న్యాయం కోసం ఓ చిరుద్యోగి అలుపెరుగని పోరాటం చేస్తోంది. ఆమె ఎవరు? ఎందుకు ఈ పోరాటం?


ఆమె ఒక చిరుద్యోగి. అన్ని చోట్లా జరుగుతున్నట్లే అక్కడ కూడా ఆమె లైంగిక వేధింపులకు గురైంది. మానశిక వేదనతో దిక్కుతోచని స్థితికి చేరింది. నన్ను వేధించ వద్దని, నాకు ఒక పిల్లోడు ఉన్నాడని వేడుకున్నా వేధింపులకు గురి చేస్తున్న వారు పట్టించుకోలేదు. తనను లైంగికంగా వేధిస్తున్నారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ఆమె ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కనీస స్పందన లభించలేదు. పోలీసులను ఆశ్రయించారు. మహిళా కమిషన్ ను ఆశ్రయించారు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి వేధిస్తున్న వారిపై కేసు నమోదు చేసే వరకు పోరాటం సాగింది. అయినా పోలీసులు వేధింపులకు గురిచేస్తున్న వారిని పట్టించుకోలేదు. రాజకీయ వత్తిడులకు పోలీసులు తలవంచి తనకు అన్యాయం చేస్తున్నారని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంతకూ ఎవరా యువతి? ఎందుకు ఇంత పట్టుదలతో పోరాటానికి దిగింది?

అది ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్. రాజీవ్ గృహకల్ప ఏరియా అర్బన్ హెల్త్ సెంటర్ లో లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అసిస్టెంట్ (LGSA) గా 2023 జూన్ 6న కె సరోజ ఉద్యోగంలో చేరింది. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. అందరిలాగే ప్రతి రోజూ ఆఫీసు సమయానికి రావడం, విధులు నిర్వహించుకుని ఇంటికి వెళుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ అక్కడ ఇద్దరు యువకుల వక్ర బుద్ధి బయట పడింది.

లైంగిక వేదింపులు

చీటికి మాటికి సరోజ ను తమ వద్దకు రావాల్సిందిగా పిలవడం, వచ్చిన తరువాత నువ్వు చాలా బాగుంటావు. టీ తీసుకు రావా.. అంటూ వారికి నచ్చిన పనులు చేయించుకోవడం మొదలు పెట్టారు. సందర్భాను సారంగా లైంగిక పరమైన మాటలు మాట్లాడుతూ వేధింపులు మొదలు పెట్టారు. మీరు అనుకున్నట్లు నన్ను వేధించ వద్దని సరోజ వారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేసింది. అయినా వారి ధోరణిలో మార్పు రాలేదు. ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ విధులు నిర్వహిస్తున్న కొక్కిలిగడ్డ సురేంద్రబాబు, డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న షేక్ అహ్మద్ గౌస్ అన్సారీ లు ఆమెపై వేధింపులు పెంచారు. లైంగికంగా వారు చేస్తున్న మాటల దాడిని తట్టుకోలేక మానశికంగా ఆమె కుంగిపోయింది. ఒక దశలో ఉద్యోగం మానేసి వెళ్లిపోదామనుకుంది. తనకు చిన్నారి బాబు ఉన్నాడు. వాడి ఆలనా.. పాలనా చూసుకోవాలంటే ఉద్యోగం తప్పని సరి. అందుకే ఆమె వారిపై పోరాటానికి సిద్ధమైంది.

జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి ఫిర్యాదు

తనను లైంగికంగా వేధిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ కొక్కలిగడ్డ సురేంద్రబాబు, డేటా ఎంట్రీ ఆపరేటర్ షేక్ అహ్మద్ గౌస్ అన్సారీ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ మేరకు రాత పూర్వకంగా అర్జీ కూడా డీఎంఅండ్ హెచ్ వోకు అందజేసింది. ఎందుకో జిల్లా అధికారి పట్టించుకో లేదు. దీంతో ఆమెపై వీరిద్దరి వేధింపులు ఎక్కువయ్యాయి. అర్బన్ హెల్త్ సెంటర్ లో ఆమె ఒంటరి అయ్యారు. జిల్లా అధికారికి ఫిర్యాదు చేశారని తెలియగానే సహ ఉద్యోగులు మాట్లాడటం మానేశారు. వీరిద్దరి వేధింపులు మాత్రం తగ్గలేదు. గతంలో కంటే ఇంకా హేళనగా మాట్లాడుతూ మాతో ఎప్పుడుంటావు అనే విధంగా మాట్లాడే వారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

పోలీసులకు ఫిర్యాదు

తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న సురేంద్రబాబు, అన్సారీ పై తాలూకా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్ కు ఫిర్యాదు చేసింది. ఆయన కూడా ఈ యువతి వేదన గురించి ఆలోచించ లేదు. కేసును పక్కన పెట్టేశారు. విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మహిళ కమిషన్ లకు ఆమె ఫిర్యాదు చేశారు. స్పందించిన మహిళ కమిషన్ ఈ యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఎస్పీ ఆదేశాల మేరకు తాలూకా సీఐ అజయ్ కుమార్ సరోజను పిలిపించారు. నిన్ను లైంగికంగా వేధించారా? నీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా? ఏ విధంగా లైంగిక వేధింపులకు గురిచేశారు. అప్పుడు నువ్వు ఏమని సమాధానం ఇచ్చావు. అంటూ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించటమే కాకుండా కఠువైన మాటలతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ని ప్రశ్నలు వేసినా కేసు మాత్రం నమోదు చేయలేదు.

కోర్టు మెట్లు ఎక్కిన యువతి

తనపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఆమె ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. ఆస్పత్రిలో తనపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకునేందుకు డిపార్ట్మెంట్ వారు కానీ, పోలీసులు కానీ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. బాధితురాలి వాదనలు విన్న కోర్టు సరోజ ఆరోపణలపై కేసు నమోదు చేయాలని తాలూకా పోలీసులను ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వలు జారీ చేసింది. 2025 మార్చి 10వ తేదీన ఈ ఉత్తర్వులు వెలువడటంతో పోలీసులు అదే రోజు 139/2025 రిజిస్టర్ నెంబరుగా కేసు నమోదు చేశారు. న్యాయ సంహితలోని 74,75(1),76,64(1),r/w3(5) బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

నిందితుల బెదిరింపులు

ఇప్పటి వరకు వేధింపులకు గురిచేసిన సురేంద్రబాబు, అన్సారీలు పోలీస్ కేసు నమోదు కాగానే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సరోజ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కేసు నమోదు చేసిన తాలూకా పోలీసులు నిందితులను మాత్రం అదుపులోకి తీసుకోలేదు. పోలీసుల సపోర్టును ఆసరాగా తీసుకున్న నిందితులు మరింత రెచ్చిపోయి నిన్ను, నీ కుటుంబాన్ని లేపేస్తాం అంటూ బెదిరిస్తున్నారని ఆమె మీడియా ఎదుట వాపోయారు.

నిందితులకు రాజకీయ అండ

నిందితులు ఇవురురిని పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే వారికి రాజకీయ అండ ఉందని సరోజ చెబుతోంది. అధికార పార్టీకి చెందిన నేతలు వత్తిడి తేవడంతోనే పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడం లేదని, పైగా నన్ను మానసిక రోగిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె చెబుతోంది. కేసు నమోదు చేసినందున నిందితులను అరెస్ట్ చేస్తామని, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నందున వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కావాలనే వారు బెయిల్ తీసుకునేందుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది.

న్యాయం కోసం ఆ చిరుద్యోగ యువతి ఇంతటి పోరాటమా?

తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరితే స్పందించలేదు. పోలీసులు అసలు పట్టించుకోలేదు. న్యాయస్థానం ఆదేశిస్తే కాని కేసు నమోదు చేయలేదు. నిందితులు కళ్ల ముందు తిరుగుతున్నా పోలీసులు వారిని వదిలేశారు. ఈ కేసులో ఎందుకు ఈ విధంగా జరిగింది? నిందితులను పోలీసులు ఎందుకు కాపాడాలనుకుంటున్నారు? ఇక ముందు ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందనేది చూడాల్సిందే.

Next Story