ఏపీకి మత్తు ముప్పు.. భారీగా గంజాయి సీజ్..
x

ఏపీకి మత్తు ముప్పు.. భారీగా గంజాయి సీజ్..

ఏపీకి మత్తు ముప్పు తప్పేలా కనిపించడం లేదు. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదోక రూపాన మత్తుపదార్థాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి.


ఏపీకి మత్తు ముప్పు తప్పేలా కనిపించడం లేదు. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదోక రూపాన మత్తుపదార్థాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఇదే విధంగా తాజాగా ఒడిసా నుంచి ఆంధ్రలోకి భారీ మొత్తంలో గంజాయిని తరలించే ప్రయత్నాన్ని పోలిసులు అడ్డుకున్నారు. దాదాపు 912 కిలోల గంజాయిని లారీలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామని అనకాపల్లి జిల్లా పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున చేపట్టిన వాహన తనిఖీల్లో ఈ గంజాయి లభించిందని, వెంటనే గంజాయిని సీజ్ చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. మరో ఐదుగురి కోసం గాలింపు చేపట్టామని, సీజ్ చేసిన గంజాయి విలువ దాదాపు రూ.45 లక్షల ఉంటుందని ఎస్పీ దీపిక తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి నియంత్రణకు పోలీసు శాఖ చర్యలు చేపడుతుందని చెప్పారు. అనకాపల్లిలోనే కాకుండా తిరుపతి జిల్లా కేటీ రోడ్డులో కూడా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.




వారి దగ్గర నుంచి 22కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా డీఎస్పీ వెంకట నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రం మార్చడానికి చేపెట్టిన 100 రోజుల మిషన్‌లో భాగంగా పట్టణంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కేటీ రోడ్డులో 22 కిలోల గంజాయిని రవాణా చేస్తుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని వెంకట నారాయణ చెప్పారు. వారిలో పట్టాభి గుణ శేఖర్ (20)ను ఏ1గా, కొండా ముని భరణి(20) అని యువకుడిని ఏ2గా చేర్చినట్లు వివరించారు.

‘‘తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ నాగభూషణ రావు ఆధ్వర్యంలో డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో కేటీ రోడ్డు, టేబుల్-9, హోటల్ దగ్గర తనిఖీలు చేపడుతున్నాం. అదే సమయంలో హోటల్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నాం. వారిని సోదా చేయగా వారిలో ఏ1 గుణశేఖర్ నుంచి నల్లని బ్యాగులో 12 కేజీలు, మునిభరణి నుంచి తెల్లని యూరియా ప్లాస్టిక్ గోతములో 10కేజీలు గంజాయి లభ్యమైంది. వెంటనే గంజాయిని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేయడం జరిగింది’’ అని డీఎస్పీ వెంకట నారాయణ వెల్లడించారు.

కాగా ఇద్దరు ముద్దాయిలను ప్రస్తుతం విచారిస్తున్నామని, వారు గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ఎవరి దగ్గర కొనుగోలు చేశారు? వంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాగా ఈ ఫీట్ సాధించిన బృందాన్ని ఎస్పీ సుబ్బారాయుడు అభినందించారు.

Read More
Next Story