
Buses collide | మదనపల్లె వద్ద బస్సులు ఢీకొని 40 మందికి గాయాలు
కర్ణాటక సరిహద్దులో జరిగినప్రమాదంలో ఒకరు మరణించారు. తీవ్రంగా గాయపడిన వారిని, చింతామణి, మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు
వేకువజాము కావడంతో అంతా గాఢనిద్రలో ఉన్నారు. మంగళవారం వేకువజామున సుమారు3.30 గంటలకు ఎదురెదురుగా వచ్చిన రెండు ప్రైవేటు బస్సులు ఢీకున్నాయి. ఊహించని శబ్ధం రావడంతో బస్సులో ప్రయాణిస్తున్న వారి హాహాకారాలు మిన్నంటాయి. బస్సులు ఢీకొన్న ధాటికి సుమారు 40 మందికి పైగానే గాయపడ్డారు. ఘటనా స్థలంలో ఒకరు మరణించారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
కర్నాటక రాష్ట్రం నుంచి ఆంధ్రకు ఓ బస్సు ప్రయాణిస్తోంది. అదే సమయంలో మదనపల్లె నుంచి మరో ప్రయివేటు బస్సు బయలుదేరింది. మదనపల్లె.. కర్ణాటక సరిహద్దులో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బస్సులు ముందు భాగం నుజ్జునుజ్జుగా మారింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని సమాచారం అందింది.
ఈ ఫోటోలోని వారు ఎవరైంది తెలియలేదు. 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ' ప్రతినిధికి అందిన వీడియోలో తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవిస్తూ రోడ్డుపై పడి, గిలగిలలాడుతూ ఉండడం గమనించిన ప్రయాణికులు కన్నీటి పర్యంతం అయ్యారు. శరీరం మొత్తం గాయాలు, పగిలిన గాజు పెంకులు గుచ్చుకుని, డీజిల్ మొత్తం శరీరానికి అంటుకుని, సాయం కోసం పాట్లు పడుతూ కనిపించారని మదనపల్లో మీడియా ప్రతినిధులు చెప్పారు.
ఃబస్సు ముందు భాగంలో డ్రైవర్ పక్కన కూర్చొన్న వ్యక్తి మరణించారని, ఆయన వివరాలు తెలియడం లేదని మదనపల్లె నుంచి అందిన సమాచారం. ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే 108 వాహనాల్లో బాధితులను కొందరిని మదనపల్లె జిల్తా ఆస్పత్రికి, ఇంకొందరిని కర్ణాటకలోని చింతామణి జనరల్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆస్పత్రుల్లో విషాద వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.