A rare donation to Srivaru | అనాథల కోసం.. శ్రీవారికి అరుదైన విరాళం
భారత్ సహా అనేక దేశాల్లో ఆమె విపత్తు అధికారిగా సేవలు అందించారు. ఓ మహిళా అధికారి ఏమి చేశారంటే..
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. వారు టీటీడీ (TTD) లోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందిస్తుంటారు. పేదల కోసం టీటీడీ నిర్వహించే దాతృత్వ కార్యకలాపాలల్లోనూ భాగస్వాములుగా ఉంటారు. శ్రీవారికి సోమవారం అందిన విరాళం చాలా అరుదైందిగా నిలిచిపోయింది. భారత్ సహా పలు దేశాల్లో విపత్తు అధికారిగా సేవలు అందించిన ఓ మహిళ, తన జీవితంలో ఆదా చేసిన ప్రతి పైసాను వెంకన్నకు కానుకగా సమర్పించారు. టీటీడీ విద్యా సంస్థల్లో చదువుతున్న అనాథ, పేద పిల్లల సంక్షేమం కోసం ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్ (SV Sarva Shreyas Trust) ఈ విరాళాన్ని వినియోగించనున్నారు.
చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన సి.మోహన భారతదేశంతో పాటు కొసావో, అల్బేనియా, యెమెన్, సౌదీ అరేబియాలో అభివృద్ధి - విపత్తు నిర్వహణ (Development - Disaster Management ) రంగాలలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉద్యోగ రీత్యా ఆమె ఎక్కడ పనిచేస్తున్నా, గోవిందుని నామస్మరణను మాత్రం మర్చిపోలేదు. తన వృత్తి జీవితంలో ఆదా చేసిన ప్రతి రూపాయిని శ్రీవారికి కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా ఆదా చేసిన రూ. 50 లక్షలు టీటీడీకి చెందిన శ్రీవెంకటేశ్వర సర్వ శ్రేయాస్ -ఎస్వీ బాలమందిర్ ట్రస్ట్ ( SV Balamandir Trust) ఇచ్చారు. ఆ మొత్తాన్ని డీడీ రూపంలో తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో సిహెచ్.వెంకయ్య చౌదరికి అప్పగించారు. ఆమె దాతృత్వాన్ని వెంకయ్య చౌదరి కొనియాడారు. మూడున్నర దశాబ్దాలకుపైగా తన వృత్తి జీవితంలో సంపాదించిన ధనాన్ని, గోవిందుడి కృపతో అనాథలు, పేదలకు ఉపయోగపడాలనే ఆమె నిర్ణయం ప్రశంసనీయమని అన్నారు.