మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
x

మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు

మేము ఓట్లు అమ్ముకోం. మా ఇంటికి ఓట్ల కోసం రావద్దు అని కొందరు తేల్చిచెప్పారు. ఓట్ల చీటీ ఉంటే డబ్బు ఇస్తున్నారు. ఆ చీటీల కోసం కొందరు కార్యాలయాలకు ఎగబడ్డారు.


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: "మా కాలనీలో సమస్యలు పరిష్కరించే వరకు ఓటు అడగవద్దు. మా ఓటు అమ్ముకోడానికి మీ సిద్ధంగా లేము" అంటూ అనంతపురం జిల్లాలో ఓ కుటుంబం ఆదర్శంగా నిలుస్తోంది. " ఓ సార్.. ఇది నా ఐడి కార్డు. చీటీ ఇవ్వండి. ఇది మా నాయనది. ఆయన సచ్చిపోయినాడు. పర్వాలేదు స్లిప్పు ఇవ్వండి’’ ఇది నగరాల్లో డివిజన్ సచివాలయాలు వద్ద కనిపించిన కొందరి తీరు. ఎన్నికలు వస్తే కొందరికి పండుగ. ప్రచార సమయంలో డబ్బులిచ్చి కూలి జనాన్ని తరలించడం పరిపాటి. పోలింగ్ గడువు దగ్గర పడడంతో ఓటుకు డబ్బు ఎరవేయడం ప్రారంభం అయ్యింది. పట్టణాల్లో కొన్ని చోట్ల ఓటుకు రూ. రెండు నుంచి మూడు వేలు పంపిణీ చేస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులు ఇచ్చే మొత్తంలో సగం చోటా నాయకులు తమ జేబులో వేసుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగే ఈ వ్యవహారం.. ఇప్పుడు వీధిలో పట్టపగలే నిర్వహిస్తున్నారు.

స్లిప్పుల కోసం పోటెత్తిన ఓటర్లు..!

గతంలో ఓటర్లకు పోటీలోని అభ్యర్థులు తమ మద్దతుదార్ల ద్వారా ఇంటి వద్ద స్లిప్పులు పంపిణీ చేయించేవారు. ఈ పద్ధతికి చెక్ పెడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే కొత్త విధానం తీసుకువచ్చింది. బిఎల్వోలుగా పనిచేసే ఎన్నికల సిబ్బంది ద్వారా ఓటర్ గుర్తింపు కార్డు పరిశీలించి ఓటు వేయడానికి అవసరమైన స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడే.. తిరకాసు మొదలైంది. వార్డుల్లో ప్రభావం చూపించే వార్డు, డివిజన్ నాయకులు డబ్బు పంపిణీ చేయడానికి వీలుగా ఓటర్ స్లిప్పులు పరిశీలిస్తున్నారు. వారి పేర్లు నమోదు చేసుకొని అభ్యర్థికి అందజేస్తే, ఆయన ఇచ్చే మొత్తంలో ఓటర్లకు కొంత ముట్టచెబుతున్నారు. ఇంకొంత తమ జోబులో చేసుకుంటున్నారు.

" ఎన్నికల సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చి స్లిప్పులు పంపిణీ చేసే సమయంలో కొందరు ఆ సేవను వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం చూపారు" అలాంటి వాళ్ళందరూ చీటీలు లేకపోతే డబ్బు ఇవ్వరని చెప్పడంతో హైరానా పడిపోయారు. ఓటర్ కార్డులు పట్టుకొని వార్డు సచివాలయాలకు పరుగులు తీశారు. "ఏం మీ ఇంటి దగ్గరికి వస్తే మీరు లేరని చెప్పారు. డబ్బులు ఇస్తున్నారని స్లిప్పు కోసం వచ్చారా!? అని నవ్వుతూ అన్నారు. "లేదు సార్ మా ఇంటి పక్క వాళ్లకు చీటీలు వచ్చాయి. మా పేరు లేదంటున్నారు. ఏం చేయాలి. ఇది నాది. ఈ కార్డు మన నాయనది. ఆయన లేడు చనిపోయాడు అయినా పర్వాలేదు చీటీ ఇవ్వండి" అని చెప్పడంతో వార్డు ఉద్యోగి దిమ్మెర పోయాడు.

"చనిపోయినట్లు రికార్డులో ఉందమ్మా ఈ చీటీ ఇవ్వడానికి కుదరదు" అని ఆ ఉద్యోగి చేసిన వ్యాఖ్యతో స్లిప్పుల కోసం వచ్చిన వారు ఆవేదనకు గురయ్యారు. ఈ తతంగం అంతా అక్కడే ఉన్న ఫెడరల్ ప్రతినిధి కళ్లెదుటే జరిగింది. ఈ తరహా వ్యవహారంపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ మహిళా అధికారి తన స్వగతాన్ని ఇలా పంచుకున్నారు. ‘‘ఎన్నికలు.. ఎన్ని కలలో.. పోటీదారులందురూ ఏమిస్తారో అని ఎదురు చూసేవారు కొందరు. ఇంతకు ముందున్న వారు నచ్చకపోతే మార్పు వస్తుందేమో అని ఆశ పడేవారు మరి కొందరు. అన్ని పండగల కంటే గొప్పగా జరుపుకునే పండగ ఎన్నికలే. ఇప్పుడే తూర్పు గోదావరి జిల్లాలో ఒక గుడికి వెళ్లి తిరిగి వస్తున్నా... పల్లెటూర్లలో గుంపులుగా తిరుగుతున్న పిల్లలు (వాలంటీర్లు ఏమో), ఖరీదుగా కనిపిస్తున్న వైఎస్సార్సీపీ ప్రచారం .. ఒకచోట మాత్రమే టీడీపీ ప్రచారం చూసా... ఇంతకు ముందు గమనించలేదు కానీ... ఇప్పటి పరిశీలనలో ఒకటి చెప్పగలను... డబ్బు పంచిపెట్టే సమయం కోసం అధిక శాతం ఓటర్లు వేచి ఉన్నారు. ఏ పార్టీని గెలిపించాలి" అనే ఆలోచనలో ఉద్యోగులు (ఉపాధ్యాయులతో సహా) ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా యూట్యూబ్, మీడియా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వాస్తవాలు ఏమైనా ప్రతీ ఒక్కరి చేతిలో అలంకారమైన సెల్ ఫోనులో అవసరం లేకున్నా పదే పదే దాన్ని చూడడానికి అలవాటు పడిన అధిక శాతం ( రిటైర్డ్ ) ప్రజలు నిమిషానికి ఒకలా వ్యాఖ్యలు చేస్తున్నారు. సభలకు హాజరును బట్టి కానీ లేదా డబ్బు పంచడాన్ని బట్టి కానీ అంచనా వెయ్యలేమేమో అనిపిస్తుంది" అని ఎన్నికల స్థాయిలో చోటు చేసుకుంటున్న అపసవ్య పరిస్థితిపై ఆమె కలత చెందారు. ఓటరు విజ్ఞతతో సమాజానికి మేలు చేసే వారిని ఎంచుకోవాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మా ఇంట్లో ఓట్లు అమ్మబడువు..

" మా కాలనీలో సమస్యలు పరిష్కరించే వరకు ఓటు అడగవద్దు. మా ఓటు అమ్ముకోవడానికి సిద్ధంగా లేము" అని అనంతపురం జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక, తెలుగు వెలుగు సాహిత్య వేదిక, జిల్లా రచయితల సంఘం, శ్రీ శ్రీ కళా వేదిక ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలక బాధ్యత నిర్వహిస్తున్న టీవీ. రెడ్డిని ఫెడరల్ ప్రతినిధి బుధవారం ఉదయం పలకరించారు. ఓటరు చైతన్య కార్యక్రమాలతో పాటు, జన చైతన్యం కోసమే మా ఇంటి ముందు ఓటింగ్ ఏర్పాటు చేశానని టీవీ రెడ్డి చెప్పారు.

ఇది చూసిన తర్వాత " అభ్యర్థులు స్పందించి కాలనీకి వచ్చారు. ‘‘కాలనీలో పెద్దలతో మాట్లాడి, హామీ ఇచ్చారు. ఇది వెంటనే పరిష్కారం కాకపోయినా, సమస్య రాజకీయ నాయకులలోకి వెళ్ళింది. అనే భావన మాకు కలిగింది" అని చెబుతున్న ఆయన.. ఎన్నికల తర్వాత కూడా నాయకులను వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల పండుగ వేళ చోటు చేసుకున్న ఈ చమక్కుల్లో నాయకులు నిలదీసే వారు కూడా ఉన్నారు. కనీసం వీరి ద్వారా అయినా ఎన్నికయ్యే ప్రజా ప్రతినిధులు సమస్యలు పరిష్కరిస్తారేమో చూడాలి. హామీలిచ్చి ఓటమి చెందిన వారైనా సమస్యలపై దృష్టి సారిస్తే జనంలో నాయకుడిగా ఉంటారు అనేది చరిత్ర చెప్పే సత్యం.

Read More
Next Story