‘బాబు’ ఇది నీ స్వయంకృతం కాదా..?
x
చంద్రబాబు

‘బాబు’ ఇది నీ స్వయంకృతం కాదా..?

బలంగా ఉన్న టీడీపీకి అనంత జిల్లాలో గట్టి దెబ్బ తగిలింది. పార్టీ పరిస్థితి అదుపు తప్పింది.. చంద్రన్న ఎలాంటి వ్యూహం అమలు చేస్తారో..


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి:

అభ్యర్థుల మార్పు ప్రయోగం టిడిపికి కష్టాలు తెచ్చిపెట్టింది. జిల్లాలో బలంగా ఉన్న టిడిపికి పెద్ద దెబ్బ తగిలింది. అనంతపురం జిల్లాలో కల్లోలం చెలరేగడానికి టిడిపి అధిష్టానం స్వయంకృతమే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, గుంతకల్లు, కదిరిలో టిడిపికి పెద్ద దెబ్బ తగిలింది. ధర్మవరంలో పార్టీ కల్లోలంలో పడింది. పరిస్థితి చక్కదిద్దడానికి దూతగా రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని టిడిపి అధిష్టానం రంగంలోకి దించింది. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి ప్రధానంగా..అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చిచ్చు రగిల్చింది. విధేయులు, సీనియర్లు, నిత్యం ప్రజలతో ఉంటూ ప్రభుత్వంపై పోరు సాగించిన వారిని ఆగ్రహానికి గురిచేసింది. తుది జాబితా తర్వాత ఎగిసిన ఆగ్రహ జ్వాల ఇంకా ఆరలేదు. పార్టీ క్యాడర్ కూడా గందరగోళానికి గురవుతోంది. బలంగా కీలకంగా వ్యవహరించే నాయకులు పక్కకు తప్పుకోవడంతో నియోజకవర్గాల్లో పరిస్థితి అదుపు తప్పినట్లు కనిపిస్తోంది.

టిడిపి కాదంది.. ఫ్యాన్ కిందికి..

టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు తీరును నిరసిస్తూ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ పక్కన చూస్తున్నారు. సహనం నశించిన ఓ నియోజకవర్గ ఇన్చార్జి రెండు రోజుల క్రితమే వైఎస్ఆర్సిపిలో చేరిపోయారు. మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేశారు. ఇంకో ఇద్దరు " కార్యకర్తల అదృష్టం మేరకు నడుచుకుంటాం" అని చెప్పడమే కాదు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగడానికి సమాలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 13వ తేదీ తమ సత్తా ఏంటో నిరూపిస్తామని భీష్మ ప్రతిజ్ఞ కూడా చేశారు.


అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలోని టిడిపి పరిస్థితి ఇలా

అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు.. అనంతపురం అర్బన్, ఉరవకొండ, కళ్యాణ్ దుర్గం, గుంతకల్లు, తాడిపత్రి రాయదుర్గంతో పాటు సింగనమల ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కూడా ఉంది. ఈ నియోజకవర్గాల్లో 17, 47912 ఓటర్లు ఉన్నారు వారిలో మహిళలు 8,65,742 మంది, 8,81,983 మంది పురుష ఓటర్లు ఉన్నారు.

మంటలు రేపిన తుది జాబితా

2024 ఎన్నికల కోసం టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల తుది జాబితా ఆశావహులను నిరాశకే కాకుండా ఆగ్రహానికి గురిచేసింది. ఆ కోవలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మంటలు చెలరేగాయి. అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరును టిడిపి ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు రగిలిపోయారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు పార్టీ ప్రచార సామాగ్రిని దహనం చేశారు. మూడు రోజులుగా నిరసన కార్యక్రమాలు అనంతపురంలో ఆగడం లేదు. అనంతపురం అసెంబ్లీ స్థానం నుంచి వైకుంఠం ప్రభాకర్ చౌదరి నాలుగు సార్లు పోటీ చేశారు. మూడు సార్లు టిడిపి నుంచి పోటీ చేసి ఒకసారి గెలుపొందారు.

మళ్లీ స్వతంత్రంగా పోటీ

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ఒకసారి, కార్యకర్తల అదృష్టం మేరకు స్వతంత్రంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రకటించారు. కార్యకర్తలు, సహచరులు, పార్టీ నాయకుల సూచన మేరకు నడుస్తానని చెబుతున్న ఆయన స్వతంత్రంగా పోటీ చేయడానికి కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2004 ఎన్నికల్లో కూడా టికెట్ దక్కకపోవడంతో ప్రభాకర్ చౌదరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 24,084 ఓట్లు సాధించిన ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి నారాయణ రెడ్డి విజయానికి కారణమయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరి ఓటమి చెందారు.

" ఐదేళ్లుగా పార్టీ కోసం ఆస్తులు కూడా పోగొట్టుకున్నాం. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంతటి ఘోర నిర్ణయం తీసుకుంటారని కలలో కూడా ఊహించలేదు" అని ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యానించారు. "వేరే పార్టీలోకి వెళ్లే సమస్య లేదు. అవసరమైతే స్వతంత్రంగా పోటీ చేసి, సత్తా నిరూపిస్తా" అని ప్రభాకర్ చౌదరి శపథం చేశారు. ఐదేళ్లుగా తనను నమ్ముకున్న పార్టీ శ్రేణులు త్యాగాలు చేశారని వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

" నష్ట నివారణ చర్యల కోసం ప్రభాకర చౌదరితో మాట్లాడడానికి రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డితో మాట్లాడడానికి అర్బన్ టిడిపి కార్యాలయానికి వచ్చారు" టిడిపి దూతగా వచ్చిన ఆయనతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చర్చించారు. అయినా పంచాయితీ తెగలేదు. " నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్త కావచ్చు. రాజకీయాలకు మాత్రం కాదు" అని అనంతపురం అర్బన్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ స్పష్టం చేశారు. తాను రాప్తాడు ఎంపీపీగా పని చేశానని. కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి వస్తారని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

"కోట"లో ప్రకంపనలు

కళ్యాణదుర్గం శాసనసభ స్థానంలో టిడిపి ప్రభువానికి బీటలు పడ్డాయి. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నుంచి ఉమామహేశ్వర్ నాయుడు పోటీ చేసి ఓడిపోయారు. ఆయనను నియోజకవర్గ ఇన్చార్జిగా టిడిపి చంద్రబాబు నాయుడు నియమించారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. అనూహ్యంగా టిడిపి అధినేత కొత్త ప్రయోగం చేశారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన కాకుండా, ఎస్ ఆర్ సి నిర్మాణ సంస్థ అధినేత ఆమిలినేని సురేంద్రబాబు ను టిడిపి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో కళ్యాణదుర్గం నియోజకవర్గం లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉమామహేశ్వర నాయుడు తో పాటు సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నాం హనుమంతు చౌదరి కూడా టికెట్ ఆశించారు.


రాజీ ప్రతిపాదన చేసిన...

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు వర్గాలు కీలకమైనవి. తమ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేసుకుంటామని ప్రతిపాదన కూడా చేశారని, దీనిని పెట్టడంపై వారు రగిలిపోయారు. తమ ప్రతిపాదనను కూడా పట్టించుకోకుండా టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

వైయస్ఆర్సీపీలోకి జంప్

టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకించిన కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పార్టీ మారిపోయారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఉమామహేశ్వర నాయుడు వైఎస్ఆర్ సీపీలో చేరారు. " పార్టీ కోసం కష్టపడిన మమ్మల్ని ఉపేక్షించారు. నియోజకవర్గంలో సంబంధం లేని వ్యక్తి అభ్యర్థిత్వాన్ని ఎలా ప్రకటిస్తారు? అని ఉమామహేశ్వర నాయుడు ప్రశ్నించారు.

ఆయన వెంట.. కళ్యాణదుర్గం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దూడగట్ట నారాయణ, మండల ప్రస్తుత ఇంచార్జిలో కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. అభ్యర్థిత్వం దక్కక, ఆగ్రహంతో ఉన్న ఉమామహేశ్వర నాయుడు ను వైఎస్ఆర్ సీపీలోకి తీసుకురావడంలో కొందరు నాయకులు సఫలమయ్యారు అందులో అనంతపురం సిట్టింగ్ ఎంపీ ఎంపీ తలారి రంగయ్య (ప్రస్తుతం కళ్యాణదుర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి), రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహయ్య సాగించిన చర్చలు సఫలం కావడంతో ఉమామహేశ్వర్ నాయుడు వైఎస్ఆర్సిపిలోకి రావడానికి ఆస్కారం కలిగిందని సమాచారం. ఇక టిడిపి అభ్యర్థిగా రంగంలో ఉన్న అమీలినేని సురేంద్రబాబును పార్టీ యంత్రాంగం ఎలా ఆదరిస్తుందనేది చూడాలి.

దద్దరిల్లిన గుంతకల్లు

అనంతపురం జిల్లా పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోనే ఉన్న గుంతకల్లు లో కూడా పరిస్థితి తారు మారింది. నెల రోజులుగా గగ్గోలు పెడుతున్న పట్టించుకోకుండా, వైఎస్ఆర్సిపి నుంచి వచ్చిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, పార్టీలోని నాయకులు రగిలిపోతున్నారు. జాబితా ప్రకటించిన రోజే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు ప్రచార సామాగ్రిని కూడా దహనం చేసి, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఇంకా అక్కడ ఏమాత్రం చక్కబడిన వాతావరణం కనిపించడం లేదు.

ఈ పరిస్థితుల్లో కర్నూలు జిల్లా ఆలూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం అనంతపురం జిల్లా గుంతకల్లు అభ్యర్థిగా తీసుకురావడంపై పార్టీ శ్రేణులు ఏమాత్రం మద్దతు ఇవ్వడం లేదు. గుంతకల్లుకు జయరాం రావడానికి నిరసిస్తూ కొన్ని రోజులుగా రోడ్డెక్కిన టిడిపి నాయకులు, కార్యకర్తలు " పేకాట మంత్రి మాకొద్దు. సారా మంత్రి మాకొద్దు" అంటూ భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. వీటన్నిటిని ఏమాత్రం పట్టించుకోని టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు తాను అనుకున్నట్లే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యక్తిత్వాన్ని ప్రకటించారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఆయనకు గుంతకల్లులో కూడా బంధువర్గం ఉంది. ఆలూరు, గుంతకల్లు ప్రాంతానికి చెందిన స్థానికులు చెప్పే మాట ఏంటంటే.. " గుమ్మనూరు జయరాం కు ఆయన సోదరుల నోటి దురుసు, మొహార శైలే నెగిటివ్" అంటున్నారు.


ఇదిగో సాక్ష్యం..

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో జడ్పిటిసి సభ్యుడు ( ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి) విరూపాక్షిని గుమ్మనూరు జయరాం సోదరుడు తీవ్ర పదజాలంతో దూషించారు. "బహిరంగ సభలో మా అన్న జయరాంకు వ్యతిరేకంగా మాట్లాడితే అంతు చూస్తాం" అని హెచ్చరికలు జారీ చేసిన సందేశం వైరల్‌గా మారింది. ప్రస్తుతం గుంతకల్లు ప్రాంతానికి చెందిన టిడిపి నాయకులు కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. స్థానికుడు కాదనే సమస్యను గుమ్మనూరు జయరాం ఎలా అధిగమిస్తారు? పార్టీ క్యాడర్ ఎంత మాత్రం సహకరిస్తుంది అనేది తేలడానికి కొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. " ఆలూరులో నేను ఎలాంటి తప్పిదాలు చేయలేదు. గుంతకల్లులో కూడా అందరితో కలిసి మెలిసి ఉంటా, సహకారం అందించండి’’ అని టిడిపి అభ్యర్థి గుమ్మనూరు జయరాం గుంతకల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులను అభ్యర్థించారు.

మాజీ ఎమ్మెల్యే రాజీనామా

టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు ప్రజాగళం బస్సు యాత్ర ఇటీవల అనంతపురం జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడు కూడా పంపించారు. 2014 ఎన్నికల్లో చాంద్ బాషా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టిడిపిలో చేరారు. గత ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ దక్కలేదు. కదిరి టికెట్ కందికుంట వెంకటప్రసాద్‌కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. 2024 ఆయనకే టికెట్ ఇవ్వడం నేర్పిస్తూ మాజీ ఎమ్మెల్యే టిడిపికి దూరమయ్యారు. రెండు రోజుల్లో కదిరి పర్యటనకు రారన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సమాచారం.


హాట్ హాట్ పోటీ..

అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మిగతా మూడు నియోజకవర్గాల్లో ప్రధాన వైఎస్ఆర్సిపి, టిడిపి మధ్య అనడం కంటే.. వ్యక్తులు కుటుంబాల మధ్య సమరం జరగనున్నది. ఆ కోవలో.. ఉరవకొండ టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తో వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి తలపడుతున్నారు. వామపక్ష ఉద్యమాల నుంచి ఓనమాలు నేర్చుకుని వచ్చిన విశ్వేశ్వర్ రెడ్డి గతంలో కూడా గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఎన్నిక తీవ్రంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. రాయదుర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మళ్లీ రాయదుర్గం వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి పై పోటీ పడుతున్నారు. ఇక్కడ కూడా పోటీ రసవత్తరంగానే ఉంటుంది.

తాడిపత్రిలో సమరమే..

అనంతపురం జిల్లాలో తాడిపత్రి రాజకీయం విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ జేసీ కుటుంబానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రత్యక్ష యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ఈ ఎన్నికల్లో కూడా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి తో పోటీపడుతున్నారు. దీంతో తాడిపత్రి నియోజకవర్గంపై యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. ఇలాంటి సందర్భం కోసమే జేసీ కుటుంబం ఐదు ఏళ్లుగా నిరీక్షిస్తున్నట్లు వాతావరణం చెప్పకనే చెబుతోంది. ఇక్కడ జరిగే ఎన్నిక వ్యవహార శైలిపై అందరి చూపు ఉంది. అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఇవి వీటిని పరిష్కరించడానికి టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇలాంటి చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు అనేది వేచి చూడాలి.

Read More
Next Story