ప్లీజ్ నాన్న, మమ్మల్ని చంపొద్దు.. నాన్నా! నీ కాళ్లు పట్టుకుంటాం నాన్న
x
YAMINI & Kavya

ప్లీజ్ నాన్న, మమ్మల్ని చంపొద్దు.. నాన్నా! నీ కాళ్లు పట్టుకుంటాం నాన్న

అతనో విలేఖరి. శక్తికి మించి అప్పులు చేశాడు. ఒత్తిడికి తట్టుకోలేక పిల్లల్ని కాల్వలోకి నెట్టి తాను చచ్చిపోవాలనుకున్నాడు. కాని పిల్లలు చనిపోయారు. తాను మాత్రం...


"నాన్న, మమ్మల్ని చంపొద్దు.. నాన్నా.. నీ కాళ్లు పట్టుకుంటా నాన్న.. నీళ్లలో మునిగిపోతున్నాం నాన్న, మమ్మల్ని బయటికి తీయి నాన్నా.." అంటూ ఆ పిల్లలు కాల్వలో మునిగిపోతుంటే ఆ తండ్రి హృదయం ఎంతగా తల్లడిల్లి ఉంటుందో! అంతటి కఠిన నిర్ణయాన్ని ఆ తండ్రి ఎందుకు తీసుకున్నాడో తెలియదు గాని కన్నబిడ్డల్ని కాల్వలోకి తోసేసి తానూ చనిపోవాలనుకున్నాడు. ఏమైందో తెలియదు గాని ఆ పిల్లలైతే చనిపోయారు గాని తండ్రి మాత్రం చావు నుంచి బయటపడి కటకటాల వెనుక నిలుచున్నాడు. నలుగురికి మొహం చూపించలేక చేతులతో ముఖం దాచుకుని కుమిలిపోతున్నాడు.
అసలేం జరిగిందంటే..
పల్నాడు జిల్లా ఈపూరు మండలం పనికుంట గ్రామానికి చెందిన తురుమెళ్ల వెంకట నాగాంజనేయ శర్మ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు యామిని, కావ్య. పెద్దపిల్లకు 10 ఏళ్లు. చిన్నమ్మాయికి 7 ఏళ్లు. ఓ దినపత్రికకు విలేఖరిగా పని చేస్తున్నాడు నాగాంజనేయ శర్మ. విలేఖరి హోదాలో స్థాయికి మించి అప్పులు చేశారు. తిర్చడం కష్టమైంది. బాకీలు ఇచ్చిన వారి నుంచి వత్తిడి ఎక్కువైంది. భార్య అనారోగ్యంతో మంచం పట్టింది. బాకీలు తీర్చే మార్గం లేకపోయింది. పిల్లల్ని చంపి తాను చనిపోవడమే పరిష్కారంగా భావించాడు. అనుకున్నదే తడవుగా ఓ ప్లాన్ వేశారు.
యామిని, కావ్యను ఆసుపత్రిలో చూపించాలంటూ ద్విచక్ర వాహనంపై ముప్పాళ్ల కాల్వ వద్దకు తీసుకెళ్లాడు. కుమార్తెలతో సహా ద్విచక్ర వాహనాన్ని నేరుగా కాల్వలోకి పోనిచ్చాడు. బండి ఒక్కసారిగా నీళ్లలోకి దూసుకుపోవడంతో చిన్న కుమార్తె కావ్య ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక చనిపోయింది. పెద్ద పిల్లకు కాస్త ఊహ తెలియడంతో చేతులు ఆడించుకుంటూ పైకి వచ్చి.."నాన్న, మిమ్మల్ని చంపొద్దు.. నాన్నా.. నీ కాళ్లు పట్టుకుంటా నాన్న.. నీళ్లలో మునిగిపోతున్నాం నాన్న, మమ్మల్ని బయటికి తీయి నాన్నా.." అంటూ ప్రాణభయంతో తండ్రి కాళ్లు పట్టుకుంది.
ఆర్ధిక బాధలు మెదడును చుట్టుముట్టి ఉండడంతో ఆయన ఏమాత్రం చలించకుండా కాళ్లు పట్టుకుంటున్న బిడ్డను వదిలించుకుంటూ తాను కాల్వ ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తాను కూడా చనిపోవాలి. కానీ చివరి నిమిషంలో ఏమనుకున్నాడో ఏమో తాను ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు.
సరిగ్గా ఈ సమయంలో అటుగా వస్తున్న పాల వాహనం డ్రైవర్ ఈ దృశ్యాన్ని చూసి బిత్తరపోయాడు. ఏమి జరిగిందో తెలుసుకుందామని పాల వాహనాన్ని ఆపారు. నాగాంజనేయశర్మ వద్దకు వెళ్లి ఎవరు నువ్వు...ఎందుకు ఇలా చేశావంటూ పెద్దపెద్దగా అరిచారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కాసేపు వాదులాట జరిగింది.
'తాను సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి పిల్లలతో సహా కాల్వ లోపలికి వెళ్లిందని' నాగాంజనేయ శర్మ చెప్పాడు. 'తాను జరిగిన సంఘటన చూశానని, కావాలని పిల్లలను కాల్వలోకి నెట్టావని' పాలవ్యాను డ్రైవర్ నిలదీశాడు. తర్వాత పాల వాహనం వ్యక్తి ముప్పాళ్లకు వెళ్లి విషయం తెలిపాడు. డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోగానే నాగాంజనేయ శర్మ మళ్లీ కాల్వలోకి దూకాడు. కానీ, ప్రాణం మీద తీపితో మళ్లీ ఈత కొడుతూ కాల్వ అంచుకు వచ్చి గడ్డి పరక పట్టుకుని కేకలు వేశాడు. ఈ సందర్భంగా కేకలు విన్న గ్రామస్థులు వచ్చి అతన్ని బయటకు తీశారు. అనంతరం కాల్వలో గాలింపు చేపట్టి యామిని, కావ్యల మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు బాలికలను నమ్మించి తెచ్చి ఉద్దేశపూర్వకంగా కాల్వలో నెట్టి హత్య చేసిన కేసులో నిందితున్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజులు రిమాండ్‌ విధించారు.
నాగాంజనేయశర్మను అరెస్టు చేసి నవంబర్ 28న వినుకొండ కోర్టులో హాజరు పరిచినట్లు వినుకొండ రూరల్ సీఐ బి.ప్రభాకర్‌ తెలిపారు. సీఐ కథనం ప్రకారం ఈపూరు మండలంలో ఒక దిన పత్రిక విలేకరి ఈ నాగాంజనేయ శర్మ. తాహతుకు మించి అప్పులు చేశాడు. కొంతకాలంగా అప్పులవాళ్లు డబ్బులు అడుగుతుండటంతో ఒత్తిడికి గురయ్యాడు. భార్య అనారోగ్యంతో చాలాకాలంగా మంచాన పడటంతో మానసికంగా కుంగిపోయాడు. దీంతో తన ఇద్దరు కుమార్తెలను చంపి తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ పిల్లలు చనిపోయారు. తాను మాత్రం ప్రాణభయంతో అరిచి కేకలు పెట్టి తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు.
Read More
Next Story