
టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుకు విరాళం చెక్కు అందిస్తున్న నిజామాబాద్ యాత్రికులు
శ్రీవారికి తెలంగాణ భక్తుల విరాళం.. తిరుపతిలో 16న గో పూజ...
శ్రీవారి దర్శనానికి 10 గంటలు. ఇవీ.. తిరుమల వార్తల సమాహారం.
తిరుపతిలో టీటీడీ ఎస్వీ గోశాలలో జనవరి 16న ‘గోపూజ మహోత్సవం’ నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి క్షేత్రం మంగళవారం కూడా వైకుంఠ ద్వార దర్శనాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. యాత్రికులతో క్యూలు రద్దీగా ఉన్నాయి. దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. టీటీడీ ఎస్వీ అన్నదాన ట్రస్టుకు నిజామాబాద్ జిల్లా యాత్రికులు రూ. పది లక్షలు కానుకగా సమర్పించారు.
టీటీడీ ట్రస్టుకు విరాళం..
టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులకు ఈ సంవత్సరం ఆరంభం నుంచి ప్రతిరోజూ విరాళాలు అందుతూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన యాత్రికులు టీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 10 లక్షలు విరాళం చెక్కు అందించారు. శ్రీవారి దర్శనం తరువాత నిజామాబాద్ నగరానికి చెందిన కటకం శ్రీనివాస్, కుటుంబీకులతో కలిస విరాళం చెక్కును టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుకు అందించారు.
16న ఎస్వీ గోశాలలో గోపూజ
తిరుపతి శ్రీవేంకటేశ్వర గో సంరక్షణశాలలో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం ఐదు గంటల నుంచి 10.30 గంటల వరకు శ్రీవేణుగోపాలస్వామి వారికి అభిషేకం, పూజ, హారతి సమర్పిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.15 గంటల వరకు గోపూజ, కటమ, అశ్వ, వృషభ, గజ పూజ జరుగనుంది. 11.15 గంటలకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.
తిరుపతి శ్రీవేంకటేశ్వర గో సంరక్షణశాలలో గోపూజ మహోత్సవం రోజున గోవులకు బెల్లం, బియ్యం, గ్రాసం భక్తులు స్వయంగా తినిపించే అవకాశం ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నిరాటంకంగా సాగుతున్నాయి. యాత్రికులతో శ్రీవారి హుండీకి కూడా గణనీయంగా ఆదాయం లభిస్తోంది. రోజూ నాలుగు కోట్ల రూపాయలకు పైగానే ఉంటోంది. తిరుమలలో మంగళవారం పరిస్థితి ఎలా ఉందంటే..
శ్రీవారి దర్శనానికి వచ్చిన యాత్రికులతో క్యూలు కిటకిటలాడుతున్నాయి. దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న శిలాతోరణం నుంచి యాత్రికులను క్యూలోకి అనుమతిస్తున్నారు. వారందరికీ దర్శనం కల్పించడానికి ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారిని 82,650 మంది యాత్రికులు దర్శించుకుంటే, వారి ద్వారా హుండీకి 4.79 కోట్ల రూపాయలు (సోమవారం) ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే రోజు 3.98 కోట్ల రూపాయలు ఆదాయం దక్కింది. ఆదివారం 85,179 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకోగా, వారి నుంచి గణనీయంగా 4.79 కోట్ల రూపాయలు ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Next Story

