సనాతన ధర్మంపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు తమిళనాడుకు పాకాయి. పవన్‌పై కేసు నమోదు చేశారు.


ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సనాతన ధర్మం అంటూ రాజేసిన మాటల మంటలు తమిళనాడును తాకాయి. ఇది కాస్తా ఇరువురు ఉపముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్దానికి దారితీయడంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య స్నేహ సంబంధాలు దెబ్బతీసేలా పరిణమించాయి. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిపై పవన్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో డిఎంకే వర్గాలు బగ్గుమన్నాయి. మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పవన్‌ కళ్యాణ్‌పై తమిళనాడు రాష్ట్రం మదురై పోలీసు కమిషనర్‌కు న్యాయవాది వాంజినాథన్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పవన్‌ కళ్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఏపి డిప్యూటీ సీఎంల మధ్య ఎక్స్‌లో వార్‌ కొనసాగుతోంది.

వారాహి డిక్లరేషన్‌ పేరుతో తిరుపతిలో నిర్వహించిన సభలో సనాతన ధర్మం గురించి పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని, అలా అనుకున్న వారంతా తుడిచిపెట్టుకుని పోతారని, మీ లాంటి వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారని, కానీ సనాతన ధర్మం మాత్రం ఎప్పటికీ నిలచే ఉంటుందని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వైరస్‌తో పోల్చుతూ గతంలో ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడిన మాటలపై పవన్‌ కళ్యాణ్‌ వారాహి సభలో ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడుకు చేరాలనే ఉద్దేశంతో ప్రత్యేకించి జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవన్‌ చేసిన వ్యాఖ్యలను తమిళంలో మాట్లాటడం గమనార్హం. తమిళనాడు ప్రజలకు, ఉదయనిధి స్టాలిన్‌కు అర్థం కావాలనే ఉద్దేశంతోనే పవన్‌ కళ్యాణ్‌ తమిళంలో వ్యాఖ్యానించారు.
పవన్‌ కళ్యాణ్‌ కావాలని చేసిన ఈ వ్యాఖ్యలపట్ల తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ కూడా స్పందించారు. వెయిట్‌ అండ్‌ సీ అని బదులిచ్చారు. మరో వైపు ఉదయనిధి స్టాలిన్‌పై పవన్‌ కళ్యాణ్‌ తమిళంలో చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో కలకలం రేపాయి. పవన్‌ వ్యాఖ్యలపై డిఎంకే వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వంజనాథన్‌ అనే న్యాయవాది పవన్‌ కళ్యాణ్‌ఫై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై పవన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని మదురై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తిరుపతి తిరుమల లడ్డూ వివాదానికి, ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని, అయినా పవన్‌ కళ్యాణ్‌ విమర్శలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మదురై పోలీసులు పవన్‌ కళ్యాణ్‌పై కేసు నమోదు చేశారు.
ఈ కేసు పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కేసు దర్యాప్తును తమిళనాడు పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఇరు రాష్ట్రాల మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టే అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు తీసుకోకపోతే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ప్రతిష్ట ఏం కావాలని వత్తిడి ఆ రాష్ట్ర నేతల నుంచి పెరిగే అవకాశం లేకపోలేదు. మొత్తానికి సనాతనధర్మం పేరుతో పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల స్నేహసంబంధాలకు గొడ్డలిపెట్టుగా మారాయని మేథావులు ఆందోళన చెందుతున్నారు.
Next Story