ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై, విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థిపై జరిగిన రాయి దాడి విషయంలో పోలీసులు ఘోర వైఫల్యం చెందారు. దాడిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై విజయవాడలో శనివారం రాత్రి జరిగిన రాయి దాడి ఘటనపై పోలీసులు ఫెయిల్‌ అయ్యారా? ఇదో కొత్త నాటకమా? దాడి ఎవరు చేయించారు? ఎందుకు చేయించారు? ఇప్పుడే ఎందుకు చేయించారు? ఇక్కడే ఎందుకు చేయించారు? ఒక వేళ దాడి ముఖ్యమంత్రే చేయించుకుంటే ఏమి ఆశించి చేయించుకున్నారు? ఈ సంఘటన ఎన్నికల వేళే ఎందుకు జరగాల్సి వచ్చిందనేది ఇప్పుడు జనంలో మెదులుతున్న ప్రశ్నలు. అధికారపార్టీ ప్రతిపక్షం చేయించిందని అంటున్నారు. ప్రతిపక్షం వారు అధికార పార్టీవాళ్లే కావాలని చేయించుకున్నారని అంటున్నారు. ఎన్నికల సమయంలో లబ్ధిపొందేందుకు మరో కోడికత్తిలాంటి డ్రామాకు తెరలేపారని అంటున్నారు. ఇలా భిన్న వాదనలు వినిపిస్తుంటే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎన్నికల సమయంలో కేవలం లబ్ధిపొందేందుకే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాలు పక్కన పెడితే వేలాదిమంది మధ్య పబ్లిక్‌ మీటింగ్‌లో సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిపైన దాడి జరగటం దేనికి సంకేతం?

నిఘా వ్యవస్థ ఏమైంది?
ముందునుంచే జగన్‌ పర్యటించే దారంతా తనిఖీలతో నిరంతరం జల్లెడ పట్టిన పోలీసు నిఘా వ్యవస్థ ఏమైంది? ఎందుకు ఇంత దారుణంగా ఫెయిల్‌ అయింది? పోలీస్‌ వ్యవస్థలోని లోపం ఒక్కసారిగా బట్టబయలైందని చెప్పొచ్చు. వారధి నుంచి అజిత్‌సింగ్‌ నగర్‌ వరకు డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఇతర పోలీసులు సీఎం వాహనంతో పాటు నడుచుకుంటూ సుమారు నాలుగు కిలోమీటర్లు వెళ్లారు. సింగ్‌నగర్‌ బ్రిడ్జీ దిగగానే అలసిపోయిన పోలీసులు నీళ్లు తాగేందుకు, అల్పాహారం తినేందుకు పక్కన ఉండ బడ్డీకొట్ల వద్దకు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. జగన్‌పై దాడి జరిగిన సమయంలో రోప్‌ పార్టీవారితో పాటు కొద్దిమంది పోలీసులు మాత్రమే అక్కడ ఉన్నారు.
మరో విశేషం ఏమిటంటే విజయవాడ నగరంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి యాత్రలో చిన్నచిన్న అవాంతరాలు ఎదురయ్యాయి. మెట్రో సెంటర్‌ వద్దకు రాగానే వైఎస్సార్‌సీపీ భారీ జెండాలు పట్టుకున్న కొందరు కార్యర్తలు ఆ జెండాలను అటూ ఇటూ ఇసురుతూ చిందులు తొక్కారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. కొందరు పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలో పడిపోయారు. ఆ ప్రాంతమంతా చిందరవందరగా మారింది. అక్కడి నుంచి చుట్టుగుంట సెంటర్‌కు వెళ్లగానే గుర్తు తెలియని వ్యక్తి ఐదువందలు, రెండు వేల నోట్ల కట్టలు పైకి విసిరాడు. దీంతో డబ్బులు చెల్లా చెదురుగా గాలికి ఎగిరాయి. జగన్‌ యాత్రలో ఉన్న జనం ఈ నోట్లను వేరుకునేందుకు అందరూ వంగి తిరుగుతూ కనిపించారు. ఈ చర్యలను పోలీసులు చాకచక్యంగానే నివారించారు. పోలీసులు ఈ చర్యలతో అలర్ట్‌ అయ్యారు. ఇక సింగ్‌నగర్‌కు చేరుకోగానే మరో పావుగంటలో నగరం దాటే అవకాశం ఉన్నందున కాస్త పోలీసులు రిలాక్స్‌ అయ్యారు. దీంతో రాయి దాడి చోటు చేసుకుంది.
గంగానమ్మ గుడి వద్ద సంఘటన
గంగానమ్మ గుడి వద్దకు చేరుకోగానే ఆ ప్రాంతమంతా కరెంటు పోయింది. దీంతో జనాన్ని గుర్తించడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యమంత్రి వాహనం నుంచి వచ్చే వెలుతురు తప్ప జనం మధ్య వెలుతురు లేదు. గంగానమ్మ గుడి పక్కనే సాయిబాబా గుడి ఉంది. అటు కొంచెం ముందు వివేకనంద స్కూలు, ఆ పక్కన స్టేడియం ఉన్నాయి. గుళ్ల మధ్య నుంచి లేదా స్కూలు వైపు నుంచి రాయి వచ్చి సీఎం నుదిటిపై రాసుకుంటూ పోయి సెంట్రల్‌ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కంటికి తగిలింది. దీంతో వెల్లంపల్లి శ్రీనివాస్‌ కంటికి బలమైన గాయం కాగా సీఎం ఎడమ కంటి పైబాగాన గాయమైంది. సీఎం జగన్‌ కంటిపైభాగం నుంచి రాయి దూసుకుపోయిందని, అదే నేరుగా నుదుటిని ఢీకొట్టి ఉంటే తల పగిలేదని అక్కడి వారు చెబుతున్నారు. దాడి చేసిన వారు 30 నుంచి 35 మీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సీఎం వాహనం ఎత్తుగా ఉండటం వల్ల విద్యుత్‌ తీగలు తగిలే అవకాశం ఉందని కరెంటు పలు మార్లు తీసినట్లు విద్యుత్‌ శాఖ వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. సంఘటన శనివారం రాత్రి 8.15 గంటల సమయంలో జరిగితే సాయంత్రం ఆరు గంటల నుంచి పలు మార్లు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతూ వచ్చింది.
ట్విట్టర్‌ వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందించారు. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్‌? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే వచ్చా! అంటూ.. కొత్తగా ఏదైనా ఉంటే ట్రైచెయ్‌ జగన్‌ అంటూ చమత్కరించారు.
సాంకేతిక పరిజ్ఞానం ఏమైంది?
ముఖ్యమంత్రిని కంటికి రెప్పలా కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ఏమి చేస్తుంది? సాంకేతిక పరిజ్ఞానం అరచేతిలో ఉంది. సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ అందుబాటులో ఉన్నాయి. సభల్లో డ్రోన్‌ కెమెరాలు నిరంతరం పనిచేస్తుంటాయి. ఎక్కడ ఏ సంఘటన చోటు చేసుకున్నా అందులోని కెమెరాలు ఇట్టేపట్టేస్థాయి. చిత్తూరు జిల్లాలో జగన్‌ కాన్వాయ్‌పై చెప్పు విసిరితే అది కెమెరాల్లో, వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. విజయవాడలో మాత్రం దాడి జరిగినట్లు చెబుతున్న రాయి కానీ, అందుకు సంబంధించిన ఆనవాలు కానీ కనిపించలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే పోలీసులు ఒక రాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ రాయి ఏ ఆకారంలో ఉందనేది పోలీసులకు మాత్రమే తెలుసు. దానిని బయట పెట్టలేదు. చుట్టూ సెక్యూరిటీ ఉన్నారు. వారెవరికీ కనిపించకుండా రాయి నేరుగా జగన్‌ నొదిటిపైన, ఆ తరువాత అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌ నొదిటిపైన తగలటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పోలీసు ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. ఏమి జరిగిందో సెక్యూరిటీ వారు తేరుకునేలోపు జగన్‌ నుదిటి నుంచి రక్తం కారుతోంది. అభ్యర్థి కంటిపై గాయమైంది. అయినా ఏ వ్యవస్థ కూడా పసిగట్టలేకపోయిందంటే లోపం ఎక్కడుంది? సీఎం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఎధా విధిగా జంక్షన్‌కు వెళ్లారు. రాత్రి అక్కడ బస చేశారు.
పోలీసుల అదుపులో కొందరు వ్యక్తులు
కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. తాము ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. సింగ్‌నగర్‌లో ఎక్కువ మంది పక్షులు, పిట్టలు కొట్టే వారు ఉంటారు. జగన్‌ వచ్చారని సభ వద్దకు చూసేందుకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. పిట్టలు కొట్టే వారి వద్ద కేడ్‌బాల్స్‌ ఉంటాయి. అటువంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ దాడికి ఎదరు పాల్పడ్డారనేది పోలీసులకు అంతుచిక్కకుండా ఉంది.
పెరుగుతున్న నేరప్రవృత్తికి సంకేతమా..?
గత ఎన్నికల్లో కోడికత్తి సంఘటన ఇంకా మరిచిపోలేదు. ఇంతవరకు ఆ సంఘటనపై చర్యలు లేవు. కోర్టులో విచారణ సాగుతూనే ఉంది. ఎప్పటికి తీర్పు వస్తుందో లె లియదు. విజయవాడలో రాయి దాడి ఘటనకు సంబంధించి కూడా ఇంతవరకు నిందితులను గుర్తించలేదు. వారిని ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారు? నిజమైన నిందితులను పట్టుకుంటారా? లేదా? ఆయేషా కేసులో నిందితుడిని చూపించినట్లు ఇక్కడ కూడా ఎవరినైనా తెరపైకి తీసుకొస్తారా? రాష్ట్ర ప్రజను నేడు వెంటాడుతున్న అనుమానాలు ఇవి.
ఎవరు చేసినా, చేయించినా, చేయించుకున్నా దీని వెనుక ఒక పెద్ద రాజకీయ శక్తి ఉందనేది నిర్వివాదాంశమని సీపీఐ రాష్ట్ర సమితీ సభ్యుడు కెవివి ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. నిందితుల వెనుక ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తే వారిని కంటికి రెప్పలా కాపాడుతుందని, కుటుంబాలకు సైతం వాళ్లే సకల సౌకర్యాలు కల్పిస్తారనే ధీమా కూడా నిందితులలో ఉండటం వల్లే ఇటువంటి దారుణాలకు ఒడిగట్టి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
పక్కదోవ పట్టించే కార్యక్రమమేనా?
సీఎం జగన్‌పై రాయి దాడి సంఘటన ఎన్నికల్లో ఓటర్ల అటెన్షన్‌ను పక్కదోవ పట్టించే కార్యక్రమమేనా? జగన్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని బావించి చేపట్టిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ఈ రాయి చెరిపేస్తుందా? అందలం ఎక్కిస్తుందా? ప్రజల మనసులు మార్చేస్తుందా? ఎందుకు ఓటర్లను ఇంత తక్కువ అంచనా వేస్తున్నారనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడిపై మావోయిస్టులు జరిపిన దాడి దారుణమైంది. మృత్యువు ఒడి వరకు వెళ్లి వచ్చారు. ఈ ఘటనతో సానుభూతి వస్తుందని భావించిన బాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయినా ప్రజలు సానుభూతిని చూపించలేదు. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందారు. అందువల్ల విజ్ఞులైన ఓటర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయవద్దని పూర్వపు సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి.
ప్రజల భద్రతకు భరోసా ఎక్కడ?
సాక్షాత్తూ ముఖ్యమంత్రిపైనే బహిరంగంగా రాళ్ల దాడి జరిగిందంటే ప్రజలకు ఈ రాష్ట్రంలో ఏ మాత్రపు భద్రత ఉందో అర్థమవుతుందని శాంతిభద్రతలు కోరుకునే ప్రజలు వ్యాఖ్యానించడం విశేషం. పాలకులు, ప్రతిపక్షాలు అనుకుంటున్నట్లు ప్రజలు పిచ్చివారా? ఏమీ తెలియని వారా? జరుగుతున్న పరిణామాలపై ఒక అంచనాకు రావడం చేతకాని వారా? అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానంతో నిత్యం చైతన్య వంతులవుతున్న విజ్ఞతగల ఓటర్లు ఇలాంటి సంఘటనల పట్ల పెద్దగా ప్రబావితం కాబోరని ప్రముఖ విశ్రాంత సీనియర్‌ జర్నలిస్ట్‌ కె వెంకటేశ్వరావు అన్నారు.
పోలీస్‌ వెల్‌ఫేర్‌పై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. పెన్షనర్లదీ అదే పరిస్థితి. ఒకటి నుంచి పదోతేదీ వరకు ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. కానీ పోలీసులకు మాత్రం ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయి. శాంతిభద్రతలు కాపాడే వ్యవస్థ కాబట్టి వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ జీతాలు ఆపవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సకాలంలో జీతాలు తీసుకుంటున్నది పోలీస్‌ శాఖ ఒక్కటే. అటువంటి పోలీసు శాఖ కానీ, నిఘా విభాగం కానీ ఎందుకు నిద్రావస్థలో ఉందనేది ఇప్పుడు చర్చనియాంశంగా మారింది. చరిత్రలో లేని విధంగా పోలీసులకు వీక్‌ ఆఫ్‌లు ఇచ్చారు. హుందాతనం పెంచేందుకు డ్రస్‌కోడ్‌ మార్పులు తీసుకొచ్చారు. ఎస్‌ఐ క్యాడర్‌కు గజిటెడ్‌ హోదా కల్పించారు. సచివాలయ వ్యవస్థలో సైతం ఒక పోలీసును నియమించడంతో సహా పోలీసుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. అయినా వైఎస్‌ జగన్‌పై దాడి తప్పలేదు.
Next Story