ఆంధ్రాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసీబీ మూకుమ్మడి దాడులు
x

ఆంధ్రాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసీబీ మూకుమ్మడి దాడులు

రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కట్టలుగా దొరుకుతున్న కరెన్సీ కట్టలు


ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కరెన్సీ గుట్టలుగా దొరుకుతోంది. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతిపై లెక్కకు మిక్కిలి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ ఇవాళ ఏకకాలంలో దాడులు చేపట్టింది. దాదాపు 125 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో కుర్చీలు ఖాళీలు చేసి ఏమీ తెలియనట్టు బయటికి వెళ్లిపోయిన వారు కొందరైతే లెక్క చూపని కరెన్సీతో దొరికిన వారు కొందరు. అయితే ఏసీబీ అధికారులు కూడా ఇంకా ఈ విషయాల్ని బయటపెట్టలేదు.
ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి తదితర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
దళారులను, మధ్యవర్తులను తొలగించామని, అంతా ఆన్ లైన్లోనే అని అధికారులు చెబుతున్నా చేతికి లంచం అందనిదే రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏదీ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ ఈ దాడులు చేపట్టింది.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి ఎలా జరుగుతుంది?
పెళ్లి మొదలు భూమి, ఇల్లు, ప్రాపర్టీ, ఒప్పందాలు, పవర్ ఆఫ్ అటార్నీ వంటి పత్రాలను అధికారికంగా నమోదు చేయాలంటే మనం
రిజిస్ట్రేషన్ శాఖ (Registration & Stamps Department)ను ఆశ్రయించాల్సిందే. రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లాల్సిందే. ఈ శాఖలో వచ్చే డబ్బు (స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు) ప్రభుత్వానికి పెద్ద ఆదాయ వనరు కూడా.
కానీ ఇక్కడే అధికారులు, దళారులు (middlemen) చేతివాటం చూపిస్తారు. వీళ్లు తల్చుకుంటే లేని ఇళ్లకు పట్టాలొస్తాయి. ఉన్న స్థలాలు మాయమవుతాయి. మార్కెట్ విలువలు తగ్గుతాయి. రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. పేర్లు తారుమారవుతాయి. ఇలా ఒకటేమిటీ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరగని పనంటూ ఉండదు.
లైన్‌లో వెళ్లినా ఆన్ లైన్ లో వెళ్లినా ముందుగా మనం తీసుకునే టోకెన్ దగ్గర్నుంచే అవినీతి మొదలవుతుందనేది బహిరంగ రహస్యమే. “టోకెన్” లేదా “స్లాట్” ముందుగా పొందాలంటే దళారుల ద్వారా రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది లంచాలు వసూలు చేస్తారు. చివరికి “ఫాస్ట్ ట్రాక్ సర్వీస్” లాంటి పేరు మీద గోప్యంగా వసూలు అవుతుంది.
డాక్యుమెంట్ల క్లియరెన్స్, ఎంకంబ్రెన్స్ సర్టిఫికేట్ (EC), పాత డాక్యుమెంట్ల పరిశీలన, EC (Encumbrance Certificate) ఇవ్వడం, లేదా కరెక్షన్ చేయడం కోసం చిన్న మొత్తాలు నుంచి పెద్ద మొత్తాల వరకు లంచం తీసుకుంటారు. మనం లంచం ఇవ్వకపోతే “ఫైల్ మిస్ అయింది”, “సర్వర్ స్లో ఉంది” వంటి సాకుల పేరుతో వాళ్ల చుట్టూ తిరగాల్సిందే.
దళారులు ఇష్టారాజ్యంగా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటాయి. కార్యాలయాల బయట “దళారుల మాఫియా” పని చేస్తుంది. వీరు కొనుగోలు దారుల తరఫున పత్రాలు సిద్ధం చేసి, రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తమ పలుకుబడి చూపి పనులు చేయించడంలో వీళ్లు దిట్టలు. ఈ ప్రక్రియలో ప్రతి పత్రం మీద కమిషన్ పంచుకుంటుంటారు.
ఇక, సాఫ్ట్‌వేర్ మానిప్యులేషన్ & డేటా అవకతవకల గురించి చెప్పాల్సిన పనే లేదు. Registration సేవలకు ప్రభుత్వం ఆన్‌లైన్ PORTAL (IGRS / MeeSeva) సర్వీసులు ఏర్పాటు చేసినా అవి అధికారులు లేదా సిబ్బంది అనుకుంటేనే పని చేస్తాయి లేకుంటే స్లో డౌన్ అవుతాయి.
ఏసీబీ సోదాలు ఎందుకు జరిగాయి?
“రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లంచం తప్పదు” అనే ఆరోపణ ఆధారంగా ఏసీబీ (Anti- Corruption Bureau) పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది. ఒకేసారి 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు జరపడం అనేది అసాధారణం.
Read More
Next Story