Chiru Family | రెండు పార్టీలు... ముగ్గురు నాయకులు!  భవిష్యత్?
x

Chiru Family | రెండు పార్టీలు... ముగ్గురు నాయకులు! భవిష్యత్?

రాష్ట్ర రాజకీయాల్లో జనసేన చీఫ్ దుమారం రేపనున్నారా? కూటమిలో సమాంతర కేంద్రంగా మారతారా? కార్యాచరణ ఏమిటి?


మెగా ఫ్యామిలీ నుంచి కొణిదెల చిరంజీవి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి అయ్యారు. పదేళ్ల రాజకీయ పోరాటం సాగించిన జనసేన చీఫ్ ఎమ్మెల్యేగా గెలవడం ద్వారా డిప్యూటీ సీఎం అయ్యారు ఆ కుటుంబం నుంచి మెగాహీరో పెద్ద తమ్ముడు కొణిదెల నాగబాబు ఎంఎల్సీ కాబోతున్నారు.

సినిమారంగంలో కాదు. రాజకీయంగా కూడా మెగా సోదరులు కీలకంగా మారారు. ఆ రంగాల్లో సినీ కథానాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కొణిదెల చిరంజీవి వారసత్వం, స్ఫూర్తితో అటు నాగ బాబు, పవన్ కల్యాణ్ స్ఫూర్తి పొందారు. రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో పవన్ కల్యాణ్ నిర్ణాయకశక్తిగా మారారు.
ఈ పరిస్థితుల్లో
జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎంఎల్సీ పదవికి ఎట్టకేలకు కొణిదెల నాగబాబు పేరు ఖరారు చేశారు. దీంతో మెగా కుటుంబం నుంచి మరో తమ్ముడు రాజకీయ యవనికపైకి సంతకం చేయనున్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారాన్ని గ్యాలరీ నుంచి ఆస్వాదించి, ఆనంద పారవశ్యానికి లోనయిన నాగబాబు మండలికే పరిమితం అవుతారా? మంత్రిగా అసెంబ్లీలోకి కూడా వస్తారా? ఆ తరువాత పవన్ కల్యాణ్ అంతరంగంలో ఉన్న వ్యూహం ఏమిటనేది చర్చకు వచ్చింది. ఇంతవరకు ఓకే.

చిరంజీవి ప్రేరణతో..
2008 ఆగష్టు 26న ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతి నుంచి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం ద్వారా సినీ హీరో కొణిదెల చిరంజీవి ప్రకంపలను సృష్టించారు. పాలకొల్లులో ఓటమి చెందిన ఆయన తిరుపతిలో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం 18 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ పరిణామంలో పెద్ద తమ్ముడు కొణిదెల నాగబాబు పదవి లేకున్నా, కీలకంగా వ్యవహరించారు. రెండో తమ్ముడు పవన్ కల్యాణ్ యువరాజ్యం (యువజన విభాగం) రాష్ట్రం అధ్యక్షుడిగా విస్తృతంగా పర్యటనలు సాగించారు. ఒక రకంగా చెప్పాలంటే మెగా సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ కు అన్న చిరంజీవి సినిమారంగంలోనే కాకుండా, రాజకీయాల్లో ప్రేరణ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే, పార్టీ నడపడంలో చిరంజీవి తీవ్ర ఒత్తిడికి గురయ్యారని పరిశీలకులు భావించారు. దీంతో
2011 ఫిబ్రవరి 6న ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యత్వంతో కేంద్ర మంత్రి పదవికి పరమితం అయ్యారు.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ సీఎం ఎన్టీ రామారావు తరువాత
2014 మార్చి 14న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీని ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ మాత్రమే ప్రకటించారు. ఆ తరువాత తిరుపతి సభలో కూడా ప్రధాని మోదీ, సీఎం ఎన్. చంద్రబాబుతో కలిసి ఆ ఎన్నికల ప్రచార సభలో వేదికను పంచుకున్న పవన్ కల్యాణ్ "కాంగ్రెస్ హఠావో బేశ్ కో బచావో" అని నినదించడం ఓ రకంగా ఆయన అన్న కేంద్ర మాజీ మంత్రి కొణిదెల చిరంజీవిని ఇరకాటంలో పడేసింది.
2019లో కూడా ఎన్నికలు ఎదుర్కొన్న జనసేన ఓకే సీటు సాధించినా, ఆ ఎమ్మెల్యే వైసీపీ శిబిరానికి చేరువయ్యారు.
ఆగని పోరాటం..
రాజకీయ ఆధిపత్యం కోసం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తిరుగులేని విధంగా పోరాటం సాగించారనడంలో సందేహం లేదు. దీనికి అధికారంలోని వైసీపీకి ఎదురైన అసంతృప్తికి తోడు ఎన్నికలు సమీపించే వేళ సీఎం ఎన్. చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు చేయడం టీడీపీ, జనసేన ఏకంకావడమే కాదు. రాజకీయ సమీకరణలు శరవేగంగా మారడానికి ఆస్కారం కల్పించింది. ఇదే ఊపులో.. గత ఎన్నికల్లో కూటమి అధికారం దక్కించుకుంది. ఇందులో జనసేన కీలకంగా నిలిచింది.
ఆ తరువాత ఏమిటి?
2024 ఎన్నికలకు ముందు తన రెండో అన్న కొణిదెల నాగబాబుకు జనసేన ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం ద్వారా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అరంగేట్రం చేయించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి నాగబాబు పోటీ చేసి రామకృష్ణమరాజు చేతిలో ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో నాగబాబు 21.31 శాతం ఓట్లు సాధించినా, ఆ తరువాత రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకున్నట్లు ప్రకటించారు.
గత ఎన్నికల వేళ తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం మెగా, అల్లు కుటుంబం మొత్తం పిఠాపురంలో మోహరించింది. దానికి ముందే నాగబాబుకు జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శి హోదా కల్పించడం ద్వారా రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ట్రబుల్ ఘూటర్ గా బాధ్యతలు అప్పగించారు. అందులో తిరుపతి అసెంబ్లీ స్థానంలో కూటమి మధ్య సమన్వయం సాధించడంలో నాగబాబు సఫలం అయ్యారు. ఇదిలావుంటే..
వ్యూహం ఏమిటి?
పదేళ్ల రాజకీయ పోరాటం సాగించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎట్టకేలకు 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మధ్య వారధిలా నిలిచి కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 21 స్థానాల్లో పోటీ చేయించిన తన అభ్యర్థులను గెలిపించడం ద్వారా వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జన సైనికుల్లో మితిమీరిన ఆత్మస్థైర్యం కనిపిస్తోంది. జనసేన లేకుండా టీడీపీకి ఈ ఊపు వచ్చేది కాదనే ధోరణిలో ఉన్నారు.
ఇదే సాక్ష్యం
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి 164 స్థానాలు దక్కించుకుంది. వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. కాగా, 144 సీట్లలో పోటీచేసిన టీడీపీ 135 స్థానాల్లో గెలిచింది. జనసేన 21కి 21 స్థానాలు గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. పది స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఎనిమిది సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో కూటమి సారధ్యం వహిస్తున్న టీడీపీ చీఫ్ ఎన్ . చంద్రబాబు సీఎంగా, డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్, మంత్రివర్గంలో బీజేపీ కూడా ఉండడం ద్వారా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుస్తున్న విషయం తెలిసిందే.
చిచ్చు ఎందుకు రగిలింది?
సీఎం చంద్రబాబు కొడుకు మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని రెండు నెలల కిందట టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల డిమాండ్ తో రాజకీయ మంటలు చెలరేగాయి. అలా అయితే పవన్ కల్యాణ్ ను సీఎం చేయండి అని జన సైనికులు చెలరేగిపోయారు. పోస్టర్లు, హోర్డింగ్ లతో కలకలం రేగేలా చేశారు. ఆ తరువాత దావోస్ పర్యటన నుంచి సీఎం చంద్రబాబు తిరిగి రాగానే ఈ సమస్యను టీ కప్పులో తుఫానులో చల్లార్చడంలో రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే.. ఈ పరిస్థితుల్లో
కల్యాణ్ అంతరంగం ఏమిటి?
పవన్ కల్యాణ్ ఏమి చేయబోతున్నారు? అనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేశాయి. అసెంబ్లీ గ్యాలరీలో కూర్చుని తమ్ముడు పవన్ కల్యాణ్ ప్రమాణాస్వీకారాన్ని ఆస్వాదించిన నాగబాబు అదే సభలో మంత్రిగా అధ్యక్షా... అని పిలుస్తారా? లేక మండలికి మాత్రమే పరిమితం చేస్తారా?
2024 ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వ పెద్దలు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గ్యాలరీలో కూర్చొన్నారు. పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తున్న ఆయన వదనమే కాదు. పెదాలపై కూడా నవ్వు చెరగలేదు. కళ్ల నుంచి ఉబుకుతున్న ఆనందభాష్పాలను అదిమి పెట్టుకున్నట్లే కనిపించింది. గ్యాలరీలోని కుర్చీలో ఆయన నిలకడగా కూర్చోవడం కూడా సాధ్యం కానంత ఆనందంతో తబ్బిబ్బు అవుతూ కనిపించారు. ఆ ఆనంద పారవశ్యంలో ఆయన తన స్పందనను సామాజిక మాధ్యమం వేదికగా ఇలా ట్వీట్ చేశారు...
అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు నాగబాబును మండలిలో సభ్యుడుగా చేయడానికి నిర్ణయం జరిగింది. మూడు నెలల ముందు నుంచే ఈ మాట వినిపిస్తున్నా, మొదట ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని, సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన నిర్థారించింది. ఆ సమయం రానే వచ్చింది. టీడీపీ కూటమికి సంఖ్యా బలం రీత్యా కొదవ లేదు. ఎమ్మెల్యేల కోటాలో ఆయన ఎంఎల్సీ కావడం తథ్యం. అయితే,
జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు సీఎం ఎన్. చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఇది జరిగితే..
పవన్ కల్యాణ్ ఏమి చేయబోతున్నారు?

పార్టీ కోసం తీవ్రంగా పనిచేసిన తన రెండో అన్న కొణిదెల నాగబాబును ఎంఎల్సీ చేయాలనే కోరికను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నెరవేర్చుకుంటున్నారు. ఆ తరువాత పవన్ కల్యాణ్ రాజకీయ ఎత్తుగడ ఎలా ఉండబోతుందనేది చర్చకు ఆస్కారం కల్పించింది. 2024 ఎన్నికలు హోరుమీదున్నాయి. ఆ సమయంలోనే పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్ధానంపై ఓ చర్చ తెరమీదకు వచ్చింది. దీని లోతుపాతుల్లోకి వెళ్లే ముందు..
2014 ఎన్నికల నాటి నుంచి పవన్ కల్యాణ్ కేంద్ర బీజేపీ పెద్దలకు తలలో నాలుకలా మారారు. అది ఎంతలా చేరువ చేసిందంటే, బీజేపీ అగ్రనేతలతో నేరుగా వెళ్లి మాట్లాడడమే కాదు. కావాల్సింది సాధించుకునే అంతగా సాన్నిహిత్యం పెంచింది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తిరుపతిలో గత ఏడాది వారాహి డిక్లరేషన్ ప్రకటనతో బీజేపీ నినదించే హిందూత్వ వాదానికి అంబాసిడర్ గా మారారు. అంటే, పవన్ కల్యాణ్ బీజేపీ గొంతుక అనే విధంగా వాతావరణం కనిపించేలా చేస్తోంది.
రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగానే కొనసాగుతారా? లేదా కేంద్ర రాజకీయాల్లోకి వెళతారా? అనే విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. ఎందుకంటే గత ఎన్నికల సమయంలోనే ఇదే చర్చ జరిగింది. మీడియా కూడా కోడై కూసింది.
దీనిపై నెల్లూరుకు చెందిన బీజేపీ సీనియర్ నేత కరణం భాస్కర్ 'ఫెడరల్' ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ "
ఆ ప్రతిపాదన కేంద్ర స్థాయిలో ఉంది" అని చెప్పారు. దక్షిణాదిలో పవర్ ఫుల్ (జనాకర్షణ ) నేతల ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని తలుస్తున్నారు" అని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే ఏపీలో పవన్ కల్యాణ్, తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి, తెలంగాణలో ఈటల రాజేందర్, ఫైర్ బాండ్ల సేవలు వాడుకోవాలని అగ్రనాయకత్వం భావిస్తున్నా విషయాన్ని ఆయన నర్మగర్భంగా వివరించారు.
పవన్ కల్యాణ్ భవిష్యత్ రాజకీయంపై ఆయన లేదా బీజేపీ అగ్రనేతలు మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. తాజా పరిస్థితుల్లో తన రెండో అన్న నాగబాబును ప్రత్యక్ష రాజకీయాలు అది కూడా కీలకపదవిలోకి తీసుకురావడం వెనుక బలమైన కారణం లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ పాటికే కూటమిలో కల్లోలం అంతర్గతంగా రగులుతూనే ఉంది. క్షేత్రస్థాయిలో టీడీపీ కూటమిలోని జనసైనికులతో పొంతన పొసగని పరిస్థితి నెలకొంది. నాగబాబు ఎంఎల్సీకి అయ్యాక, చోటుచేసుకునే మార్పులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుందనేది వేచిచూడక తప్పదు.
Read More
Next Story