
Tirumala |మార్చి 3న చంద్రగ్రహణం.. 10 గంటలు శ్రీవారి ఆలయం మూత..
శ్రీకాళహస్తిలో యథాతధంగా దర్శనాలు.
తిరుమల శ్రీవారి ఆలయాన్ని మార్చి మూడో తేదీ సుదీర్ఘంగా 10. ౩౦ గంటల పాటు మూసివేయనున్నారు. రాహుకేతువులకు నిలయమైన శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంలో మాత్రం దర్శనాలు యథావిధిగానే సాగుతాయి.
తిరుమలలో మాత్రం చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మార్చి 3వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మూసివేయనున్నారు. దీంతో ఆర్జిత సేవలు కూడా రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
చంద్రగ్రహణం
శ్రీకాళహస్తి ఆలయం మాత్రమే గ్రహణాల సమయంలో కూడా తెరిచి ఉంటుంది, అంతేకాక ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. దీనికి ముఖ్య కారణాలు ఉన్నాయి. దీనిపై శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రధాన అర్చకుడు సంబంధం గురుకుల్ పక్షాన ఆలయ పురోహితుడు అర్ధగిరి ప్రసాద్ శర్మ ఆ ప్రత్యేకతలను వివరించారు.
" శ్రీకాళహస్తిని రాహు-కేతు క్షేత్రంగా భావిస్తారు. పురాణాల ప్రకారం, గ్రహణాలకు కారణమైన రాహు, కేతువులు ఇక్కడి శివలింగాన్ని పూజించిన కారణంగా ఇక్కడ వారి ప్రభావం ఉండదని నమ్ముతారు. రాహు, కేతువులే ఇక్కడ పూజలు చేయించుకుంటారు. అందువల్ల గ్రహణ దోషాలు ఈ ఆలయాన్ని ప్రభావితం చేయవు" అని ప్రసాదశర్మ వివరించారు.
శ్రీకాళహస్తి ఆలయం పంచభూత క్షేత్రాలలో ఒకటైన వాయు లింగం. ఇక్కడ స్వామివారు వాయు రూపంలో ఉంటారని విశ్వసిస్తారు. అందుకే గ్రహణాల ప్రభావం ఇక్కడ ఉండదని శాస్త్రాలు అభివర్ణించాని అర్చకుడు ప్రసాదశర్మ చెప్పారు.
"శ్రీకాళహస్తీశ్వరుని విగ్రహంపై నవగ్రహ కవచం ఉంటుంది. దీనివల్ల గ్రహాలన్నీ శివుని నియంత్రణలో ఉంటాయి. అందువల్ల గ్రహణాల వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఈ ఆలయంపై పడవని నమ్ముతారు" అని ఆయన వివరించారు.
ఈ కారణాల నేపథ్యంలో గ్రహణాల సమయంలో కూడా శ్రీకాళహస్తి ఆలయం భక్తులకు దర్శనం కోసం తెరిచే ఉంటుంది. ఈ సమయంలో రాహు-కేతు దోష నివారణ పూజలు చేయించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
దోష నివారణ పూజలు
ఎలాంటి గ్రహణాలైనా శ్రీకాళహస్తి ఆలయంలో నిత్యం యాత్రికులను దర్శనానికి అనుమతిస్తారు. ప్రధానంగా చంద్రగ్రహం ఏర్పడే ఆదివారం రాత్రి మాత్రం ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ పురోహితుడు అర్ధగిరి ప్రసాదశర్మ కథనం మేరకు..
గ్రహణ కాల సమయంలో ఆలయంలో స్వామివార్లకు కలశాభిషేకం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహ వచనం శాంతి సంకల్ప పూజలు నిర్వహిస్తారు" అని ప్రసాద్ శర్మ వివరించారు. శాంతిసంకల్పం చెప్పిన తరువాత అమ్మవారికి, తరువాత స్వామివారి శివలింగానికి అభిషేకం తరువాత ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారని ప్రసాద్ శర్మ వివరించారు.

