వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల పేర్లు చెప్పాలని వివేకా కూతురు సునీత తనను బెదిరించినట్లు కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు.


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తప్పుడు ఫిర్యాదు చేశాడంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై చేపటిన విచారణ అనంతరం ఆయన చేసింది తప్పుడు ఫిర్యాదు అని నిర్థారించిన పోలీసులు కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుల పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి తెచ్చారు. బలవంతంగా చెప్పించేందుకు తనను సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ కొట్టారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ చెప్పినట్లు వినాలని హత్యకు గురైన వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి తనను బెదరించారని వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి 2022లో పులివెందుల కోర్టులో ఓ ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై స్పందించిన పులివెందుల కోర్టు కృష్ణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న సీబీఐ రాంసింగ్, వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డిల మీద కేసు నమోదు చేయాలని పులివెందుల కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురిపైన పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే తాజాగా ఈ కేసును పోలీసులు తెరపైకి తెచ్చారు. పులివెందుల పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల పేర్లు చెప్పాలని చెప్పి వివేకా పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ రాంసింగ్‌ కొట్టినట్లు కానీ, వివేకా కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డిలు కృష్ణారెడ్డిని బెదిరించినట్లు కానీ చేయలేదని, వివేకా పీఏ కావాలనే వారిని ఇబ్బందులు పెట్టేందుకు కోర్టులో ఫిర్యాదు చేశారని, ఇది తప్పుడు ఫిర్యాదని నిర్థారించారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో ఎలాంటి వాస్తం లేదని తేల్చారు. ఆ మేరకు డీఎస్పీ మురళీ నాయక్‌ పులివెందుల కోర్టులో ఈ కేసుకు సంబంధించిన తుది నివేదికను సమర్పించారు.
ఈ కేసులో దాదాపు 23 మంది సాక్షులను విచారించినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో డీఎస్పీ మురళీ నాయక్‌ పేర్కొన్నారు. తమ విచారణలో కృష్ణారెడ్డి చేసింది తప్పుడు ఫిర్యాదుగా తేలడంతో కృష్ణారెడ్డికి నోలీసులు జారీ చేసినట్లు కోర్టుకు తెలిపారు. అయితే పోలీసులు సమర్పించిన నివేదిక మీద పులివెందులు కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2019 మార్చిలో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. నాటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగూ వస్తోంది.
Next Story