పార్శిల్‌లో మృత దేహం రావడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో భయాందోళనలకు గురయ్యే సంఘటన చోటు చేసుకుంది. విద్యుత్ సామానుకు బదులు మృత దేహం పార్శిల్ రావడంతో ఆ ప్రాంతంలో ఒక్క సారిగా కలవరపాటుకు గురయ్యారు. కలకలం రేపిన ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో చోటు చేసుకుంది. ఓ మహిళ సొంత ఇంటిని నిర్మించుకునేందుకు సహాయం కోసం క్షత్రియ సేవా సమితిని ఆశ్రయించారు. ఆర్థిక సహాయం చేయాలని క్షత్రియ సేవా సమితికి దరఖాస్తులు చేసుకున్నారు. తొలి విడతలో ఆ సేవా సమితి టైల్స్‌ను ఆ మహిళకు అందజేశారు. మరో సారి ఆర్థిక సహాయం కోసం అదే క్షత్రియ సేవా సమితిని ఆశ్రయించారు. విద్యుత్ సామాగ్రిని కావాలని ఆ మహిళ కోరారు. అందులో భాగంగా దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అయితే విద్యుత్ సామాగ్రికి బదులుగా మృత దేహంతో కూడిన పార్శిల్ వచ్చింది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆ మహిళ కుటుంబం, అందులో నుంచి తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై ఆరా తీస్తున్నారు.