
900 కోట్లతో రాజధాని అమరావతి గ్రామాలకు రోడ్లు
6 నెలల్లో అమరావతి గ్రామాలకు అద్దంలాంటి రోడ్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 6 నెలల్లో అద్దం లాంటి రోడ్లు రానున్నాయి. శరవేగంతో సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాల ముఖ చిత్రం మారనుంది అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల పనులను ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్తోందని అన్నారు.
గ్రామాల అభివృద్ధికి రూ.900 కోట్లతో పనులు చేయడానికి పూర్తి ప్రణాళిక (డీపీఆర్) సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, వచ్చే నెల నుంచి పనులు మొదలవుతాయని చెప్పారు. గ్రామాల్లో చేపట్టే అన్ని అభివృద్ధి పనులు 6 నెలల్లో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. సోమవారం వడ్డమానులో కొత్త రహదారిని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కరకట్టకు సమాంతరంగా సీఆర్డీఏ (CRDA) రోడ్డును మంగళగిరి రోడ్డుకు అనుసంధానిస్తామన్నారు.
రాజధానిని గుంటూరు, విజయవాడతో పాటు ఇతర ప్రాంతాలకు కలిపే రోడ్ల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. వెస్ట్ బైపాస్ రోడ్డును త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ 5 లో ఉండేలా నిర్మిస్తున్నామన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. రాజధానిలోని 29 గ్రామాల్లో జనవరి నుంచి మౌలిక వసతుల పనులు చేపడతామని మంత్రి నారాయణ చెప్పారు. అన్ని గ్రామాల్లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద నీటి కాలువలు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, రైల్వే ట్రాక్ కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంటామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, ల్యాండ్ పూలింగ్ కు ఎవరైనా ముందుకు రాకుంటే అప్పుడు భూసేకరణ పై నిర్ణయం తీసుకుంటామన్నారు.
దేశానికి మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ చేసిన సేవలను గుర్తు చేస్తూ, ఈ నెల 25న రాజధానిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
Next Story

