పోలీసు అధికారి అయ్యుండి కూడా ఎన్నికల కోడ్‌ ఉందనే సంగతి మరిచి పోయారు. ఆయన చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది.


ఓ పోలీసు అధికారి ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని మరిచి పోయారు. వేదిక మీద తన ఇష్టాను సారం ప్రసంగం చేశారు. సదరు అధికారి మాటలు ఎన్నికల కోడ్‌ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఎన్నికల అధికారి సదరు పోలీసు అధికారిని వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది.

కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని తిలక్‌ మెమోరియల్‌ టౌన్‌హాలులో శెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సీఐ కడియాల అశోక్‌కుమార్‌ ఆ కార్యక్రమానికి అతిధిగా వెళ్లారు. పోలీసు యూనిఫాంతోనే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను రామచంద్రాపురం సీఐగా రావడానికి మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి సత్యం ఎంతగానో సహాయ సహకారాలు అందించారని, ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి వాసంశెట్టి సత్యానికి తనతో పాటు తన కుటుంబం జీవితాంతం వారికి రుణపడి ఉంటామని సీఐ కడియాల అశోక్‌కుమార్‌ బహిరంగంగా మాట్లాడారు. భవిష్యత్‌ అంతా మనదే. ఎందుకంటే పోలీసు శాఖతో పాటు ఇతర శాఖల్లో కూడా మన వాళ్లు ఉన్నారు.
మనలను మనం నిరూపించుకుంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో మనదే పైచేయి అవుతుంది. మీ ఇగోలతో పిల్లల భవిష్యత్‌ను పాడు చేయొద్దు. రాజకీయాం వేరు. కులం వేరు. ఏ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా కులాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరూ కృష్టి చేయాలి. నేను సర్వీసులోకి వచ్చి పన్నెండేళ్లు. నా అనుభవంతో చెబుతున్నా. అగ్రకులాల్లో భార్యా భర్తల గొడవలు, వివాదాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫోన్లల్లోనే వాటిని పరిష్కరించుకుంటారు. మరి కొన్ని కులాల్లో కూడా కుటుంబ తగాదాలను పోలీసుల వరకు రాకుండానే చూసుకుంటారు. అదే మన సామాజిక వర్గంలో అయితే కుటుంబ గొడవలు ఊరంతా తెలిసి పోతాయి. గొడవలు మానుకొను గోప్యతను పాటించాలి అంటూ కులాల ప్రస్తావనతో కూడిన ప్రసంగం చేశారు. అన్ని వర్గాలను సమ భావనతో చూడాల్సిన సీఐ అశోక్‌కుమార్, బహిరంగ వేదికపై నుంచి ఇలాంటి వ్యాఖ్యల చేయడం వివాదాస్పదంగా మారింది. సీఐ ప్రసంగంపై తాళ్లపొలం సర్పంచ్‌ కట్టా గోవింద్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల పరిశీలకులు, ఐఏఎస్‌ అధికారి కే హర్షవర్థన్‌కి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. అంతేకాకండా సీఐ ప్రసంగం అప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై స్పందించిన కే హర్షవర్థన్‌ సీఐ కడియాల అశోక్‌కుమార్‌ను వీఆర్‌కు పంపాలని ఐజీకి సూచించడంతో ఆ మేరకు సీఐని వీఆర్‌కు పంపుతూ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. పీడీఎఫ్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అకాల మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. త్వరలో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో సీఐ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ఇదిలా ఉంటే ఏరికోరి తెచ్చుకున్న సీఐ వివాదాల్లో ఇరుక్కోవడం మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు తలనొప్పిగా మారిందని స్థానిక కూటమి శ్రేణులు చర్చించుకుంటున్నారు.
Next Story