మంగళగిరి మహిళా అఘోరీ జనసేన పార్టీ కార్యాలయం వద్ద భయానక వాతావరణం సృష్టించింది. ఆమె చేత దెబ్బలు తిన్న పోలీసులు అతి కష్టమ్మీద ఆమెను స్టేషన్‌కు తరలించారు.
జనసేన పార్టీ కార్యాలయం ముందు హల్‌చల్. పవన్ కళ్యాణ్‌ను కలవాలని రోడ్డుపై బైఠాయింపు. తనవైపు చూస్తూ దగ్గరగా వచ్చే వారిపై ఎగబడేందుకు యత్నం. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు నానా పట్లు పడిన పోలీసులు.
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా హడావుడి చేస్తోన్న అఘోరి నేడు మంగళగిరిలో ప్రత్యక్షమైంది. మంగళగిరి జాతీయ రహదారి పక్కన ఉన్న జనసేన కార్యాలయం వద్దకు వచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు తనను లోపలికి పంపాలని హడావుడి చేసింది. పోలీసులు ఆమెను అడ్డగించడంతో పార్టీ కార్యాలయం ఎదుట సర్వీసు రోడ్డులో బైఠాయించింది. తాను పవన్ కళ్యాణ్‌ను కలవాలని, ఆ తర్వాతేనే ఇక్కడ నుంచి వెళ్తానని పట్టుబట్టింది. రహదారిపై భీష్మించుకొని కూర్చోవడంతో విచిత్రంగా కనిపిస్తున్న ఆమెను చూసేందుకు గుమికూడారు. శరీరమంతా విభూది, చేతిలో త్రిశూలం, ఉండలు కట్టిన జట్టును పైకి ముడి వేసి గవ్వలు తలపై చుట్టుకుంది. రాష్ట్రంలో అన్యాక్రాంతమవుతున్న ఆలయ భూములను పరిరక్షించాలని, ఆ అంశాల గురించి పవన్ కళ్యాణ్‌ను కోరేందుకు ఇక్కడకు వచ్చానని, అంతవరకు తాను ఇక్కడ నుంచి వెళ్లేది లేదని ఆ అఘెరి రోడ్డుపై రచ్చ రచ్చ చేసింది.
బట్టలు లేకుండా, అటూ ఇటూ తిరుగుతూ, త్రిశూలం తిప్పుతూ, ఎవ్వరూ తన వద్దకు రావద్దంటూ కేకేలు వేసింది. ముందుగా బాసినపాట్లతో కూర్చున్న అఘోరి, ఆ తర్వాత పైకి లేచి అటు, ఇటు తిరిగి మెడాలపై కూర్చుంది. ఈ క్రమంలో అఘోరీని అదుపులోకి తీసుకోవాలని ఒక మహిళా కానిస్టేబుల్ చేయి పట్టుకొని పైకి లాగింది. ఒక్క సారిగా పైకి ఎగిరిన అఘోరీ ఒక పోలీసు కానిస్టేబుల్‌ను చెంప చెళ్లుమనిపించింది. మహిళా కానిస్టేబుల్‌ను నెట్టిపడేసింది. మిగిలిన కానిస్టేబుళ్లను ఒక్క సారిగా చెల్లా చెదురు చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క సారిగా ఉధ్రిక్త వాతావరణం నెలకొంది. ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట ఈ అఘోరీ వార్తలకెక్కుతూనే ఉంది. రోడ్లుపై బైఠాయింపునకు ముందు ఓ కారు సర్వీసింగ్ సెంటర్ వద్ద ఆగిన అఘోరీని ఆమె కారును ఓ విలేకరి వీడియో తీసారు. దాంతో ఆగ్రహానికి గురైన ఆ అఘోరీ ఆ విలేకరిని తన కర్రతో చితక బాదింది. దీంతో ఆ విలేకరికి గాయాలయ్యాయి. ఇలా సాధ్యం కాదని భావించిన పోలీసులు ప్రత్యేక పోలీసు బలగాలు ఉన్న వాహనాన్ని రప్పించి, బలవంతంగా అక్కడ నుంచి పోలీసు వ్యాన్‌ను ఎక్కించి మంగళగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Next Story