ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ రాజకీయ కంబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ వారైన కమిటీ సభ్యులు ఆదివారం రాజీనామా చేస్తున్నారు.


ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌లో కలకలం చెల రేగింది. అసోసియేషన్‌ సభ్యులందరినీ రాజీనామా చేయాల్సిందిగా ప్రభుత్వం వత్తిడి పెంచింది. దీంతో ఆగస్టు 4న ఆదివారం రాజీనామా చేసేందుకు ఏసీఏ సమావేశం అవుతోంది. సమావేశం అనంతరం రాజీనామాలు సమర్పిస్తారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ చరిత్రలో పూర్తిస్థాయి రాజకీయాలు చోటు చేసుకుని ఒకేసారి ఎలక్టెడ్‌ బాడీ మొత్తం రాజీనామా చేయడం మొదటిసారి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలవగానే రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆదిపత్యం క్రికెట్‌ అసోసియేషన్‌లో కొనసాగింది. ఏసిఏ సభ్యుల ఎన్నిక గడువు ముగియడంతో తన బంధువులైన పి శరత్‌ చంద్రారెడ్డి, పి రోహిత్‌ రెడ్డిలను అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నిక చేయించుకోవడంలో సఫలమయ్యారు. అప్పటి వరకు ఉన్న కమిటీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు సంబంధించిన వారు. గంగరాజు వారసత్వానికి ముగింపు పలుకుతూ విజయసాయిరెడ్డి క్రికెట్‌ అసోసియేన్‌లోకి చొరబడ్డారు.

క్రికెట్‌ అసోసియేన్‌లో మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నకల్లో గెలిచిన వారు మూడేళ్లు అసోసియేషన్‌ పాలకవర్గంగా ఉంటారు. ప్రస్తుత పాలక వర్గానికి ఇంకా ఏడాదిపైనే సమయం ఉంది. అయినా వీరంతా రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. అందుకు కారణం ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏసీఏలో పెత్తనం చెలాయించినందున ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏసీఏలో పెత్తనం చెలాయించేందుకు నిర్ణయించింది. ఏసీఏను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన వత్తిడి మేరకే పాలక వర్గం రాజీనామా చేస్తున్నారని క్రికెట్‌ రంగంలోని పలువురు చెబుతున్నారు.
అసోసియేషన్ లో విహారి కుదుపు
క్రికెట్‌ అసోసియేషన్‌లో భారీ కుదుపుకు హనుమ విహారి అనే క్రికెటర్‌ కారణమనే ఆరోపణలు ఉన్నాయి. హనుమ విహారి ఎవరు? ఏమి జరిగింది? ఆయన ఎందుకు తెరపైకి వచ్చారనేది తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న హనుమ విహారి గుంటూరుకు చెందిన వ్యక్తి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆడుతున్న విహారి ఏపీలో ఆడేందుకు అసోసియేషన్‌ అనుమతి ఇచ్చింది. హనుమ విహారి కెప్టెన్సీలో ఒక టీమ్‌ ఆడుతోంది. అయితే టీము సభ్యులను ఇష్టానుసారం తిట్టేవాడని, వెటకారంగా వారిని మాట్లాడేవాడని, తాగిన మైకంలో టీము సభ్యుల మనస్సు నొచ్చుకునేలా ప్రవర్తించే వాడనే ఆరోపణలు ఉన్నాయి. అసోసియేషన్‌ అధ్యక్షుడు శరత్‌ చంద్రారెడ్డి రెకమెండేషన్‌తో తిరుపతికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుని కుమారుడు ఒకరు ఏపీ టీములో చేరారు. ఆ క్రికెటర్‌ విహారి తిట్టిన తిట్లు తనను బాధించాయని ముందుగా కంప్లైంట్‌ చేశారు. ఆ తరువాత టీములోని సభ్యులు 15 మంది ఈ మెయిల్స్‌ ద్వారా అసోసియేషన్‌కు కంప్లైంట్‌ చేశారు. అనంతరం రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారు. విహారి విషయమై అసోసియేషన్‌లో చర్చ జరుగుతుండగా విషయం తెలుసుకున్న విహారి అసోసియేషన్‌ నుంచి పిలుపు రాకముందే తాను ఏపీ టీము నుంచి తప్పుకుంటుంటున్నానని ఏసీఏకు మెయిల్‌ పెట్టాడు. సెలక్టర్లు కూడా ఆయనను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇంటర్‌ స్టేట్‌ మ్యాచ్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి టీము ఓడిపోయేందుకు కారకుడయ్యాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాను ఏపీ క్రికెట్‌ నుంచి వెళ్లిపోతూ ఏసీఏపై ఒక ఆరోపణ చేశారు. ఏసీఏలో రాజకీయాదే పైచేయిగా ఉందని, రాజకీయాలకు క్రికెటర్లు బలవుతున్నారని ఇన్‌స్టాగ్రాంలో వీడియో పోస్టు చేశారు. ఏపీకి ఇకపై నేను క్రికెట్‌ ఆడనని, వేరే రాష్ట్రాలకు ఆడేందుకు నాకు ఎన్‌వోసీ ఇవ్వాలని ఏసీఏకు విజ్ఞప్తి చేశారు. ఎన్‌వోసీ ఇవ్వకముందే ఉత్తర ప్రదేశ్‌లో ఆడేందుకు అక్కడి వారితో మాట్లాడుకున్నారని పలువురు క్రికెటర్లు చెబుతున్నారు. ఇన్‌స్టాగ్రాంలో విహారి పోస్టు చేసిన వీడియో రాజకీయ దుమారం లేపించింది. ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లు ఎన్నికలకు ముందు ఏసీఏ భ్రష్టుపట్టిందని పేర్కొంటూ విహారిని వారిద్దరూ బలపరిచారు. అప్పటి వరకు విహారికి ఏసీఏ ఎన్‌వోసీ ఇవ్వలేదు. ఎన్నికల అనంతరం ఎన్‌డీఏ కూటమి గెలవడంతో విహారికి ఎన్‌వోసీ ఇచ్చారు. ఆ తరువాత తిరిగి తాను ఏపీ టీము నుంచి క్రికెట్‌ ఆడతానని వచ్చారు. ఈ వ్యవహారమంతా అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
పాలక మండలి ఎందుకు రాజీనామా చేయబోతోంది?
ఏసీఏ అధ్యక్షులు పి శరత్‌ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు పి రోహిత్‌రెడ్డి, కార్యదర్శి ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌రెడ్డి, సహాయ కార్యదర్శి రాకేష్, కోశాధికారి ఎవి చలం, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు పురుషోత్తంలు ఆదివారం రాజీనామా చేస్తున్నారు. వీరంతా వైఎస్సార్‌సీపీకి చెందిన వారు కావడంతో ఎలాగైనా వీరిని తొలగించాలని తెలుగుదేశం ప్రభుత్వం భావించింది. రాజీనామా చేసి వెళ్లాల్సిందిగా వీరిపై లోకేష్‌ వత్తిడి తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకా వీరికి ఏడాదిపైనే సమయం ఉంది. వీరందరూ వివిధ రంగాల్లో వ్యాపారులుగా ఉన్నారు. రాజీనామాలు చేయకుండా ఉంటే ప్రభుత్వ పెద్దలు వ్యాపారాలను దెబ్బతీసే అవకాశం ఉందని భావించి రాజీనామాలు చేయబోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అసోసియేషన్‌లు, 31 పట్టణాల్లో క్రికెట్‌ క్లబ్సులు ఉన్నాయి. వీరిలో అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు, క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు, మరికొందరు సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. ఇంటర్నేషనల్‌ ప్లేయర్లు అయిన ఎంఎస్‌కే ప్రసాద్, వై వేణుగోపాల్‌రావు, ఆర్‌ కల్పనలకు కూడా ఓట్లు ఉంటాయి. అసోసియేషన్‌ తరపున ఒక మెన్, ఉమెన్‌ ప్లేయర్లు కూడా ఓటు హక్కు కలిగి ఉంటారు. కంప్రోలర్‌ ఆఫ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నుంచి అసోసియేషన్‌ పరంగా ఒక వ్యక్తికి ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుత కమిటీ రాజీనామా చేసిన తరువాత మళ్లీ కొత్త బాడీని ఎన్నుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగుల్లో ఆందోళన
ఏసీఏ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తమను కూడా ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తారేమోననే ఆందోళనలో చాలా మంది ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గోకరాజు గంగరాజుకు సంబంధించిన వ్యక్తులను కాదని వైఎస్సార్‌సీపీకి చెందిన వారిని విజయసాయిరెడ్డి సారథ్యంలో పెట్టుకున్నారు. అప్పట్లో ఒక ఒప్పందం అసోసియేషన్‌కు, గోకరాజు గంగరాజుకు మధ్య జరిగినట్లు క్రికెటర్లు చెబుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం కమిటీ సభ్యులు రాజీనామాలు చేసినా, టర్మ్‌ అయిపోయి దిగిపోయినా నిబంధనల ప్రకారం అసోసియేషన్‌లోకి తీసుకున్న ఉద్యోగుల్లో ఒక్కరిని కూడా తొలగించేందుకు వీలు లేదు. అయితే ఈ సారి తమ ఉద్యోగాలకు కూడా గండం ఉందనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు.
ఆదివారం పాలక మండలి రాజీనామా చేయగానే ఎన్నికల అధికారిని నియమించి నిబంధనల ప్రకారం కొత్త పాలక మండలి సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ను అధ్యక్షునిగా ఉంచేందుకు లోకేష్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆయనకు ఓటు హక్కు లేదు. అందువల్ల ఏదో ఒక క్రికెట్‌ క్లబ్‌కు అధ్యక్షుడిని చేసి ఓటు హక్కు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ఒక నెల రోజుల పాటు కొనసాగుతుంది. అనంతరం కొత్త పాలక మండలి ఎన్నికవుతుంది.
Next Story