శ్రీశైలం సుబ్రమణ్య ఆలయ నిర్మాణం ఆరోపణలపై స్పందించిన అజేయ కల్లం
ఏనుగుల చెరువును పునరుద్ధరించి, సుందరీకరణ చేయాలని దేవస్థానంవారు ఈ ట్రస్టును కోరారని, చెరువు స్థలాన్ని ట్రస్టుకు ఇచ్చారన్న ఆరోపణ నిజంకాదని అజేయ కల్లం చెప్పారు.
వైసీపీ హయాంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన మాజీ చీఫ్ సెక్రెటరీ అజేయ కల్లంపై శ్రీశైలంలో ఒక ఆలయ నిర్మాణానికి సంబంధించి పలు పత్రికలలో, ఛానళ్ళలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దానిలో తన ప్రమేయమేమీ లేదంటూ ఆయన తాజాగా ఒక వివరణ ఇచ్చారు.
అసలు వివాదం ఏమిటి?
శ్రీశైలంలోని ప్రసిద్ధ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయానికి సమీపంలో ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయం నిర్మాణానికి కొంతమంది పూనుకున్నారు. దానికి వ్యతిరేకంగా కొందరు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలుచేయగా, ఆ ఆలయ నిర్మాణ ప్రతిపాదనపై ఇటీవల హైకోర్ట్ ఆశ్యర్యం వ్యక్తం చేయటమే కాకుండా, ఏపీ ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టాలని సూచించటంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శ్రీశైలం ఆలయానికి పోటీగా ప్రైవేట్ ఆలయాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని, ఇదేం పద్ధతి అని హైకోర్ట్ వ్యాఖ్యానించింది.
శ్రీశైలం మల్లన్న ఆలయం వెనకవైపు సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తామని, వనాలు పెంచుతామని, దానికిగానూ అక్కడి ఏనుగుల చెరువు, హెలిప్యాడ్ ప్రాంతంలో 14 ఎకరాలు కేటాయించాలంటూ హైదరాబాద్‌కు చెందిన విజన్ బృందావన్ టెక్నోక్రాఫ్ట్స్ సంస్థ 2016లో శ్రీశైలం దేవస్థానాన్ని అభ్యర్థించింది. దానికి అంగీకరిస్తూ, ఒక ఎకరంలో ఆలయం నిర్మించాలని, మరో ఎకరాలో సుందరీకరణ చేసి, వాటిని తమకు అప్పగించాలని దేవస్థానం అధికారులు ఆదేశించారు.
ఆలయ నిర్మాణంకోసం వీబీ టెక్నోక్రాఫ్ట్స్ సంస్థ అజేయ కల్లం వంటి ముఖ్యులతో ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ ప్రణాళికలు, డిజైన్‌లు, నమూనా చిత్రాల పుస్తకాన్ని 2020 సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. అయితే ఇంత భారీ ఆలయం నిర్మాణాన్ని, చారిత్రక నేపథ్యం ఉన్న ఏనుగుల చెరువును ప్రైవేట్ సంస్థ అధీనంలోకి తీసుకోవటానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయింది. అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్ ఛైర్మన్ సంగాల సాగర్, మరొకరు దీనిపై హైకోర్టులో పిల్ దాఖలు చేయటంతో స్టే విధించారు.
ఆరోపణలు ఇవే!
వీబీ టెక్నోక్రాఫ్ట్స్ సంస్థ రెండెకరాలంటూ వచ్చి, తొలుత 16 ఎకరాలు, తర్వాత 28 ఎకరాలు తన అధీనంలోకి తీసుకుందని, అజేయ కల్లం, మరో ఇద్దరు ట్రస్టీలుగా 2018లో సేనాని సుబ్రమణ్యస్వామి ట్రస్ట్ ఏర్పాటు చేసిందని, ట్రస్ట్ తరపున విరాళాలు సేకరించి రు.250 కోట్లతో ఆలయం నిర్మిస్తామంటూ డ్రామా చేశారని మీడియాలో ఆరోపణలు వచ్చాయి. ఇంత భారీ ఆలయ నిర్మాణానికి దేవాదాయశాఖ కమిషనరేట్‌లో ఉండే స్థపతి, చీఫ్ ఇంజనీర్, శ్రీశైలం దేవస్థానం అధికారుల అనుమతులు తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వీబీ టెక్నోక్రాఫ్ట్స్ అధినేత ప్రభాకరరావు పట్టించుకోలేదని కూడా ఆరోపణ. చివరికి వీరశైవులు, జంగాలు, లింగాయత్‌లు తదితరులు పిల్ వేసి స్టే తీసుకురావటంతో నిర్మాణం ఆగిపోయింది.
అజేయ కల్లం ఏమంటున్నారు?
అజేయ కల్లం ఈ వివాదంపై ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ నిర్మాణ ప్రతిపాదనకు మూల కారకుడైన దాత మొదట ఈ ఆలయాన్ని తాను సొంత ఖర్చుతో నిర్మించాలని అనుకుని దిగాడని, అయితే ఖర్చు రు.60-70 కోట్లకు చేరుతుందని తెలియటంతో విరాళాల సేకరణకోసం ట్రస్ట్ ఏర్పాటు చేశాడని తెలిపారు. తాను 2017లో రిటైర్ అయ్యి ఖాళీగా ఉండటంతో, తనను ఈ దాత వచ్చి అడగటంతో అంగీకరించానని చెప్పారు. 2018లో ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. అక్కడ రు.40-50 లక్షల వ్యయంతో ప్రాజెక్ట్ ఆఫీస్, కట్టబోయే ఆలయ నమూనాను నిర్మించారని వెల్లడించారు. అయితే, ఆ పక్కనే ఉన్న ఏనుగుల చెరువును పునరుద్ధరించి, సుందరీకరణ చేయాలని దేవస్థానంవారు ఈ ట్రస్టును కోరారని, చెరువు స్థలాన్ని ట్రస్టుకు ఇచ్చారన్న ఆరోపణ నిజంకాదని అజేయ కల్లం చెప్పారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ హయాంలో ఈ ట్రస్టుకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యాలు పడటంతో వాటిని ఉపసంహరించేలా చేయటానికి ట్రస్ట్ వారు ఆ వ్యాజ్యాలు వేసినవారిని సంప్రదించారని, కానీ వారు ససేమిరా అనటంతో ట్రస్ట్ వారు నిర్మాణంపై వెనక్కు తగ్గారని అజేయ కల్లం చెప్పారు. ఆలయ నిర్మాణం ఇక తమవల్ల కాదని చెబుతూ ఆ ప్రాజెక్టును చేపట్టాలని శృంగేరి పీఠాన్ని ట్రస్ట్ కోరిందని తెలిపారు. తనపై వచ్చినవన్నీ చెత్త ఆరోపణలని అంటూ తీవ్రంగా ఖండించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అజేయ కల్లాం ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఆ మధ్య చాలా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్యకేసులో మొదట తాను ఇచ్చిన వాంగ్మూలం విషయంలోనే మాట మార్చటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు 2015-19లో మద్యం ఉత్పత్తిదారులపై ప్రివిలేజ్ ఫీజు తీసేయటంద్వారా అప్పటి టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలపై నమోదు చేసిన కేసులో అప్పటి ఎక్సైజ్ కమిషనర్, అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబులను నిందితులుగా చేర్చిన వైసీపీ ప్రభుత్వం ఆ జీవోను జారీ చేసిన అజేయ కల్లంను మాత్రం వదిలేయటంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు ఇదే విషయంపై అజేయ కల్లం ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఎక్సైజ్ పాలసీపై తీవ్ర విమర్శలు చేశారు. అనామక బ్రాండ్‌ల వలన ప్రజల ఆగ్రహానికి గురయ్యారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఓటమిని ఊహించానని, అయితే ఇంత ఘోరమైన ఓటమిని ఊహించలేదని చెప్పారు.