ఎదురీదుతున్న ఎస్సీ మంత్రులు

ఏపీలోని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లో ఇద్దరు వైఎస్సార్సీపీ మంత్రులు ఎన్నికలకు ఎదురీదుతున్నారు. రెండు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు.


ఎదురీదుతున్న ఎస్సీ మంత్రులు
x
మంత్రులు సురేష్, నాగార్జున

ఆంధ్ర ప్రదేశ్ లో విచిత్ర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఊరుకాని ఊరి వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారి గురించి ఓటర్లకు ఏమీ తెలియదు. కానీ వారికి ఓటు వేయాలి. ఇదెలా సాధ్యమనుకుంటున్నారా? అవును సాధ్యమే. వైఎస్సార్సీపీ వారు తలుచుకుంటే రాజకీయ బదిలీలు చేసి అభ్యర్థులుగా రంగంలోకి దించుతారు. ఈ ఎన్నికల్లో అదే జరిగింది. పార్టీమీద అభిమానం ఉంటే ఓటేస్తారు. లేదంటే వెయ్యరు. ఎలాగైనా గెలిచి తీరుతాం. ఇదీ ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ చెబుతున్న మాట. మీరు దీనిని తంతు అనుకోవద్దంటే వదిలేయండి. కానీ ఇది నిజం.

కొండపి రాజకీయ విశేషాలు

కొండపి నియోజకవర్గం 2009 నుంచి ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారింది. 2004 వరకు జనరల్ స్థానంగా ఉంది. అప్పటి వరకు ఇక్కడ గెలిచిన వారు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు మాత్రమే. 1955లో చెంచు రామానాయుడు, 1962, 67లో రోశయ్య నాయుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. వారిపై సీపీఐ పోటీ చేసి ఓటమి సవిచూసింది. తర్వాత డి శంకరయ్య సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి ఇండిపెండెంట్ గా పోటీచేసిన దివి కొండయ్య చౌదరిపై గెలుపొందారు. ఆ తరువాత 1978లో జి పట్టాభిరామస్వామి కాంగ్రెస్ ఐ నుంచి పోటీ చేసి జనతాపార్టీ తరపున పోటీ చేసిన రోశయ్య నాయుడును ఓడించారు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి మొదటి సారిగా ఎం మాలకొండయ్య పోటీ చేసి కాంగ్రెస్ ఐ పార్టీ అభ్యర్థి జిపి రామస్వామిని ఓడించారు. 1985, 89లో పోటీ చేసిన జి అచ్యత కుమార్ కాంగెస్ ఐ నుంచి పోటీ చేసి టీడీపీ నుంచి మాలకొండయ్యను, సీపీఐ నుంచి దివి శంకరయ్యను ఓడించారు. ఆ తరువాత 1994, 99లో దామచర్ల ఆంజనేయులు పోటీ చేసి గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. మూడోసారి దామచర్ల ఆంజనేయులు పోతుల రామారావుపై ఓడిపోయారు. రామారావు కాంగ్రెస్ ఐ నుంచి పోటీ చేశారు. అనంతరం ఎస్సీ రిజర్వుగా మారింది. రిజర్వుడు స్థానంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ శేషు కాంగ్రెస్ ఐ నుంచి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి డిఎస్విబీ సామిని ఓడించారు. శేషు కాంగ్రెస్ ఐ లో మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికల్లో 2014లో జూపూడి ప్రభాకర్ రావు పోటీ చేయగా టీడీపీ తరపున డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి మొదటిసారి పోటీచేసి గెలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ బాలవీరాంజనేయస్వామి రెండోసారి గెలిచి వైఎస్సార్సీపీ అభ్యర్థి మాదాసు వెంకయ్యను ఓడించారు. తిరిగి మూడోసారి బాలవీరాంజనేయస్వామి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు.

కమ్మ సామాజికవర్గం డామినేషన్ ఎక్కువ...

ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంవారి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. గెలుపు ఓటములు వారి చేతిలో వుంటాయి. స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు కుటుంబానికి నమ్మిన బంటుగా పనిచేస్తారు. ప్రస్తుతం ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన్ బాలవీరాంజనేయ స్వామిని గెలిపించే బాధ్యతలు తీసుకున్నారు. ఒకసారి టీడీపీ ప్రభుత్వంలో, మరోసారి ప్రతిపక్షంలో ఉండి పనిచేశారు. మంచీ చెడులు బాగా తెలిసిన వారు. వైద్యుడు కావడం వల్ల అందరికీ చుపరిచితుడు. నేటికీ దామచర్ల కుటుంబంలో ఎవరికి ఎటువంటి వైద్య సేవలు అందించాలన్నా బాలవీరాంజనేయ స్వామి వెళ్లి చూడాల్సిందే. మెజారిటీల పరంగా చూస్తే పెద్దగా తేడాలు లేవు కానీ అక్కడి వారు మాత్రం కాస్త తెలుగుదేశం పార్టీకే మొగ్గు చూపుతున్నారు. స్థానికుడైన బాల వీరాంజనేయ స్వామిని కాదని మార్కాపురం నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఎలా బలపరచాలనే ఆలోచనలో కొందరు వైఎస్సార్సీపీ వారు కూడా ఉన్నట్లు సమాచారం.

మంత్రికి కనీస గౌరవం ఇవ్వని స్థానికులు..

వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఆదిమూలపు సురేశ్ రంగంలో ఉన్నారు. ఎర్రగొండపాలెం నుంచి జిల్లా కేంద్రానికి సమీపంలో వున్న కొండెపికి వైఎస్ జగన్ రాజకీయ బదిలీ చేశారు. దీంతో ఆయన కిమ్మనకుండా పోటీకి సిద్ధమై నియోజకవర్గంలో తిరుగుతున్నారు. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం వారి వద్దకు వెళ్లినప్పడు అక్కడి నాయకులు మంత్రి అనే గౌరవం కూడా ఇవ్వడం లేదని పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు చెప్పడం విశేషం. అరే బాబూ సార్ వచ్చిండు కుర్చీ తెచ్చివ్వమ్మ అంటూ పెద్దవారు కుర్చీలో నుంచి లేవడం కూడా జరగటం లేదని స్థానికులు చెబుతున్నారు. కేవలం వైఎస్సార్సీపీని చూసి ఓటు వేయాలి. మంత్రిగా మా నియోజకవర్గానికి ఐదేళ్ల కాలంలో మీరు చేసిందేమిటో చూపించాలని అక్కడక్కడ ప్రశినస్తున్నారు. ఆ ప్రశ్నలకు సురేశ్ వద్ద సమాధానాలు లేవు. ఎందుకంటే ముఖ్యమంత్రి మాత్రమే సంక్షేమ పథకాలకు సంబంధించి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా మహిళల అకౌంట్లలోకి డబ్బును బదిలీ చేశారు. అందువల్ల ఆయనకు చెప్పేందుకు ఏమీ లేదు. పైగా ఆయన ఐదేళ్లు మంత్రిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నారు. రెండున్నర సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడైనా విద్యార్థులు గుర్తు పట్టారా అంటే అది కూడా లేదు. ఎవరో ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్న నాయకులు చెప్పినట్లు పల్లెల్లో ఓటర్లు వింటుంటారు. కొండపి కూడా చిన్న గ్రామం. చేసిన పనులు గురించి చెప్పుకోలేక వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా చేసిన సేవల గురించి చెప్పుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. సురేశ్ వెంట పెద్దగా జనం రావడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం నాన్ లోకల్ కావడమే ప్రధాన కారణం.

సంతనూతలపాడులో అందరినీ ఆదరించారు..

సంతనూతలపాడుకు 13 సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు కాంగ్రెస్ ఐ, మూడు సార్లు టీడీపీ, రెండు సార్లు వైఎస్సార్సీపీ, సీపీఐ ఒకసారి, సీపీఎం ఒకసారి గెలిచాయి. 1955లో అమ్మనబ్రోలు నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడింది. అప్పట్లో కాంగ్రెస్ తరపున జాగర్లమూడి చంద్రమౌళి గెలవగా సీపీఐ తరపున 1962లో ఎస్ సింగయ్య గెలుపొందారు. ఆ తరువాత 1962 నుంచి సంతనూతలపాడు నియోజకవర్గం ఏర్పాటైంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా కొనసాగుతోంది. తవనం చెంచయ్య రెండు సార్లు, ఆరేటి కోటయ్య రెండు సార్లు గెలిచారు. మిగిలిన వారంతా ఒక్కోసారి గెలిచిన వారే. 2009లో బిఎన్ విజయ్ కుమార్ కాంగ్రెస్ ఐ తరపున పోటీ చేసి సీపీఐ అభ్యర్థి జాలా అంజయ్యపై గెలుపొందారు. ఆ తరువాత టీడీపీ తరపున రెండు సార్లు పోటీ చేసి 2014లో ఆదిమూలపు సురేశ్ పై ఓడిపోయారు. 2019లో టిజెఆర్ సుధాకర్ బాబుపై పోటీ చేసి ఓటమి చెందారు.

పదేళ్లుగా బిఎన్ విజయ్ కుమార్ సంతనూతలపాడులోనే ఉంటూ నియోజకవర్గంలో తన వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. తిరిగి 2024 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించింది. ఈసారి వైఎస్సార్సీపీ వారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి మేరుగు నాగార్జునను రంగంలోకి దించింది. నాగార్జునకు ఇది కొత్త నియోజకవర్గం. పైగా పార్టీ శ్రేణులు మినహా ఈయనకు పరిచయస్తులు కూడా లేరు. ఇక్కడ గెలిచిన సుధాకర్ బాబుకు ఈ సారి టిక్కెట్ ఇవ్వలేదు. గెలిచిన వారంతా ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓడిన వాళ్ల చాలా సార్లు పోటీ చేశారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా గతంలో పనిచేశారు.

అందరి నుంచీ వ్యతిరేకత...

ప్రస్తుతం ఆయనకు పదవి పెద్ద అడ్డంకిగా మారిందని చెప్పొచ్చు. గ్రామాల్లో సక్రమంగా క్యాడర్ ను కలవలేకపోతున్నారు. కింది స్థాయి నాయకత్వం ఫెయిల్యూర్ అయింది. ముఖ్యమంత్రి బటన్ నొక్కుడుకే పరిమితం కావడం, నియోజకవర్గాల్లో ఏమి జరుగుతుందో డబ్బులు తీసుకుని సర్వేలు చేసే వారిపై ఆధారపడటం కూడా ఒక మైనస్ అని స్థానికులు చెబుతున్నారు. చీమకుర్తి మండలంలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గ్రూప్ ఒకటి కాగా, మారం వెంకారెడ్డి గ్రూపు ఒకటిగా ఉంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దర్శి ఎమ్మెల్యే సీటు ఇవ్వగా ఆయన దర్శికి పరిమితం అయ్యారు. వెంకారెడ్డితో కలిసి పనిచేద్దామంటే శివప్రసాద్ రెడ్డి ఒప్పుకోవడం లేదు. దీంతో మంత్రి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. సంతనూతలపాడు మండలంలో దుంపా చెంచిరెడ్డి వర్గం వుంది. ఎక్కువగా నాయకులు ఈయనతోనే ఉంటారు. ఆయన భార్య రమణమ్మ ప్రస్తుతం మండల ఎంపీటీసీ సభ్యురాలు. ఈ మండలంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ. ఆ తరువాత కమ్మ, బీసీ, ఎస్సీలు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి పూర్తి వ్యతిరేకత నాగర్జునకు ఉంది. ఎస్సీలు కూడా సహకరించే పరిస్థితి లేదు.

నాగులుప్పలపాడు మండలంలో ఎంపీపీ నల్లపురెడ్డి అంజమ్మ భర్త నల్లపురెడ్డి క్రిష్ణారెడ్డి రాష్ట్ర వాణిజ్య విభాగంలో నాయకుడు. ఆయన హవా మండలంలో కొనసాగుతోంది. ఇనగంటి పిచ్చిరెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్, మారెళ్ల బంగారు బాబు ఏఎంసీ చైర్మన్ గా ఉన్నారు. వీరు నాగార్జునకు వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

విచిత్రమేమిటంటే ఎస్ఎన్ పాడు ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకర్ బాబును నాలుగులప్పలపాడు మండలంలోని ఒమ్మెవరం గ్రామంలోని ఒక స్కూల్లో గంటపాటు స్థానికులు బంధించారు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా వెళ్లినప్పుడు బంధించి మా దగ్గర డబ్బులు తీసుకోకుండా ఏపనిచేశావో చెప్పాలని నిలదీశారు. దీనికి ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ఇక మద్దిపాడు మండలంలో కమ్మ, ఎస్సీ సామాజిక వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ కూడా కమ్మ సామాజిక వర్గం బలంగా వుండటం వల్ల టీడీపీకే ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీల వర్గాలు చెబుతున్నాయి.

అవినీతిపరులుగా ప్రచారం

మేరుగు నాగార్జున, టీజేఆర్ సుధాకర్ బాబులు అవినీతి పరులుగా పేర్కొంటూ సామాజిక మధ్యమాల్లో ఎక్కువగా పోస్టలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. సుధాకర్ బాబు డబ్బలు లేనిది ఏపనీ నియోజకవర్గంలో చేయలేదని బహిరంగంగానే చాలా మంది చెప్పడం విశేషం. అలాగే నాగార్జన కూడా అవినీతి చేస్తున్నాడనే అపవాదును మూట గట్టుకున్నాడు. పైగా దగ్గరికి వచ్చిన కార్యకర్తను ఆప్యాయంగా పలకరించే అలవాటు లేదు. ఇవన్నీ ఆయనకు మైనస్ లని స్థానికులు చెబుతున్నారు.

సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లో ఇద్దరు మంత్రలు ఏటికి ఎదురీదుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రాజకీయ పరిశీలకులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో వారికి కనీస గౌరవం కూడా స్థానికులు ఇవ్వడం లేదంటేనే వారిని తిరస్కరిస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. కొండపిలో సురేశ్ డబ్బును విపరీతంగా ఖర్చుపెడతారని ప్రచారం సాగుతోంది. నాగార్జున ఆ పనికూడా చేయలేరని స్థానికులు చెబుతున్నారు. ఎస్సీలకు నియోజకవర్గాల్లో పనులే కాకుండా కనీస వసతులు కల్పించడంలో కూడా మంత్రులుగా ఉండి విఫలయం అయ్యారని స్థానికులు వ్యాఖ్యానించడం విశేషం.

Next Story