బ్రాహ్మణి ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సతీమణి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు. ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు.
ఏపీలో రాజకీయాలు అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నాయి. ఇటీవల కాలంలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి. సాధారణ హత్యలను రాజకీయ హత్యల కి ందకు తెస్తున్నారని ప్రభుత్వం అంటుంటే అధికార పక్ష నాయకుల కనుసన్నల్లోనే హత్యలు జరుగుతున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఇవన్నీ పట్టించుకోకుండా నారా బ్రాహ్మణి అడుగులు వేస్తున్నారు. మామ, అత్త, భర్త ఎటువంటి వారు, వారు చేస్తున్న మంచి పనులు ఏమిటివి అనే అంశాలను ప్రజల ముందు ఉంచాలనుకున్నారు. అందుకు సోషల్ మీడియాను బ్రహ్మణి వేదిక చేసుకున్నారు. తన బావాలను పంచుకోవడంతో పాటు కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉన్న మామ, భర్తకు ఆమె సపోర్టుగా నిలిచారు.
చంద్రబాబునాయుడును జైలుకు పంపించినప్పుడు బ్రాహ్మణి భర్తతో కలిసి ప్రజల ముందుకు వచ్చారు. చాలా సార్లు సమావేశాల్లో మాట్లాడారు. ఆమె మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఆమె వర్చస్సు కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఏమి చెబుతుందో విందామనే భావనను ప్రతి ఒక్కరికీ కలిగిస్తుంది. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో వేల మంది స్నేహితులు ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఆ ఫొటోలు ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌ల్లో షేర్ చేస్తున్నారు. ఆ కార్యక్రమాలపై తన అభిప్రాయాన్ని చెబుతున్నారు. మామ, భర్తపైనే కాకుండా అత్తపై కూడా ఆమె అభిప్రాయాన్ని ఫేస్‌బుక్ వేదికగా పంచుకున్నారు. అధికారం ఉన్నప్పటికీ ఎప్పుడూ అధికార దర్పంతో వ్యవహరించలేదని, భర్త పాల్గొనే కార్యక్రమాల్లో భార్యగా పాల్గొనాల్సి వచ్చినప్పుడు మాత్రమే పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. పది వేల మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలో పనిచేస్తున్న భువనేశ్వరి ఎప్పుడూ నిగర్విగానే ఉన్నారన్నారు.
ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి తన ఫేస్ బుక్‌లో 2019 సెప్టెంబరు 1న ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టు సారాంశం ఇలా ఉంది.
1995, సెప్టెంబర్ 1న సీఎంగా తొలిసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అంటే 23 ఏళ్ల క్రితమే ఆయన సీఎం అయ్యారు. ముఖ్యమంత్రి పదవిలోనే 23 ఏళ్ల అంటే దాదాపు ఒక యంగ్ జనరేషన్ వయస్సు. అలాగే తొలిసారి ఎమ్మెల్యేగా 1978లో 28 ఏళ్ల వయసుకే చంద్రబాబు మొదటిసారి అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. చట్టసభలో అడుగు పెట్టారు. దీనిని బట్టి ఏం అర్థం అవుతోంది? చంద్రబాబు రాజకీయ ధీశాలి. సుదీర్ఘ అనుభవశాలి. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో సంక్షోభాలను ఎదుర్కొని, వాటినే అవకాశాలుగా మలచుకుని ‘దార్శనిక నేత’గా ఎదిగిన లీడర్ చంద్రబాబు నాయుడు. ఇవాళ దేశంలో అందరికంటే అనుభవజ్ఞుడైన ప్రజా నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి అందరికంటే ఎక్కువగా ఆదరించి అక్కున చేర్చుకున్న నేతగా చరిత్రలో నిలిచిపోతారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మరో పది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ, ఇంత సుదీర్ఘకాలం ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ మనగలిగిన నాయకుడు వర్తమాన రాజకీయ చరిత్రలో మరొకరు లేరు. కఠోర పరిశ్రమ, క్రమశిక్షణ, విలువలతో కూడిన నియమబద్ధమైన జీవనశైలి, ఎవరూ ఎత్తిచూపలేని శీలవంతమైన వ్యక్తిత్వం వల్లనే ఇది సాధ్యమైంది. భావి తరాల శ్రేయస్సు కోసం నిరంతర ఆలోచనలతో వినూత్న ప్రణాళికలను రూపొందించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న కార్యదక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన దార్శనికతతో తెలుగు జాతి భవితను తీర్చిదిద్దడమే కాకుండా సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంది పలికి దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న చంద్రబాబు నాయుడు విశ్వవిద్యాలయంలో సామాజిక న్యాయం కోసం పోరాడి తొలి విజయం సాధించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది, 1978 మార్చి 15న.. సరిగ్గా ఇదేరోజున శాసన సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి పిన్నవయసులోనే చట్టసభలో అడుగు పెట్టారు. శాసన సభ్యునిగా ఎన్నికైన మొదటి విడతలోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టడం మరో విశేషం. సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న నీటితరహా నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేసి ఆయారంగాలలో ఆనాడే అనుభవం గడించారు. అంటూ వివరించారు. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే బ్రహ్మణికి మొదటి నుంచీ రాజకీయ అవగాహ ఉంది.
ఆమె తన అత్త గురించి కూడా గొప్పగా చెబుతూ 2019 అక్టోబరు 29 ఫేస్ బుక్‌లో ఒక పోస్టు పెట్టారు.
చిన్నప్పుడు అత్తయ్యా వాళ్లింటికి వెళ్లడం... అక్కడే కొన్నిరోజులు ఉండటం అలవాటు. అందుకే పెళ్లయ్యాక నేను వేరే ఇంటికి వెళ్లాననిపించలేదు. ఇది నా మెట్టినిల్లు అనేకంటే ఇంకో పుట్టిల్లు అనే ఫీల్ అవుతా. చిన్నప్పుడు నేను భువనేశ్వరి అత్తయ్యకి భయపడేదాన్నట. అప్పుడప్పుడూ ఆ విషయం గుర్తు చేసి నన్ను ఆటపట్టిస్తుంటారు. తనకి ఆడపిల్లలు లేకపోవడంతో నన్నే కూతురు అనుకుంటారు. పెళ్లయ్యాక కూడా చదువుకుంటానంటే అందరికంటే ముందు అత్తయ్యే ప్రోత్సహించారు. ఆమె చాలా తెలివైనవారు. మావయ్య హెరిటేజ్‌ను స్థాపించి చంటిబిడ్డలా అత్తయ్య చేతుల్లో పెడితే దాన్ని రెండువేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. నా దష్టిలో ఇల్లాలిగా, వ్యాపారవేత్తగా ఆమె ‘ది బెస్ట్’. మావయ్యగారు రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఇటు ఇంటినీ అటు ఆఫీసునీ చాలా చక్కగా మేనేజ్ చేసుకుంటారు. ఆడవాళ్లకు ఆర్థిక స్వేచ్ఛా, స్వాతంత్య్రం అవసరమంటారు. అందుకే హెరిటేజ్ ద్వారా మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆడపిల్లల చదువుకి సాయం అందిస్తున్నారు. బయటే కాదు ఇంట్లో కూడా ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. అది నా విషయంలోనే రుజువైంది.
నన్ను నమ్మి హెరిటేజ్ కీలక బాధ్యతలు నాకు అప్పగించాలన్న నిర్ణయం అత్తయ్యదే. ఎప్పుడూ నన్ను గైడ్ చేస్తుంటారు. పెళ్లయ్యాక తననుంచీ నేను చాలా నేర్చుకున్నా. సెలవురోజైనా తెల్లవారుజామున నాలుగ్గంటలకే నిద్రలేస్తారు. వ్యాయామం ఆ తరవాత పూజా చేశాకే దినచర్య ప్రారంభిస్తారు. ఆరోగ్యంపట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇంట్లోకీ, మావయ్యగారికీ ఏం కావాలో స్వయంగా చూసుకుంటారు. తరచూహెరిటేజ్ బ్రాంచిలన్నింటికీ వెళ్లొస్తుంటారు. ఎంత దూరం ప్రయాణం చేసినా అత్తయ్య అస్సలు అలసిపోరు. ఆ విషయంలో నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఏ పనినీ వాయిదా వేయరు. ఏదైనా చేయాలీ అనుకుంటే వందశాతం కష్టపడి చేసి తీరతారు. ఆ పట్టుదల నాకు బాగా నచ్చుతుంది. మా అబ్బాయి దేవాన్ష్ పనులైతే ఎవర్నీ చేయనివ్వరు. తనే వాడిని రెడీ చేసి స్కూలుకు పంపుతారు. నానమ్మగా వాడితో క్వాలిటీ టైం గడపడానికే చూస్తారు. నాకేదన్నా పని ఉంటే వాడికోసం ఆమె ఇంట్లో ఉండిపోయి నన్ను పంపుతారు. అలాంటప్పుడే ఉమ్మడి కుటుంబం విలువ తెలుస్తుంది. నాక్కూడా అదే ఇష్టం. అందుకే పెళ్లైనప్పట్నుంచీ అత్తయ్య వాళ్లతోనే కలిసి ఉంటున్నాం.
నా విజయంలో అత్తయ్యదే కీలక పాత్ర అని గర్వంగా చెప్పుకుంటా. పండగలూ, ఇతర ఫంక్షన్లప్పుడు తను దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుని మీరంతా సమయానికి వస్తే చాలని చెబుతారు. ఎప్పుడూ చురుగ్గా ఉండే అత్తయ్య పనితీరు చూస్తే నాకు ముచ్చటేస్తుంది. తనని దగ్గరగా చూస్తున్న నేను కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా. అత్తయ్యలా వ్యక్తిగతంగానూ వృత్తి గతంగానూ చక్కగా సమన్వయం చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నా. అంటూ పెట్టిన పోస్టు కొన్ని లక్షల మందిని చూసేలా చేసింది.
2024 ఎన్నికల్లో భర్త గెలుపు కోసం మంగళగిరి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తిరిగి ప్రచారం చేశారు. గెలుపు సాధించిన తరువాత జరిగిన పలు సంతోషకర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజలు వంటి కార్యక్రమాలకు భర్తతో హాజరయ్యారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నప్పుడు కుటుంబ సమేతంగా అందరూ ఎంతో ఆనందంగా గడిపిన అంశాన్ని కూడా ఆమె ఫేస్ బుక్‌లో పంచుకున్నారు. సంతోషం, దుఃఖం ఏదైనా సరే సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌లను ముఖ్యులు ఎవరు కలిసినా వారి ఫోటోలు షేర్ చేస్తున్నారు. కార్యక్రమాన్ని గురించి వివరిస్తున్నారు. దటీజ్ బ్రాహ్మణి.
Next Story