అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాను వెంటనే నిలిపి వేశారు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కరెంట్ తీగలను ఓ రైలు ఈడ్చుకుంటూ వెళ్లింది. అప్రమత్తమైన అధికారులు విద్యుత్‌ను నిలిపి వేయడంతో భారీ ప్రమాదం తప్పింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ సంఘటన విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని పురులియాకు విశాఖ మీదుగా ప్రయాణిస్తున్న సూపర్ ఫాస్ట్ రైలు ఆదివారం తెల్లవారు జామున దాదాపు 5:20 గంటల సమయంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఈ రైలు విశాఖపట్నం చేరుకున్న తర్వాత దీనికి ఇంజన్‌ను మారుస్తారు. ప్రతి సారీ ఇలా చేస్తూ ఉంటారు. ఇదే మాదిరిగా ఆదివారం కూడా ఇంజన్‌ను మార్చారు. అయితే తొలగించిన ఇంజన్ ముందుకు ప్రయాణిస్తూ పైన ఉన్న కరెంట్ తీగలను నెట్టుకుంటూ వెళ్లింది. దీనిని గమనించని డ్రైవర్ అలాగే పొనివ్వడంతో దాదాపు 100 మీటర్ల దూరం వరకు ఆ కరెంట్ తీగలను ఈడ్చుకుంటూ వెళ్లింది.
దీనిని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. పరుగు పరుగున వెళ్లి కరెంట్ సరఫరాను నిలిపి వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినటై్టంది. ఒక వేళ అధికారులు దీనిని గుర్తించకుండా, కరెంట్‌ను ఆపేయకపోతే భారీ ప్రమాదం చోటు చేసుకొని ఉండేది. సమయానికి అధికారులు అలెర్ట్ కావడం, సమయస్పూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ సంఘటన వల్ల ప్రమాదం జరక్క పోయినా..రైళ్ల రాకపోకలకు మాత్రం అంతరాయం కలిగింది. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది అంతరాయం లేకుండా చేసేందుకు ఉపక్రమించారు. కరెంట్‌ను పునరుద్దరించడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కొనసాగకుండా చేశారు. యధావిధిగా రైళ్ల రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకున్నారు.