ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా పట్టణాలు, నగరాల్లో బంధువులు, అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్లు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. కొందరు ఒకే పార్టీ నుంచి పోటీ పడుతుండగా మరికొందరు వేరువేరు పార్టీల నుంచి పోటీ పడుతున్నారు.
విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్సీపీ, ఎన్డీఏ కూటమి నుంచి అన్నదమ్ములు పోటీ పడుతున్నారు. అన్న పదేళ్లకు పైగా రాజకీయాల్లో వుండగా తమ్ముడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరగానే ఏకంగా చంద్రబాబు నాయుడు విజయవాడ పార్లమెంట్ స్థానం కేటాయించారు. ఇరువురూ విజయవాడ నివాసులు. అన్నదమ్ములు. కేశినేని శ్రీనివాస్ (నాని) తెలియని వారుండరు. ఎందుకంటే ఆయన విజయవాడ ఎంపీగా రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైఎస్సార్సీపీ ప్రభంజనం వీచినా కొట్టుకుపోకుండా ఎంపీగా నానీ విజయ దుందుబీ మోగించారు. అయితే ఇప్పుడు పేట్లు తిరగబడ్డాయి. ఏమిటి ఆ కథ. ఎందుకు తిరగబడ్డాయో చూద్దాం..
రాజకీయ వేదికైన విజయవాడ
విజయవాడ నగరం, ఉమ్మడి కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు వేదిక. ఒకప్పుడు హైదరాబాద్ అయితే రాష్ట్ర విభజన జరిగిన తరువాత విజయవాడ కేంద్రంగానే రాజకీయ వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు జరుగుతున్నాయి. నదికి దక్షిణం వైపున ఉన్న తాడేపల్లి కూడా నేతల నివాసాలకు ఆవాసమైంది. అటువంటి రాజకీయ గడ్డపై పుట్టిన ఎంతో మంది అన్ని పార్టీల్లోనూ ఉద్దండులుగా ఉన్నారు. కొందరు రిటైర్డ్మెంట్ తీసుకుని ప్రశాతంగా ఉన్నవారు కూడా ఉన్నారు. పైగా పత్రికలకు విజయవాడ పెట్టింది పేరు. అటువంటి జిల్లా కేంద్రమైన విజయవాడలో జన్మించిన కేసినేని సోదరులు ఒకప్పుడు వ్యాపారాలు చేసుకునే వారు.ఇరువురూ పదోతరగతి వరకే చదువుకున్నారు. చదువు పెద్దగా లేకపోయినా వారి తాత, తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు కాపాడుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ సాగుతున్న జీవితం ఒక్కసారిగా రాజకీయ రంగంలోకి రావాలని కోరుకుంది.
ప్రజారాజ్యం ద్వారా నాని రాజకీయాల్లోకి..
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కేశినేని శ్రీనివాస్ (నాని) ముందుగా చేరారు. అక్కడ మూడు నెలలు మాత్రమే ఉన్నారు. ఆ తరువాత 2009లో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు వద్దకు వెళ్లి నాని చేరారు. పార్టీలో పనిచేస్తూ చంద్రబాబు వద్ద గుర్తింపు తెచ్చుకుని 2014లో విజయవాడ పార్లమెంట్ సీటు సాధించారు. ఆ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు వద్ద మంచి మార్కులు కొట్టేశారు. తిరిగి 2019లోనూ నానికి చంద్రబాబు సీటు ఇచ్చారు. జిల్లా మొత్తంగా ఒక్క విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ తప్ప ఎమ్మెల్యే అభ్యర్థులు టీడీపీ నుంచి ఓటమి చవిచూశారు. మరింత ధఢంగా పార్టీ నుంచి పనిచేయడం మొదలు పెట్టారు నాని.
రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నానికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదు. ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. చిన్నగా తమ్మడి పెత్తనం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పెరగటంతో నాని వెనుకంజ వేస్తూ వస్తున్నారు. చివరకు 2014 జనవరి 10న తెలుగుదేశం పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.
చిన్ని ప్రవేశం..
కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలో సేవా కార్యక్రమాలు చేపట్టడం ముమ్మరం చేశారు. తిరువూరులో జరిగిన రా.. కదిలిరా.. సభను విజయవంతం చేయడంలో చిన్ని విజయం సాధించారు. చిన్ని, నానిలకు తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తులు పోకుండా పట్టుకొచ్చారు. గత ఎన్నికల సందర్భంగా నాని తన ట్రావెల్ సంస్థను మూసివేశారు. చిన్నికి వచ్చిన ఆస్తులను తన స్నేహితుడైన వ్యక్తి వద్ద వ్యాపార పెట్టుబడి పెడుతూ వచ్చాడు. దీంతో వ్యాపారం కంటే రాజకీయాలే వారికి వ్యాపకంగా మారాయి.
చిన్ని కొంతకాలం క్రితం నారా లోకేష్ సూచన మేరకు గుడివాడ నియోజకవర్గం నందివాడ గ్రామానికి చెందిన వెనిగండ్ల రాము వద్ద పెట్టుబడి పెట్టి అమెరికాలోని ఆయన సాప్ట్ వేర్ కంపెనీలో వాటా తీసుకున్నారు. దీంతో లెక్కకు మిక్కిలిగా డబ్బు సంపాదించాడు. లోకేష్ సలహా మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. వెనిగండ్ల రాముకు గుడివాడ శాసనసభ స్థానం కేటాయించగా కేశినేని చిన్నికి విజయవాడ పార్లమెంట్ స్థానం కేటాయించారు. 2024లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చిన్ని విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు.
ఖర్చులో ఇద్దరూ ఇద్దరే..
ఎన్నికల్లో ఖర్చుకు సంబంధించి ఇద్దరూ ఒకరికి ఒకరు తగ్గేట్టు కనిపించడం లేదు. ఎవరికి వారు కోటాను కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఇప్పటికే ప్రచారం మొదలు కావడంతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కేశినేని నాని, టీడీపీ కూటమి అభ్యర్థిగా కేశినేని చిన్నిలు ఖర్చుకు వెనుకాడటం లేదు. నియోజకవర్గాల్లో కూడా గతం కంటే భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల్లో వార్ వన్ సైడ్ ఉండగా ఈ ఎన్నికల్లో మాత్రం పరిస్థితి అలా లేదు. ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గంలో కేశినేని నానికి వర్గం ఉంది. వారి ద్వారా ఓటర్లను ఆకర్శించే శక్తి కూడా ఎక్కువగానే ఉంది. చిన్నికి వర్గం పెద్దగా లేదు. అయితే అన్నకంటే ఒకింత ఎక్కువగానే ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం చిన్నఆదాయం నెలకు కోట్లలోనే ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లోకేష్ కోరిక మేరకు చిన్నికి సీటు దక్కిందని, విజయావకాశాలు ఎలా ఉంటాయనే దానిపైనే ప్రధానంగా చర్చ సాగుతున్నట్లు చిన్ని అనుచరులు అంటున్నారు.