ఒక జైలుకు కాకుండా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను రాష్ట్రంలోని పలు జైళ్లకు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.


కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు విషయం పక్కన పెడితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు మీద కేసులు నమోదు కార్యక్రమానికి తెరలేపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, దూషణలకు పాల్పడ్డారు అంటూ తెలుగుదేశం, జనసేన శ్రేణులతో ఫిర్యాదులు చేయించడం, ఆ మేరకు కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారి పోయింది. పలు ప్రాంతాల్లో కేసులు నమోదు కావడంతో ఆయా పోలీసు స్టేషన్‌లకు తీసుకెళ్లడం, అక్కడ స్థానిక కోర్టుల్లో ప్రవేశపెట్టడం, జైలుకు పంపడం పరిపాటిగా మారింది. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళితో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల జైలు యాత్ర మొదలైంది. ఇప్పటికే ఆయనను మూడు ప్రాంతాల జైళ్లకు తరలించారు.

వైఎస్‌ఆర్‌ నేతల జైలు యాత్రలో పోసాని తర్వాత వల్లభనేని వంశీ లైన్లో ఉన్నారనే టాక్‌ కూటమి శ్రేణుల్లో వినిపిస్తోంది. ఇప్పటికే ఆయనపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. పీటీ వారెంట్‌లు తీసుకొని వంశీని ఆయా పోలీసు స్టేషన్‌లకు తీసుకెళ్లి, విచారించి, తర్వాత స్థానిక కోర్టుల్లో హాజరుపరచి, తర్వాత జైలుకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే చర్చ కూటమి శ్రేణుల్లో వినిపిస్తోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద గన్నవరం టీడీపీ కార్యాలయంపై కేసుతో పాటు మరో కొన్ని కేసులు నమోదు చేశారు. ఇప్పటికే విజయవాడ జైల్లో ఉన్న వంశీ మీద మరో మూడు కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లా ఆత్మకూరు, వీరవల్లితో పాటు మరో సారి గన్నవరం పోలీసు స్టేషన్‌లో కూడా కేసులు నమోదు చేశారు. ఆత్మకూరులో ఓ పొలం వివాదంలో వంశీ తల దూర్చారని, దౌర్యన్యాలకు పాల్పడ్డారని, వంశీ ఆదేశాలతోనే అతని అనుచరులు దౌర్యన్యాలకు పాల్పడ్డారని, పొలం రిజిస్ట్రేషన్‌ను చేయించారని కేసు నమోదు చేశారు.
వంశీ, అతని అనుచరు భయపెట్టడంతో బాధితులు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేక పోయారని కేసులో పేర్కొన్నారు. వీరపల్లిలో ఓ కంపెనీ వచ్చిన సమయంలో రైతులకు పరిహారం ఇచ్చే అంశంలో వంశీ అవకతవకలకు పాల్పడ్డారని రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీ మీద వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తన భూమిని వంశీ కబ్జా చేశారని ఓ న్యాయవాది భార్య గన్నవరంలో ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పోలీసులు వంశీ మీద కేసు నమోదు చేశారు. మర్లపాలెం మండలంలోని పానకాల చెరువులో అక్రమ మైనింగ్‌ తవ్వకాలు చేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందనే ఫిర్యాదు మేరకు వంశీ మీద గన్నవరం పోలీసులు మరో కేసును నమోదు చేశారు.
వంశీ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ లైన్‌లో ఉన్నారనే టాక్‌ కూటమి వర్గాల్లో వినిపిస్తోంది. అందులో భాగంగా దువ్వాడపై ఇప్పటికే తాజాగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మీద దువ్వాడ శ్రీనివాస్‌ అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారని, ప్రశ్నించకుండా ఉండేందుకు రూ. 50 కోట్లు తీసుకున్నట్లు పవన్‌ కల్యాణ్‌ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన శ్రేణులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు పోలీసులు దువ్వాడ మీద కేసులు నమోదు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, తిరువూరు,. పెడన, పామర్రు, గుడివాడ వంటి పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై కేసు నమోదు చేయాని మహిళా కౌన్సిలర్లు అమలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా దువ్వాడపై ఫిర్యాదులు చేశారు.
పలాస, టెక్కలి పోలీసు స్టేషన్‌లలో వీర మహిళలు ఫిర్యాదులు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లల్లోనే టెక్కలి జనసేన ఇన్‌చార్జి కణితి కుమార్‌ టెక్కలి పోలీసు స్టేషన్‌లో దువ్వాడపై నవంబరు 18న ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దువ్వాడకు 41ఏ నోటీసులు కూడా జారీ చేశారు. తాజాగా గురువారం గుంటూరు నగరపాలెం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నాయకుడు అడపా మాణిక్యాలరావు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇలా సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, లోకేష్‌లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారందరినీ పోసాని కృష్ణమురళి తరహాలోనే రాష్ట్రంలో ఎక్కడ కేసులు నమోదు అవుతున్నాయో ఆ ప్రాంతాల జైళ్లకు తరలించేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసినట్లు కూటమి శ్రేణుల్లో టాక్‌ వినిపిస్తోంది.
Next Story