ఎవరు గెలిచినా డిప్యూటీ సీఎం దక్కేది కాపులకే
x

ఎవరు గెలిచినా డిప్యూటీ సీఎం దక్కేది కాపులకే

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో డిసైడ్ కాలేదు గాని డీసీఎం మాత్రం ఖరారైంది. కాపుల్లో కాపులకే కయ్యం పెట్టిన పార్టీలు.. ఎవర్ని డెప్యూటీ సీఎం చేస్తాయో చూడాలి


కాపుల చుట్టూ తిరిగిన 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాపుల్ని ఆకట్టుకునేందుకు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ చేసిన ప్రయత్నాలు ఏమేరకు సఫలమయ్యాయో చెప్పడానికి ఇంకా సరిగ్గా రెండు వారాల గడువుంది. జూన్ 4న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఒక స్పష్టమైన హామీ మాత్రం కాపులకు దక్కింది. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తెలియదు గాని ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రం ఖరారైంది. కాపులపై కాపుల్నే దింపి వాళ్లలో వాళ్లకే కయ్యం పెట్టడంలో సక్సెస్ అయిన రాజకీయ పార్టీలు మున్ముందు ఎవర్ని డెప్యూటీ సీఎం చేస్తాయో చూడాలి

2024 మే 11.. పిఠాపురం.. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. ఇంకా కొద్ది సేపట్లో ప్రచారం ముగియనుందనగా వైసీపీ అధినేత జగన్ అక్కడో ప్రకటన చేశారు. పిఠాపురం నుంచి జనసేన అధిత పవన్ కల్యాణ్ పై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపిస్తే ఆమెను ఉప ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించారు. కాపులు ఉపముఖ్యమంత్రులు కావడం ఇదేమీ కొత్త కాకపోయినా జగన్ మాత్రం ఎన్నికలకు సరిగ్గా 24 గంటల ముందు ఈ హామీ ఇచ్చి కాపుల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దీనికి తగ్గట్టుగా టీడీపీ వ్యూహమూ ఉంది.

సుదీర్ఘ రాజకీయ చరిత్ర...

రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1920, 1930లలోనే జస్టిస్ పార్టీలో ప్రముఖులుగా మెలిగిన వారున్నారు. ప్రముఖ కాపు నాయకుడు కూర్మ వెంకటరెడ్డి నాయుడు జస్టిస్ పార్టీ సభ్యుడు. ఈయన పేరిటే హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో కాపు భవనం ఉంది. సామాజిక న్యాయం కోసం గొంతెత్తిన వారిలో ఈయన ఒకరు. మద్రాసు ప్రెసిడెన్సీకి 1920లలో జరిగిన తొలి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిన వారిలో ఈయన ఒకరు. ఆనాటి మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గుర్లో ఈ నాయుడు ఒకరు. 1936లో మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్‌గా కూడా పని చేశారు. చరిత్రలో ఆ పదవిని నిర్వహించిన ఇద్దరు భారతీయులలో ఒకరు. 1937లో మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ఏకకాలంలో అటు ముఖ్యమంత్రి ఇటు గవర్నర్.. రెండింటినీ నిర్వహించిన ఏకైక వ్యక్తి సర్ కూర్మ వెంకటరెడ్డి నాయుడు.

తొలి స్పీకర్ కూడా కాపే...

1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాపు పసల సూర్యచంద్రరావు 1953 నుంచి 1954 వరకు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి తొలి డిప్యూటీ స్పీకర్‌. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెలగ కాపు రొక్కం లక్ష్మీ నరసింహం దొర 1955 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి రెండవ స్పీకర్‌. 1955లోనే ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో 16 మంది కాపు ఎమ్మెల్యేలు ఉండేవారు. పెద్ద కులాలలో కాపులు మూడోది. యానాం, పాండీచ్ఛేరిలో కూడా కాపులు వివిధ పదవులు నిర్వహించారు.

2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాపు ఎమ్మెల్యేలు 19 మంది ఉండేవారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీల తర్వాత కాపు ఎమ్మెల్యేలే ఎక్కువ మంది చెప్పడానికి ఇదే నిదర్శనం. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో 24 మంది కాపులు ఎమ్మెల్యేలు ఉన్నారు. కమ్మ, రెడ్ల తర్వాత కాపులే ఎక్కువ మంది. మిగతా రెండు కులాల జనాభా తక్కువ. సీట్లు ఎక్కువ. కాపుల సంఖ్య ఎక్కువ. సీట్లు తక్కువ అని చెప్పడానికి ఈ అంకెలు చాలు.

గత పదేళ్లలో ముగ్గురు డెప్యూటీ సీఎంలు...

గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు కాపు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన తర్వాత తనకు అనుంగు అనుచరుడైన నిమ్మకాయల చినరాజప్పను డెప్యూటీ సీఎం చేశారు. ఐదేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ గెలిచిన తర్వాత రెండున్నర ఏళ్లపాటు ఏలూరుకు చెందిన ఆళ్ల నానిని, ఆ తర్వాతి కాలానికి తాడేపల్లిగూడెంకు చెందిన కొట్టు సత్యనారాయణను డెప్యూటీ సీఎంగా ఉంచారు.

2016 ప్రారంభంలో కాపులు రిజర్వేషన్ల కోటాను డిమాండ్ చేస్తూ ఆందోళనను ప్రారంభించారు. అది హింసాత్మక ఘటనలకు దారి తీసింది. 2014 అసెంబ్లీ ఎన్నికలలో కాపుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. రాష్ట్రంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో కాపులకు 5% కోటా కేటాయించింది. దీనిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. చట్టబద్ధంగా లేదంది. 2019 ఎన్నికల్లో కాపులు వైసీపీకి అండగా నిలిచారు. రిజర్వేషన్లు రాకపోయినా ఇద్దరికి మాత్రం డెప్యూటీ సీఎం పదవులు వచ్చాయి. 2024 ఎన్నికల్లో ఏ వైపు నిలిచినా ఎవరో ఒక కాపు మాత్రం డెప్యూటీ సీఎం అవుతారనేది తేలిపోయింది.

రాజ్యాలను ఏలిన చరిత్రా ఉంది...

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, గణపవరం, ఆకివీడు ప్రాంతాలను తెలగలు పాలించిన చరిత్ర ఉంది. వాటిని తెలగ-ప్రభువుల-సీమలని పిలిచేవారని చరిత్ర చెబుతోంది. అనేక మంది కాపు ప్రముఖులకు దివాన్, బహదూర్, రావ్ బహదూర్ వంటి బిరుదులు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో మండలి వెంకట కృష్ణారావు, ఇండియన్ ఎలక్ట్రానిక్స్ పితామహునిగా చెప్పే ఎంఎస్ సంజీవరావు, పీవీ రంగయ్య నాయుడు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పి.శివశంకర్, చేగొండి హరిరామ జోగయ్య, నిమ్మకాయల చినరాజప్ప, కొట్టు సత్యనారాయణ, ఎంఎం పల్లం రాజు వంటి వారు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పిన వారే.

కాపు సామాజికవర్గం అండతో సామాజిక న్యాయమంటూ ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన ప్రముఖ నటుడు చిరంజీవి ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన తమ్ముడు, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పెట్టి ఈ ఎన్నికల్లో 21 సెగ్మెంట్లలో పోటీ పడ్డారు.

టీడీపీ గెలిస్తే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం..

ఈ అసెంబ్లీ ఎన్నికలు కాపుల చుట్టూతా తిరిగాయనేది స్పష్టం. అటు వైసీపీ ఇటు టీడీపీ.. కాపుల మద్దతు కోరాయి. వైసీపీ గెలిస్తే జగన్ తన క్యాబినెట్ లో కనీసం ఐదుగురైనా ఉప ముఖ్యమంత్రులు ఉండవచ్చు. టీడీపీ గెలిస్తే చంద్రబాబు తన మంత్రివర్గంలో ఏకైక డెప్యూటీ సీఎంను పెట్టుకుంటారు. ఆ ఒక్కరు ఎవరన్నది అందరికీ తెలిసిందే. అతడే పవన్ కల్యాణ్. అందువల్ల కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయం. దీనిపై చాలా మంది కాపు సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు. "ఇతర సామాజికవర్గాలతో కలిసి ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడాల్సిన కాపు సామాజికవర్గం ఇప్పుడు డెప్యూటీ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నాయన్నాయి" అని చమత్కరించారు కాపునాడు నాయకుడు కఠారి అప్పారావు.

Read More
Next Story