Flamingo Festival | విదేశీ అతిథుల కోసం ఓ పండుగ
x
సూళ్లూరుపేట సమీపంలోని నేలపట్టు పక్షుల విడిది కేంద్రం

Flamingo Festival | విదేశీ అతిథుల కోసం ఓ పండుగ

సైబీరియా వలస పక్షుల సందడి పెరిగింది. జనవరిలో మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ lనిర్వహించనున్నారు.


ఆ పల్లెలకు అవి దేవతా పక్షులు. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే సైబీరియన్ పక్షులు (Siberian birds ) తరలివస్తాయి. శీతాకాలం ముగిసే వరకు అక్కడే విడిది చేస్తాయి. ఆ పక్షులను వేటాడితే అధికారులు కాదు. ఆ గ్రామ ప్రజలే సహించరు. ఆ పక్షుల కారణంగానే పంటలతో పొలాలు సస్యశ్యామలంగా ఉంటాయి. మేము సుభిక్షంగా ఉంటామని ఆ గ్రామాల ప్రజలు విదేశీ వలస పక్షులను అంతగా ప్రేమిస్తారు. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న పక్షులకు 2001 నుంచి (Flamingo ఫెస్టివల్) పండుగ నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.


నేలపట్టు, పులికాట్ సరస్సు వద్దకు విడిదికి వచ్చే విదేశీ పక్షుల సందడి నేపథ్యంలో పక్షుల పండుగ 2001 నుంచి ప్రారంభమైంది. ఇక్కడికి వస్తున్న పక్షులు, పరిశోధనలు, పక్షి ప్రేమికులు, ఔత్సాహికుల ఉత్సాహం వంటి కథనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. దీంతో ఈ ప్రదేశాలు పర్యాటకానికి కూడా అనుకూలంగా మలచడం ద్వారా ఆహ్లాదంగా సేద తీరడానికి అనువైన వాతావరణాన్ని కూడా కల్పించారు. రెవెన్యూ పర్యవేక్షణలో అటవీ శాఖ, పర్యాటకశాఖ, నీటిపారుదల శాఖలను కూడా సమన్వయం చేయడం ద్వారా 2001 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.

నెల్లూరు జిల్లా. ప్రస్తుతం జిల్లాలోని నేలపట్టు సమీపంలోని పక్షుల విడిది కేంద్రంలో ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరిలో నిర్వహించనున్నారు. 9వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఈ పండుగ నిర్వహించడానికి తిరుపతి జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. సూళ్లూరుపేట పులికాట్ సరస్సు వద్ద మూడు రోజుల పక్షుల పండుగ నిర్వహణకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ అధికారులతో సమీక్షించారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండల కేంద్రానికి సమీపంలోని రెండు కిలోమీటర్ల దూరంలోని నేలపట్టు విదేశీ పక్షులకు నిలయం. నేలపట్టు గ్రామం వద్ద చెరువులేనే కాకుండా, పులికాట్ సరస్సు విస్తరించిన నీటి పరీవాహక ప్రాంతంలో కూడా విదేశీ పక్షుల సందడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం శీతాకాలంలో విదేశీ పక్షులు వేల మైళ్లు ప్రయాణించి, ఆహారం సంతానోత్పత్తి కోసం వచ్చే పెలికాన్ పక్షులకు దక్షిణ ఆసియాలోని అతి పెద్దదిగా నేలపట్టు విడిది కేంద్రంగా మారింది.

ఇక్కడికే ఎందుకు..
నేల పట్టు సమీపంలోని నీటిలో 'కరుప్, నీర్' (Karup, Neer ) కంటి తో పాటు అనేక రకాల పేర్లతో పిలిచే "బేరింగ్ టోనియా యాక్యు టాంగ్యులా" (Baringtonia accipitrula ) శాస్త్రీయనామంతో ఉన్న మొక్కలు పుష్కలంగా పెరుగుతాయి. ఇవి దాదాపు నీటిలో సగభాగం మునిగి ఉంటాయి. ఇక్కడ ఉన్న బురద మట్టి ఈ చెట్లకు బాగా సరిపోతుంది. నీటిలోని చేపలకు ఆహారం బాగా దొరుకుతుంది. మత్స్య సంపదకు లోటు ఉండదు కాబట్టే పక్షులు సుధీర తీరాల నుంచి నేల పట్టుకు తరలి వస్తాయని పక్షి ప్రేమికులు చెబుతున్నారు.
సంతానోత్పత్తికి కేంద్రం
నేలపట్టు ప్రాంతం విదేశీ పక్షులకు నిలయంగా మారడానికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో గూడబాతులకు సంతానోత్పత్తికి కేంద్రంగా ప్రసిద్ధి చెందినట్లు గుర్తించారు. అంతేకాకుండా నత్త గుల్ల కొంగ, నీటి కాకి, తెల్ల కంకణాయి, శబరి కొంగ లాంటి అంతరిస్తున్న జాతులకు కూడా ఈ సంతాన ఉత్పత్తి కేంద్రంగా మారినట్లు గుర్తించారు.
ఇదే సీజన్
నేలపట్టు పక్షుల విడిది కేంద్రానికి, బర్మా, నేపాల్, అమెరికా, చైనా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అంటార్కిటిక్ ఆ ప్రాంతాల నుంచి కూడా శీతాకాలంలో పక్షులు వలస వస్తుంటాయి. నేల పట్టుకు చేరుకునే ఫ్లెమింగోతోపాటు పెలికాన్, సైబీరియన్ కొంగలతో పాటు విదేశీ పక్షులను ఈ ప్రాంతంలో విశిష్ట అతిథులుగా ప్రేమించడమే కాదు. వాటి రాక కోసం దొరవారిసత్రం మండలంలోని గ్రామాల ప్రజలు శీతాకాలం కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తూ ఉంటారంటే అతిశయోక్తి కాదు.
నేలపట్టు తో పాటు పులికాట్ సరస్సు విస్తరించిన ప్రదేశానికి ప్రతి సంవత్సరం విదేశీ పక్షులు రావడం అక్టోబర్ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయి. నవంబర్ మధ్య కాలానికి ఎక్కువ విదేశీ పక్షుల సందడి డిసెంబర్ నెల నాటికి ఎక్కువ సందడి పెరుగుతుంది. వలస వచ్చిన పక్షులు గోల్డ్ ఏర్పాటు చేసుకుంటాయి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో గుడ్లు పెట్టే ఈ పక్షులు డిసెంబర్ 2 లేదా మూడో వారంలో పిల్లల ఉత్పత్తికి అనుకూలంగా మార్చుకుంటాయని పక్షుల పరిశోధకులు చేసిన పరిశీలనలో వెళ్లడైంది. పొదిగిన పిల్లలకు తల్లి పక్షి ఈతకొట్టడం ఎగరడం ఆహారాన్ని సంపాదించుకోవడం వంటి విద్యలు కూడా నేర్పిస్తుందని పరిశోధనలో వెల్లడైంది.

పరిశోధన కేంద్రం
పక్షి ప్రేమికులకు నేలపట్టు ఓ పరిశోధనా కేంద్రంగా కూడా ఉపయోగపడుతుంది. అటవీ శాఖ పర్యవేక్షణలో ఉండే ఈ ప్రదేశం వద్ద వాచ్ టవర్ కూడా ఏర్పాటు చేశారు. పగలే కాదు రాత్రిళ్ళు కూడా పక్షుల జాడలను, కదలికలను ఫోటోలు తీసుకోవడానికి కూడా ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, పక్షుల ప్రేమికులు ఇక్కడికి కి పడుతుంటారు. నేలపట్టు వద్ద ఒక మ్యూజియం, గ్రంథాలయం, ఆడిటోరియం కూడా అటవీ శాఖ ఏర్పాటు చేసింది. పక్షులపై పరిశోధన చేయడానికి వచ్చే వారికి ఈ కేంద్రం చక్కగా ఉపయోగపడుతోంది.
ఫ్లెమింగో ఫెస్టివల్
2025 జనవరి 9వ తేదీ నుంచి నేలపట్టు వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించడానికి తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మూడు రోజులపాటు విదేశీ పక్షులు విడిది చేసే శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి నిలయంగా ఉన్న సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండలం తో పాటు ఇదే నియోజకవర్గంలోని తడ మండల కేంద్రాల్లో కూడా పక్షుల పండుగ నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు.

"అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయడం ద్వారా ఉత్సవాలను విజయవంతం చేద్దాం", అని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు.
ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఇప్పటికే తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, తిరుపతి జూ క్యూరేటర్ సెల్వం, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్రమణ ప్రసాద్, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, డిఎఫ్ఓ, జిల్లా పర్యాటకశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, ఏపీటీడీసి ఈఈ సుబ్రమణ్యం, డ్యామా పిడి శ్రీనివాస ప్రసాద్, జిల్లా మత్స్య శాఖ అధికారి నాగరాజుతో సమీక్షించారు.
సీఎం ఎన్ చంద్రబాబు సూచనల మేరకు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ఘనంగా నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఉత్సవంపై మీడియా ద్వారా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ లో సూళ్లూరుపేట నియోజకవర్గం లోని ప్రజలను ఎక్కువగా మమేకం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన సూచించారు.
" బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ -ముంబై (Bombay Natural History Society - Mumbai ), శ్రీసిటీ (Sricity ) సంస్థలను కూడా భాగస్వామ్యం చేస్తున్నట్లు" కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
ఐదు చోట్ల ఉత్సవాలు
ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ఐదు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అందులో నేలపట్టు పక్షుల అభయారణ్యం, అటకానితిప్ప షార్ సమీప రహదారిలో, బీవీ పాలెం పులికాట్ సరస్సు, ప్రభుత్వ జూనియర్ కళాశాల సూళ్లూరుపేట, శ్రీ సిటీ ప్రాంతాల్లో నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో ఉత్సవాలను విజయవంతం చేయడానికి వీలుగా అధికారులు బాధ్యతలు వికేంద్రీకరించుకొని సిబ్బందిని మమేకం చేయాలని కూడా ఆయన ప్రత్యేకంగా గుర్తు చేశారు.
ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాలలో రహదారుల మరమ్మతులు, పరిశుభ్రత, వేదిక ఏర్పాటు, బందోబస్తు, మంచినీరు, మీడియా, మెడికల్ క్యాంపు ఏర్పాట్లు, అగ్నిమాపక శాఖ వారు ఫైర్ సేఫ్టీ, ప్రోటోకాల్ తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక తయారుచేయాలని ఆదేశించారు.
మత్స్య శాఖ అధికారులు పులికాట్ సరస్సు (Pulicat Lake )వద్ద బోటు ప్రయాణానికి ఏర్పాటు చేయాలన్నారు. పులికాట్ సరస్సు వద్ద అవసరమైనన్ని బోట్లు, ట్రిప్పులు ఎన్ని నిర్వహిస్తారనే ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించిన కలెక్టర్ వెంకటేశ్వర ఆ ప్రదేశం లో లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లను కూడా సంసిద్ధంగా ఉంచాలని ప్రత్యేకంగా గుర్తు చేశారు.
Read More
Next Story