వలంటీర్ల వేట మొదలయిందా? 23 మందిపై వేటు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా రాజమహేంద్రవరంలో 23 మంది వలంటీర్లను సస్పెండ్ చేసినట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.
దేశమంతా ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న సందర్భంగా ఎన్నికల సంఘం ఖరాఖండిగా వ్యవహరిస్తోంది. ఏమాత్రం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తెలిసిన వెంటనే చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీ నాయకులతో పాటు అన్ని శాఖల అధికారులకు కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని, ఉల్లంఘించిన పక్షంలో తాము కనికరం లేకుండా వ్యవహరిస్తామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. అదే విధంగా తన మాటను నిలబెట్టుకుంటూ ఫిర్యాదు అందిన నిమిషాల్లోనే స్పందిస్తూ సదరు అధికారులు, ఉద్యోగులు, నేతలపై నిర్మొహమాటంగా చర్చలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో 23 మంది వలంటీర్లపై వేటు పడింది.
టీడీపీ ఫిర్యాదే కారణం
రాజమహేంద్రవరం పరిధిలోని వలంటీర్లు వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును స్వీకరించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను సేకరించారు. అనంతరం 23 మంది వలంటీర్లను సస్పెండ్ చేస్తూ రిటర్నింగ్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై తీసుకున్న ఈ చర్యలు వలంటీర్లు అందరికీ ఒక హెచ్చరికగా నిలవాలని తెలిపింది. వలంటీర్లు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఏ విధమైన ఎన్నికల ప్రచారంలో కానీ, పార్టీ నేతలతో కానీ ఇంటరాక్ట్ కాకూడదని ఎన్నికల సంఘం తెలిపింది. వారి భేటీ అధికారికంగా జరగాలే తప్ప వ్యక్తిగత భేటీని అంగీకరించమని స్పష్టం చేసింది.
తిరుపతిలో కానిస్టేబుల్‌పై వేటు
ఇదే విధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఓ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్‌పీ కృష్ణకాంత్ పటేల్ వెల్లడించారు. సదరు కానిస్టేబుల్ ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారని, అందుకే అతనిని సస్పెండ్ చేశామని చెప్పారాయన. తిరుపతి దిశ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న చక్రి రాజశేఖర్ అనే కానిస్టేబుల్.. భాకరాపేటలో నిర్వహించిన ఓ రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌పీ ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపి సదరు కానిస్టేబుల్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు నిర్దారించారు. అనంతరం సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.