
తిరుమల వెంకన్నకు 22 కిలోల వెండి గంగాళం కానుక..
రూ. 30 లక్షల కానుక అందించిన హైదరాబాద్ భక్తుడు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి విరాళాలు, కానుకలు భారీగా అందుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలతో పాటు సామాన్యులు కూడా ఆన్ లైన్ ద్వారా భారీగానే విరాళాలు అందించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులురెడ్డి 30 లక్షల రూపాయల విలువైన వెండిగంగాళం కానుకగా సమర్పించారు. 22 కిలోల స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయం మహద్వారం ముందు మంగళవారం తెల్లవారుజామున జక్కారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఈ కానుకను ఆలయ అధికారులకు అందించారు.
శ్రీవారి ఆలయం ముందు వెండి గంగాళం అందించడం ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది. ఆలయం ముందు కానుక అందించడం కూడా ఈసారి ప్రత్యేకత. శ్రీవారి భక్తుడు శ్రీనివాసులురెడ్డి నుంచి వెండి గంగాళం అందుకున్న టీటీడీ అధికారులు, సిబ్బంది ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. ఈ గంగాళం శ్రీవారి సేవల సందర్భంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరమంజనం, ఇతర పూజాది కార్యక్రమాల సందర్భంగా ఉపయోగించే అవకాశం ఉంది. అనంతరం దాత శ్రీనివాసులు రెడ్డి కుటుంబానికి శ్రీవారి దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో దాత కుటుంబానికి వేదాశీర్చనం, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు.

