ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపైన స్పందించారు. ఆదివాసీలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


ఎన్నికల్లో గెలిచి కొలువు దీరిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మీద కేసులు నమోదు కావడం చూస్తుంటాం. మరి కొన్ని సందర్భాల్లో మంత్రుల మీద కేసులు నమోదు కావడం చూస్తుంటాం. కానీ రాజ్యాంగబద్దమైన స్పీకర్‌ పదవిలో ఉన్న నాయకులపై కేసులు నమోదు కావడం చాలా అరుదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ అరుదైన వారి జాబితాలోకి చేరారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు తూర్పు గోదావరి జిల్లా జడ్డంగి పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకంతో పాటు ఇతరత్రా మన్యం ప్రాంతం అభివృద్ధి చెందాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని స్పీకర్‌ స్థాయిలో ఉన్న అయ్యన్నపాత్రుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యల మీద మన్యం ప్రాంతం ఒక్క సారిగా బగ్గుమంది. అయ్యన్నపాత్రుడు చేసిన ఈ వ్యాఖ్యలను ఆదివాసీలు తీవ్రంగా ఖండించారు. పాడేరు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లోని గిరిన ప్రాంతాల్లో మంగళవారం తీవ్ర స్థాయిలో బంద్‌ను పాటించారు. అరకు, రంపచోడవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లు వంటి ప్రాంతాల్లో సంపూర్ణ బంద్‌ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను కూడా వాయిదా వేశారు. మన్యం బంద్‌ ప్రభావంతో ప్రభుత్వ కార్యాలయాలు నామ మాత్రంగానే పని చేశాయి. బ్యాంకులైతే ఓపెన్‌ కాలేదు. ఏజెన్నీ ప్రాంతాలన్నీ ఒక్క సారిగా బంద్‌లోకి వెళ్లి పోవడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపై స్పందించక తప్పలేదు. గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని మేము బలంగా నమ్ముతున్నా. అందుకే వారికి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి మేము నిరంతరం పని చేస్తున్నాం. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించాం. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొనిరావడానికి కృషి చేస్తున్నాం.
ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నంబరు 3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వులు రద్దు అయ్యింది. దాని పునరుద్దరణకు మేము కృషి చేస్తాం. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. అలాంటప్పుడు ప్రచారాలాను నమ్మోద్దని.. అనవసరమైన అపోహలతో ఆందోళన చెందొద్దని గిరిజన సోదరులను కోరుతున్నా. సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తున్నామని సీఎం చంద్రబాబు ట్వీట్‌ చేశారు.
Next Story