నీ వంతు నువ్వే సాయమవ్వరో.. జగనన్న చూపే దారి సాగరో అంటూ చెత్త సేకరించే బండి నుంచి వచ్చే పాట ఆగిపోయింది.


ఆంధ్రప్రదేశ్‌లో చెత్తబండ్లు చెత్త సేకరణకు వీధుల్లోకి వెళ్లినప్పుడు స్వచ్ఛాంధ్ర పాటొకటి రికార్డు వేస్తారు. ఆ పాటను అధికారులు ఆపివేశారు. ఆ పాటలో ముఖ్యమంత్రి జగన్‌ పేరు ఉండటంతో తమపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని భయపడి పాటను ఆపివేశారు. వాస్తవానికి ఆ పాట ఏమిటో కూడా ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. అయితే చెత్త బండి వస్తుందని తెలుసుకునేందుకు మాత్రం ఆపాట ఉపయోగ పడేది.

ఆ పాట చరణం చూద్దాం..
‘‘ఏ రంగా రంగా.. సింగారంగా.. నగరాన్నంతా మార్చుదాం.
సుబ్బరంగా.. సుందరంగా వీధులు అన్నీ అద్దాల్లాగా మురిపించి మెరిపించుదాం..
స్వచ్ఛాంధ్ర వైపు బాట వేయ్యరో.. జగనన్న కింక మాట ఇయ్యరో..
నీ వంతు నువ్వే సాయమవ్వరో.. జగనన్న చూపే దారి సాగరో..’’
అంటూ బండ్లో నుంచి రికార్డు పాట వస్తుండేది. కోడ్‌ దెబ్బకు ఒక్క సారిగా మూగబోయింది.
మళ్లీ విజిల్‌
గతంలో చెత్త సేకరణకు వచ్చిన బండ్ల వారు వీధుల్లో విజిల్‌ వేస్తూ వచ్చేవారు. చెత్త బండి శబ్ధం లేకుండా వీధుల్లోకి వస్తుండటంతో చెత్తను సేకరించే ఉద్యోగులు విజిల్‌ వేయడం మొదలు పెట్టారు. ఎందుకు విజిల్‌ వేస్తున్నారని చెత్త సేకరణ చేసే రమణమ్మను ప్రశ్నిస్తే కమిషనర్‌ గారు పాటను ఆపేయమన్నారు. అందుకే విజిల్‌ వేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మునిసిపాలిటీలో ఉదయం లేచింది మొదలు 11 గంటల వరకు వీధుల్లో చెత్త బండ్లు చెవులు మారు మోగించేవి. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందని నివాసాల్లోని వారు చెబుతున్నారు.
ఈ చెత్తబండ్లు ఏర్పాటు చేసినందున ఒక్కో ఏరియాకు ఒక్కో విధమైన రేట్లు ఫిక్స్‌ చేసి నెలవారీగా చెత్త సేకరణ రుసుం ప్రభుత్వం వసూలు చేస్తున్నది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు చాలా రోజులు ఆందోళనలు చేశారు. కమ్యూనిస్టులు ముఖ్యంగా ఆందోళన చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.
చిరు వ్యాపారులకు చుక్కెదురు
విజయవాడ ఈస్ట్‌ నియోజకవర్గంలో చిరు వ్యాపారులకు చిక్కులు వచ్చాయి. ఈ నియోకజవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌లు తమ పార్టీ గుర్తులు, రంగులు వేసి చిరు వ్యాపారులక పండ్ల బండ్లు, ఇస్త్రీ బండు, బంకులు, టిఫిన్‌ బండ్లు సొంత డబ్బుతో ఇప్పించారు. నియోజకవర్గంలో దాదాపు ప్రతి వీధిలోనూ ఈ బండ్లు కనిపిస్తుంటారు. ఈ బండ్లకు వేసిన రంగులు, పార్టీ గుర్తులు కనిపించటానికి వీలు లేదని మునిసిపల్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధికారులు వారిని బెదిరించడం మొదలు పెట్టారు. కొందరు గుడ్డలు చుట్టుకుంటుంటే మరి కొందరు న్యూస్‌ పేపర్లు అంటించుకునే పనిలో పడ్డారు. మరి భవనాలకు వేసిన పార్టీ రంగులు ఉంచుతారో తీసేస్తారో వేచి చూడాల్సిందే.
Next Story