వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా టీమ్ సభ్యులు, వారి అనుచరులపై అమరావతి పరిధిలో నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. అందరికీ నోటీసులు పంపుతున్నారు.
కూటమి ప్రభుత్వ కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడుతున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా టీమ్, కార్యకర్తలు, సానుభూతిపరులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వాక్ స్వాతంత్య్రం పేరుతో ఇష్టారీతిన అసభ్య పదజాలంతో పోస్టులు చేస్తున్న వారిపై కమిషనరేట్ పరిధిలో ఇప్పటికి 47 కేసులు రిజిష్టర్ అయ్యాయి. అలాగే ఐటీ, బీఎన్ఎస్ చట్టాల్లోని కఠినమైన సెక్షన్లను జోడిస్తున్నారు. దీంతో అరాచకవాదుల ఆట కట్టించే వీలుందని పోలీసులు భావిస్తున్నారు.
కమిషనరేట్ పరిధిలోని 23 పోలీసు స్టేషన్లలో నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరందరికీ ఇప్పుడు నోటీసులు ఇచ్చి పిలిపించి విచారిస్తున్నారు. సరిగా సమాధానాలు ఇవ్వని వారిని మళ్లీ పిలిపిస్తున్నారు. కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు రాజధాని ఏరియాలో పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో మకాం వేసిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో మరో వైఎస్సార్సీపీ సానుభూతి పరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక వాట్సాప్ గ్రూప్‌లపైనా పోలీసులు నిఘా తీవ్రం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులను పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు స్థానిక వాట్సాప్ గ్రూప్‌ల్లో వైరల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ గ్రూప్‌లపై నిఘా పెట్టి వాటి అడ్మిన్లు, సభ్యులను గుర్తించి, 500 మందికి పోలీసులు నోటీసులిచ్చారు. నందిగామ, జగ్గయ్యపేటల్లో పలువురికి నోటీసులు ఇవ్వగా ఆ గ్రూప్‌ల్లోని సభ్యులు వాటి నుంచి బయటకు వచ్చేస్తున్నారు.
ఎక్స్‌లో వైఎస్సార్సీపీ అనుకూల వ్యక్తులపైనా పోలీసులు దృష్టి పెట్టారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులు పెట్టే పోస్టులను ఫాలో అవుతున్న వారు, లైక్‌లు కొడుతున్న వారిని గుర్తిస్తున్నారు. వీరికీ నోటీసులు పంపుతున్నారు. విదేశాల్లో ఉండి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌లను తీవ్రంగా దూషిస్తున్న పంచ్ ప్రభాకర్‌పై విజయవాడ సైబర్ స్టేషన్లో ఇప్పటికే కేసు పెట్టారు. ఇతని హ్యాండిల్‌ను ఫాలో అవుతున్న వారిని కూడా గుర్తించి త్వరలో నోటీసులు ఇవ్వనున్నారు.