ఆడుదాం ఆంధ్రా.. మట్టిలో మాణిక్యాలను వెలికితీసిందా!
ఏపీలో నిర్వహించిన క్రీడా టోర్నీ ఆడుదాం ఆంధ్రా ముగిసింది. 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్ సర్కార్ నిర్వహించింది.
ఏపీలో నిర్వహించిన క్రీడా టోర్నీ ఆడుదాం ఆంధ్రా ముగిసింది. 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్ సర్కార్ నిర్వహించింది. ఈ టోర్నీతో ఎందరో మట్టిలోని మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు. ఆటలు ఆడాలని ఉన్నా సరైన అవకాశాలు లేక ఎందరో క్రీడాకారులకు ఇదొక మంచి అవకాశంగా అభివర్ణించారు సీఎం జగన్. "రాష్ట్ర కీడ్రారంగంలో ఈ టోర్నీ ఒక మైలు రాయిగా నిలవనుంది. విశాఖలో జరిగే ముగింపు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకావడం హర్షణీయం' అన్నారు రాష్ట్ర మంత్రి రోజా.
డిసెంబర్ 26న ప్రారంభం
సీఎం జగన్ డిసెంబర్ 26న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'ఈ టోర్నీలో దాదాపు 25 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు' అన్నారు సీఎం జగన్. ప్రారంభ కార్యక్రమంతో పాటు ముగింపు సభలో కూడా ముఖ్యమంత్రే పాల్గొన్నారు. విశాఖలో సీఎం జగన్ క్రీడాల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
26 జిల్లాలు 25 లక్షల మంది క్రీడాకారులు...
'రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 25 లక్షల మంది క్రీడాకారులు ఈ మెగా టోర్నీలో పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఇందులో దాదాపు 3 లక్షల మ్యాచ్‌లు జరిగాయి. గ్రామ సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిల్లో ఈ పోటీలను నిర్వహించారు. ర్ర్రాష్ట్రంలోని అనేక మంది క్రీడాకారుల ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నీలో పాల్గొన్నారు' అని చెప్పారు మంత్రి రోజా. యువతలో క్రీడా సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం, చెన్నై సూపర్ కింగ్స్, ప్రైమ్ వాలీబాల్, ప్రో-కబడ్డీ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వంటి ప్రఖ్యాత ఫ్రాంచైజీలతో ఒప్పందాలు కూడా చేసుకుంది.
జాతీయ జట్టుకు కేఎస్ భరత్ ...
రాష్ట్రం నుంచి జాతీయ క్రికెట్ జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఈ టోర్నీలో పాల్గొంటున్న యువతలో స్ఫూర్తి నింపారు. 'ఆంధ్రప్రదేశ్ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకూ తన ప్రయాణం సాగింది' అని భరత్ ప్రస్తావించారు. తాను ఆంధ్రప్రదేశ్‌లోనే పెరిగానని, వీధుల్లో క్రికెట్ ఆడుతూ అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నానని చెప్పారు.
క్రీడాప్రతిభను వెలుగులోకి తెచ్చే యత్నం
'మొత్తానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంతో మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు ఏపీలో ఎంతోమంది ప్రతిభగల క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది' అని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలతో పిల్లలు, యువతలో క్రీడల పట్ల ఆసక్తి నెలకొనడమే కాకుండా మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతో దోహదం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది అని ప్రకటించింది రాష్ట్ర క్రీడాకారుల సంఘం. ఆడుదాం ఆంధ్రాలో అక్కడక్కడా కొన్ని గొడవలు జరిగినా ఓ మంచి ప్రయత్నం జరిగిందన్న భావన క్రీడాకారుల్లో నెలకొంది.
ఇకపై ఏటా ఆడుదాం..
గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి. మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులున్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లను ప్రభుత్వం అందించింది.
సీఎం జగన్ చెప్పిన వివరాల ప్రకారం 'గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 3.30 లక్షలు, మండల స్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గ స్థాయిలో 7,346, జిల్లా స్థాయిలో 1,731, రాష్ట్ర స్థాయిలో 260 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించింది. వివిధ దశల్లో విజేతలకు రూ.12.21 కోట్ల నగదు బహుమతులిస్తోంది. తొలి ఏడాది పోటీలు విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మరింత ఎక్కువ మంది గ్రామీణ క్రీడాకారులను పరిచయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇకపై ప్రతి ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహించేలా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చెన్నై సూపర్ సింగ్స్(సీఎస్‌కే)తో పాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా క్రికెట్‌లో టాలెంట్ హంట్ నిర్వహించింది. ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్ వాలీబాల్ ఫ్రాంచైజీలతో పాటు ఏపీకి చెందిన ఖోఖో, కబడ్డీ క్రీడా సంఘాలు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుల బృందాలు కూడా ఈ ఎంపికలో భాగస్వామ్యులయ్యాయి.