ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట వద్ద బొప్పూడిలో జరిగిన ఎన్‌డిఎ కూటమి సభ ఎటువంటి హామీలు ఇవ్వలేదు. ప్రధానమంత్రి, మాజీ సీఎంలు ఈ సభలో ముఖ్యులు.


ఎపిలో ఎన్‌డిఎ కూటమి నిర్వహించిన ఎన్నికల సభ ఓటర్లను నిరుత్సాహ పరిచింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత మొదటి సారిగా సభలో ముఖ్య అతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఎన్‌డిఎ కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సభను నిర్వహించారు. మేదరమెట్ల వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సభకు సుమారు 15 లక్షల మందిని హాజరయ్యేలా ప్రయత్నించి సభ నిర్వహించారు. ఆ సభను మించిన జనం ప్రజాగళం సభకు రావాలని ప్రయత్నించి నిర్వహించారు. లక్షల సంఖ్యలో ప్రజలు హాజరైన సభలో ప్రధానమంత్రి ఓటెయ్యాలని ప్రజలను అడిగారు తప్ప ఎటువంటి హామీలు ఇవ్వలేదు.

రాష్ట్రానికి విద్యా సంస్థలు, కేంద్ర వెద్యశాల ఇచ్చామని చెప్పారు. రాష్ట్రం అధోగతిలో ఉందని, రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతాపార్టీపై ఉందనే విషయం మాత్రం సభలో ప్రస్తావించలేదు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగిన వారే. వారు అధికారం చేపట్టి పదేళ్లయినా ప్రత్యేక హోదా మాట మళ్లీ మాట్లాడలేదు.
బీజేపీకి ఓటు వేయాలా.. వద్దా.. అనే విషయంలో ఖచ్చితమైన క్లారిటీకి ఓటర్లు రావాలని సోషల్‌ యాక్టివిస్ట్, పొలిటికల్‌ ఎనలిస్ట్‌ తుంగా లక్ష్మినారాయణ చెప్పారు. ఫెడరల్‌ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఏపీ విభజన చట్టం ప్రకారం రావాల్సిన సంస్థలు కానీ, ప్రాజెక్టులు కానీ, రాజధానిపై కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వని మోదీని ఎందుకు ఆమోదించాలో ఓటర్లు మరోసారి ఆలోచించుకోవాలి. రాష్ట్రప్రభుత్వం అభివద్ధిని ధ్వసం చేసింది. అందువల్ల ప్రత్యామ్నాయం అవసరమని ప్రజలు భావిస్తుండొచ్చు. అయితే ఆ ప్రత్యామ్నాయానికి టీడీపీ, జనసేనలు ఉన్నాయి. ఆ కూటమిలో ఉన్న బీజేపీని ఎందుకు గెలిపించాలో ప్రజలు ఆలోచించుకోవాలి. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీయే అసదు దోషి. ఈ విషయం ప్రజలు గుర్తిస్తే చాలు.
ప్రత్యేక హోదా ఎందుకు మాట్లాడలేదు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు ఇవ్వాలని ప్రశ్నించిన బీజేపీ ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు. ఆర్థిక వనరులు, ఆస్తులు ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నాయని, విడిపోయినప్పుడు వారికి ఎక్కువ అసెట్స్‌ వెళ్లాయనేది వాస్తవమని వారే అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు రాష్ట్రం బాగుకోసం, ఆర్థికంగా బలపడేందుకు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానమంత్రి ప్రత్యేక హోదాపై ప్రకటన చేసే అవకాశం ఉందని ఓటర్లు భావించారు. కానీ ప్రధాని ప్రసంగం ఓటర్లను పూర్తిగా నిరాశపరిచింది.
పోలవరం ఎందుకు పూర్తి చేయడం లేదు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును ఇంత వరకు పూర్తి చేయలేదు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించిన ప్రాజెక్టు దాదాపు 20 సంవత్సరాలు కావస్తున్నా పూర్తి కాలేదంటే పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పోలవరం పూర్తయితే ఎంతో మందికి మేలు జరుగుతుంది. లక్షల మంది బాగుపడే ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. నిధులు కేంద్రం సకాలంలో ఇవ్వడం లేదని, అందువల్లే పూర్తి కావడం లేదని రాష్ట్ర పాలకులు చెబుతున్నారు. నిజంగా నిధుల సమస్యే అయితే కేంద్రానికి ఈ ప్రాజెక్టు పూర్తికి నిధులు సమకూర్చడం పెద్ద సమస్యేమీ కాదని నీటిపారుదల రంగ నిపులు చెబుతున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ మీటింగ్‌ అట్టర్‌ప్లాప్‌ అయిందని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ వి విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలు, అంచనాలకు ఈ సభ రీచ్‌ కాలేదు. కొత్త వాగ్ధానాలు కానీ, ప్రతిపాదనలు కానీ ఇవ్వలేదు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వీటి గురించిన ప్రస్తావనే లేదు. ఏపీ అభివద్ధికి సంబంధించి భవిష్యత్‌ ప్రణాళిక ఏమీ ప్రకటించలేదు. వీళ్లకు రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల ఏ మాత్రం అవగాహన లేదు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన సభ.
రాజధాని సమస్య..
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని పెద్ద సమస్యగా మారింది. పది సంవత్సరాలు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ రాష్ట్ర విభజన జరిగింది. పాలకుల అసమర్థత కారణంగా హైదరాద్‌లో ఉండలేదు. ఏపీలో సెక్రటేరియట్‌ నిర్మించలేదు. ఎంత విచిత్రమంటే ప్రపంచంలో అందరూ మనవైపే చూసేటట్టు రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు చెబితే ఆ తరువాత వచ్చిన జగన్‌ ఒకేచోట రాజధాని ఎందుకు నేను మూడు చోట్ల కడతానని చెబుతూ ఐదేళ్లు గడిపారు. ఇదీ పాలకుల తీరు. దీనిని ఎందుకు కేంద్రం ప్రశ్నించలేదు. ప్రధానమంత్రి స్వయంగా పాల్గొన్న సభలో మీ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం వ్యవహారం కేంద్రం చూసుకుటుందని హామీ ఇస్తే రాష్ట్ర పాలకులు ప్రధాన మంత్రి మాటను కాదంటారా? ఏమిటి ఇందులో మర్మం. ఎందుకు కేంద్ర పాలకులు ఆంధ్ర రాష్ట్రంపై చిన్న చూపు చూస్తున్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన తొలి ఎన్‌డిఎ సభ గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వయంగా దేశ ప్రధాని పాల్గొన్న ఈ సభలో భద్రతా వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరారు.
జనం నమ్మటం లేదనే కోపమా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు బీజేపీని నమ్మడం లేదు. ఇప్పుడు కూటమి పేరుతో తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పొత్తులో పోటీ చేస్తున్నందున కొన్ని సీట్లు బీజేపీ గెలుచుకుంటుంది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ఓట్లు ఎలాగూ బీజేపీ తీసుకుంటుంది. అంతేకాని మిగిలిన వ్యవహారాలు మాకెందుకని ప్రధాని భావించినట్లున్నారు. ప్రత్యేకించి బీజేపీకి ఓట్లు వేసి గెలిపిస్తే ఏదైనా చేయోచ్చు. అలా జరగనప్పుడు వాళ్ల బాధలు వాళ్లు పడతారని పట్టించుకోవడం లేదని ప్రజలు భావిస్తున్నారు.
రాష్ట్రానికి రాజధాని లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ లేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావన లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రై వేటీకరణ జరగదని చెప్పలేదు. రైల్వే జోన్‌ గురించి వివరించలేదు. ఓడరేవుల గురించి మాట్లాడలేదు. అసలు ఏపీ పునర్విభజ చట్టం గురించే ప్రస్తావించని మోదీని ప్రజలు ఎలా ఆదరిస్తారో చూడాల్సి ఉంది.
Next Story