చిక్కుల్లో పడేస్తున్నాయా..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట ఏసీబీ దాడులు జరిగాయి. విజయవాడ అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల కేసులో ఈ సోదాలు జరిగాయి.


ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట ఏసీబీ దాడులు జరిగాయి. విజయవాడ అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల కేసులో ఈ సోదాలు జరిగాయి. ఈ కేసులో భాగంగానే ఏసీబీ అధికారులు జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌ను అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ అరెస్ట్‌పై జోగి రామేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని, అందులో భాగంగానే తన అమాయకపు కుమారుడిని అరెస్ట్ చేశారని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములను జోగి ఫ్యామిలి కొనుగోలు చేయడం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘చంద్రబాబు నీకూ కొడుకులు ఉన్నారు. తప్పుడు కేసులు బనాయించడం ఎవరికీ మంచిది కాదు. ఇప్పటికైనా చంద్రబాబు తన వంకర బుద్ధి మార్చుకుంటే మంచిది. ఈరోజు జరిగిన ఏసీబీ దాడులు జోగి రమేష్, రాజీవ్‌పై జరిగినవి కావు.. బలహీన వర్గాలపై జరిగిన దాడులు. చంద్రబాబు ప్రతీకారాలు పక్కనపెట్టి ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చండి. ప్రజల దృష్టిని హామీలపై నుంచి మళ్లించడానికే చేస్తున్న ఈ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి’’ అని హితవు పలికారు. ‘‘అప్పటికే అగ్రిగోల్డ్ భూములు అప్పటికే అటాచ్ చేయబడి ఉన్నాయి. అటాచ్‌మెంట్‌లో భూములను ఎవరైనా కొంటారా’’ అని ప్రశ్నించారు. మరోవైపు జోగి రాజీవ్ మాత్రం ఈ కొనుగోలుపై మరోలా మాట్లాడారు.

మేమే కొన్నాం..

ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న క్రమంలో జోగి రాజేష్ ఈ వ్యవహారంపై స్పందించారు. ‘‘అందరిలాగే మేము కూడా భూములు కొన్నాం. అగ్రిగోల్డ్ కేసును చట్టపరంగా ఎదుర్కొంటాం. మాపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది’’ అని ఆరోపించారు. ఇప్పుడు వీరిద్దరు చేసిన వ్యాఖ్యలే జోగి కుటుంబాన్ని మరింత చిక్కుల్లో పడేస్తోంది. వీరు అగ్రిగోల్డ్ భూములు కొన్నారా లేదా అనేది కూడా అర్థం కాకుండా అయిపోయింది.

ఈ నేపథ్యంలోనే జోగి ఫ్యామిలీపై భారీగా సెటైర్లు పేలుతున్నాయి. తండ్రీకొడుకులు స్క్రిప్ట్ సరిగా చదువుకోలేదని, అందుకే ఒకరు కొన్నామంటే మరొకరు ఎవరైనా కొంటారా అంటున్నారంటూ పంచులు పేలుతున్నాయి. ఏసీబీ అధికార వర్గాలు కూడా వీరి వ్యాఖ్యల ద్వారా వీరు కబ్జాకు పాల్పడ్డారన్న అనుమానాలు బలపడుతున్నాయని, ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తును కొనసాగించనున్నామని చెప్తున్నారు. అయితే మరోవైపు తమ పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరుగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ వివిధ కేసుల్లో అరెస్ట్ అవుతున్నా, వివాదాలకు కేంద్రంగా మారుతున్నా పార్టీ అధిష్టానం స్పందించకపోవడంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలానే జరుగుతుందని వైసీపీ అధిష్టానానికి ముందే తెలుసా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరి ఇప్పటికైనా దీనిపై వైసీపీ అధిష్టానం స్పందిస్తుందేమో చూడాలి.

Read More
Next Story