ఆన్‌లైన్ బెట్టింగ్‌లు కుటుంబాలను చిద్రం చేస్తున్నాయి. ఆనందంగా బతుకుతున్న జీవితాలను పీల్చి పిప్పి చేసి రోడ్డున పడేస్తున్నాయి. చిన చిన్నంగా అలవాటు పడిన వారు క్రమంగా బానిసలవుతున్నారు. దానిలోనుంచి తేరుకునే లోపే వారి కుటుంబాలు బజారున పడుతున్నాయి. అన్నీ పోగొట్టుకుని చివరకు కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి కొంత మంది ఇళ్లు.. ఊర్లు వదిలి వెళ్లి పోతున్నారు. అందరూ ఉన్నా ఆఖరుకు అనాధలుగా మారి ఆఖరుకు శవాలై తేలుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఆన్‌లైన్ జూదానికి బానిసగా మారిన ఓ ప్రబుద్ధుడు సర్వం పోగొట్టుకుని ఇల్లు కాదు, ఊరే విడిచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. డబ్బులు పోయినా పర్వాలేదు మనిషే లేకుండా పోయాడని తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు. వెతికి పెట్టి అప్పగించమని పోలీసులను వేడుకున్నారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజన్ అనే యువకుడు ఓ ఫైనాన్స్ కంపెనీలో ఒక చిరుద్యోగిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన జీతంతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు. నిరంజన్‌కు ఇటీవలె పెళ్లి కూడా అయింది. అయితే చిన్నగా నిరంజన్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. చిన్న మొత్తాల్లో బెట్టింగ్‌లు చేస్తూ క్రమక్రమంగా బానిసగా మారిపోయాడు. ఒకే సారి పెద్ద మొత్తాల్లో సంపాదించొచ్చని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు అడిక్ట్ అయిపోయాడు. సంపాదించింది ఏమీ లేదు. కానీ సర్వం పోగొట్టుకున్నాడు. క్రిడిట్ కార్డులు, ప్రైవేటు చీటీల ద్వారా తీసుకున్న డబ్బు ఏకంగా రూ. 13 లక్షల వరకు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో తగలేశాడు. పెద్ద మొత్తం కావడంతో నిరంజన్‌కు ఒక్క సారిగా దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. రూ. 13లక్షల అప్పులు కళ్ల ముందు కనిపించాయి. ఎలా తీర్చాలని ఆలోచనలు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కనుచూపు మేరలో కనిపించ లేదు. దీంతో ఏమి చేయాలో దిక్కు తోచలేదు. చివరకు నిరంజన్ ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆరు పేజీల లేఖ రాసి.. ఇంట్లో పెట్టి పరారయ్యాడు. ఫోన్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేసేశాడు. తనను క్షమించమని తల్లిదండ్రులు, భార్యను లేఖలో వేడుకున్నాడు. ఇక నుంచి ఎవరీ కనబడనని, వెళ్లి పోతున్నానని ఆ లేఖలో రాశాడు. ఆ లేఖను చూసిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. భార్య కుప్పకూలి పోయింది. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. దుఃఖంలో నుంచి తేరుకున్న కుటుంబ సభ్యులు, డబ్బులు పోతే పోయాయి.. మనిషి ఉంటే చాలని భావించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.