సినీ రంగంలోనే కాదు రాజకీయంలోనూ మెగా ఫ్యామిలీ రాణించింది. అన్నదమ్ములు మంత్రులు అయ్యారు. ఒకరు కేంద్రంలో గతంలో మంత్రి కాగా ఇద్దరు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నారు.


నేటి రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఎవరు ఎప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారో చెప్పటం కూడా కష్టంగానే ఉంటుంది. ఒకప్పుడు ఎమ్మెల్యే, ఎంపీగా గెలవాలంటే కనీసం ప్రజల మధ్య ఎన్నో పోరాటాలు చేయాలి. ఏ ముఖ పరిచయం లేకుండా రాజకీయాల్లో రాణించిన వారు కూడా ఉన్నారు. ప్రజల తరపున పోరాడే వారు ఏదో ఒకరోజు పదవులు అలంకరిస్తారు. కానీ నేడు ముఖ్యమంత్రి అనుకుంటే ఎవరైనా మంత్రి కావొచ్చు. ఎమ్మెల్సీ కావొచ్చు. అధికారంలో ఉన్నంత కాలం వారు మంత్రులుగానే ఉండొచ్చు. ఒకవైపు పోరాడుతూ, రెండో వైపు మంత్రులుగా అయిన వారు మెగా ఫ్యామిలీ అన్నదమ్ములు.

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ గురించి, వారి సోదరుల గురించి తెలియని వారు లేరు. ఎందుకంటే వారు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ సినీ రంగంలో మెరుపులు సృష్టించిన వారు. ప్రధానంగా చిరంజీవి, ఆయన రెండో తమ్ముడు పవన్ కల్యాణ్ లు హీరోలుగా నేటికీ అందరి నోళ్లలో నానుతున్నవారే. మెగా ఫ్యామిలీ నుంచి వారి కుమారులు కూడా సినీ హీరోలయ్యారు. సినీ రంగంలో వారు చూపిస్తున్న తెగువ తెలుగు వారికి బాగా నచ్చింది. అందుకే ఆ ఫ్యామిలీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. పవన్ కల్యాణ్ అంటే అభిమానించే వారు ఎంతో మంది ఉన్నారు. రాజకీయాలతో పాటు సినీ రంగాన్ని కూడా వంట బట్టించుకున్న వారి సామాజిక వర్గంలో ఎక్కువ మంది వారి వెంటే ఉన్నారు. అందుకే పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి అక్కడే నివాసం ఉండేందుకు ఇల్లు కూడా కట్టించుకుంటున్నారు.

చిరంజీవి మొదటి సారి ఆయన కుటుంబం నుంచి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. తెలుగు అభిమానులు ఆయనను ఒక్కసారిగా అక్కున చేర్చుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ గాలి బాగా వీస్తున్న రోజుల్లో ప్రజారాజ్యం తరపున తనతో పాటు మొత్తం 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించ గలిగారు. అయితే పార్టీని ఎక్కువ కాలం నిలబెట్టలేక పోయారు. ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. కాంగ్రెస్ పెద్దలు ఆయనకు రాజ్యసభ సభ్యునిగా ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చారు. ఆ తరువాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తిరిగి మళ్లీ సినీ రంగంలోనే ఉంటూ సినిమాలు తీస్తున్నారు. చిరంజీవి నోటి నుంచి ఏ మాట వచ్చినా ఎదుటి వారిని నొప్పించకుండా ఉంటుంది. అందుకే ఆయన రాజకీయాల్లో నిలదొక్కుకోలేక పోయారు.

తరువాత రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపన రోజే తన పార్టీ రౌద్రంతో నిండి ఉంటుందని, రెవల్యూషనరీ టైప్ పార్టీగా సాగుతుందని చెప్పారు. ఆ తరువాత కాలంలో ఆయనలో తప్ప పార్టీలోని మిగిలిన వారిలో రౌద్రం కనిపించలేదు. అయినా పదేళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో సమస్యల పట్ల గానీ, రాజకీయాల పట్ల గానీ పోరాటం నిర్వహించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమి ద్వారా పోటీ చేసి 21 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. తాను ఉప ముఖ్యమంత్రి కాగలిగారు. సీఎం చంద్రబాబు కూడా పవన్ కల్యాన్ కు ఇప్పటి వరకు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. పవన్ కల్యాన్ ఏమి అడిగినా కాదనకుండా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా తన అన్న నాగబాబును పంపించాలని కోరారు. అయితే టీడీపీలో తప్పనిసరిగా రాజ్యసభకు పంపించాల్సిన మరో వ్యక్తి సానా సతీష్ ఉన్నారని, పార్టీకి ఆర్థికంగా ఆయన ఎంతో తోడ్పాటు అందించారని, అందువల్ల ఆయనకు ఈ అవకాశం ఇచ్చి నాగబాబును రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకుందామని పవన్ కల్యాణ్ కు చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీ మేరకు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించడంతో పాటే నాగబాబును కూడా మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటించారు.

మెగా ఫ్యామిలీలో రాజకీయ రంగంలో ముగ్గరు అన్నదమ్ములు రాణించారు. జనసేన పార్టీ స్థాపించిన రోజు పవన్ కల్యాణ్ ఒక్కరే ఫ్యామిలీ నుంచి ఉన్నారు. తరువాత నాగబాబు పార్టీలోకి వచ్చి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లు ప్రకటించడంతో పవన్, చిరంజీవి, నాగబాబు అభిమానుల్లో ఉత్సాహం పెరిగి పోయింది. పార్టీకి ఆదరణ కూడా బాగా పెరిగింది. ఇప్పటికే రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో పూర్తి కావొచ్చింది. అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలు నిర్మించే పనిలో జనసేన పార్టీ నాయకులు ఉన్నారు.

Next Story