ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కేసులు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో మారుమోగుతున్న పేరు వర్రా రవీందర్‌రెడ్డి. మోస్ట్ వాంటెడ్ పర్సన్‌గా మారాడు. మాజీ సీఎం జగన్ కు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా కార్యకర్తగా పని చేస్తున్నాడు. ఇతనిపై తాజాగా కడప జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్‌లో మరో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వర్రా రవీందర్‌రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలపైన ఐటీ యాక్టు, బీఎన్‌ఎస్ యాక్డు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. వర్రా రవీందర్‌రెడ్డి మీద రాజంపేట, కడప తాలూకా, చిన్నచౌకు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు వంటి పలు ప్రాంతాల్లో 10 కేసుల వరకు నమోదయ్యాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్రా రవీందర్‌రెడ్డిపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. మొత్తం 40 వరకు కేసులు నమోదయ్యాయి.
కడప ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు వైఎస్ అవినాష్‌రెడ్డికి వర్రా రవీందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు. వర్రా రవీందర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. వర్రా రవీందర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భారీ సంఖ్యలోనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దాదాపు 45 మంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేంద్రెడ్డి ఆధ్వర్యంలో పని చేసిన యాక్టివిస్టులను పోలీసులు గుర్తించారు. ఐడ్రీం చానల్ చైర్మన్ చిన్న వాసుదేవరెడ్డి, ఏపీ డిజిటల్ మీడియా కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన త్వారా ఆయన వైసీసీ సోషల్ మీడియాకు పని చేసినట్టు గుర్తించారు. ఇతని ఆధ్వర్యంలో నడిచిన 65 మంది టీమ్‌లో 12 మంది కీలకమైన యాక్టివిస్టుల వివరాలను పోలీసులు సేకరించారు.
అలాగే సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో పనిచేసిన టీమ్‌లో మరి కొందరి పేర్లను పోలీసులు సేకరించారు. వీరందరిపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. వైసీపీకి అనుకూలంగాను, టీడీపీకి వ్యతిరేకంగా పని చేసిన యూట్యూబ్‌ర్స్‌ను కూడా పోలీసులు గుర్తించారు. వీరిలో సినీ నటులు, మాజీ జర్నలిస్టులు, మీడియా చానల్స్ అధిపతులు కూడా ఉన్నట్లు గుర్తించారు. వీరికి 41–ఏ నోటీసులు ఇచ్చి, విచారణ చేపట్టనున్నారు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్ర స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి తదితరుపైన సమగ్ర విచారణ చేపట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
Next Story