రాజధాని ప్రాంతంలో పర్యటించిన సీఎస్
ఆదివారం రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ పర్యటించారు. అన్ని ప్రాంతాలు తనిఖీ చేశారు. జంగిల్ క్లియర్ చేస్తున్న వాహనాలను పరిశీలించారు. గతంలో నిర్మించిన అండర్ గ్రౌండ్ డైనేజీ కాలువలు కూడా మట్టిలో కూరుకు పోయాయి. వాటిని తవ్వి బయటకు తీశారు. సచివాలయం శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అక్కడ నిలబడి సచివాలయ శంకుస్థాపన ప్రాంతానికి నమస్కారం చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. సచివాలయ నిర్మాణానికి సంబంధించి బేస్‌మెట్ కూడా అప్పట్లో నిర్మించారు. తిరిగి ఈ నిర్మాణం ఇక్కడి నుంచి మొదలు కావాల్సి ఉంది.
రాజధాని నిర్మాణం జరుగుతుందని నమ్ముతున్నాం..
చంద్రబాబు చెప్పినట్లు ఈ సారి రాజధాని నిర్మాణం చేస్తారని నమ్ముతున్నామని అమరావతి ఉద్యమ జెఎసి నాయకులు, బిజెపి నాయకులు కంచేటి బ్రహ్మయ్య అన్నారు. ప్రణాళిక ప్రకారం పనులు మొదలు పెట్టడంతోనే చంద్రబాబు పనితీరును అర్థం చేసుకోవచ్చు. అమరావతిలో నూరు శాతం అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నాం. అమరావతి ప్రాంతం ప్రశాంతతకు మారుపేరు. అటువనుంచి మొదలు కావాల్సి ఉంది. ంటిది ఉద్యమానికి కారణం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. మా ఉద్యమం ఫలించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
122 కిలో మీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతం
రాజధాని ప్రాంతం మొత్తం 122 కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉంటుంది. రాజధాని నగర పరిధిలోకి తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం, మొదరులంకపాలెం, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, నేలపాడు, శాఖమూరు, ఐనవోలు, మల్కాపురం, మందడం, తాళ్లాయపాలెం, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండరాజుపాలెం, పిచ్చుకలపాలెం, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలాస్ నగర్, మంగళగిరి మునిసిపాలిటీ పరిధిలోని కృష్ణాయపాలెం, నెడమర్రు, కొడగల్లు, నీరుకొండ, నవులూరు, ఎర్రబాలెం, బేపతపూడి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ రాజధాని ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం కలిపి వేసింది.
ఈ ప్రాంతంలో 9 భవ్య నగరాలు నిర్మించాలని ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదనలు తయారు చేసింది. 25 లక్షల జనాభాతో 15 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. నాలుగు ప్రాధాన్యతా ప్రాజెక్టులు నిర్మించి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే నిర్ణయం తీసుకున్నారు. హెక్టారుకు 182 నివాస గృహాలు నిర్మించేందుకు అనుమతులు ఉంటాయి. గరిష్టంగా జి ప్లస్ 15 వరకు భవనాలు ఎత్తు నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేస్తారు. రెండు హైస్పీడ్ రైల్ కారిడార్‌లు ఉంటాయి. ఇవన్నీ అప్పట్లో ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసింది.
నేల విడిచి సాము చేస్తున్నారు
చంద్రబాబునాయుడు రాజధాని నిర్మించడం నేల విడిచి సాము చేయడమేనని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన అమరావతి నిర్మాణంపై ది ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు. అమరాతి ప్రాంతంలో భవనాల నిర్మాణం అనేది సరైంది కాదని, అక్కడి భూములు కుంగిపోతాయన్నారు. గతంలో సింగపూర్ వాళ్లను పిలిపించి స్విస్ చాలెంజ్ ద్వారా నిర్మాణాలు చేపడతామని చెప్పి ప్రజలను మభ్య పెట్టారన్నారు. 2018లో అమరావతిపై ఒక పుస్తకాన్ని తను ప్రచురించానని, నేలవిడిచి సాము చేయడం తగునా అంటూ ఆ పుస్తకంలో రాసినట్లు చెప్పారు. ఇదంతా రియల్ ఎస్టేట్ వారు హడావుడి చేసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుందన్నారు.
గత ప్రతిపాదనలన్నీ అమలులోకి...
గతంలో తయారు చేసిన ప్రతిపాదలన్నీ ఇప్పుడు అమలులోకి వచ్చే విధంగా నూతన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టకముందే రాజధాని ప్రాంతంలో పనులు మొదలు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పలువురు అంటున్నారు.
ప్రజల కష్టం ఫలించింది
అమరావతి ప్రజా ఉద్యమం. వారి కష్టం ఫలించింది. అమరావతికి మంచి రోజులు వచ్చాయని అమరావతి ఉద్యమ జెఎసి నాయకుడు జమ్ముల అనిల్ కుమార్ అన్నారు. మంచి జరుగుతుందనే నమ్మకం మాకుంది. త్వరలోనే నిర్మాణాలు మొదలవుతాయనుకుంటున్నాం. ఇప్పటికే రాజదాని ప్రాంతంలో కొంత కదలిక వచ్చింది. ప్రజలు రాజధాని వాసుల ఆందోళనకు మద్దతు ఇచ్చారు. వారి తీర్పు వృధా కాకూడదని బావిస్తున్నామన్నారు.